ఈసా మరణం ఎందుకు?!
అస్సలాంవలేకుం!
సృష్టికర్త మహోన్నత నామములో మీకు శుభము, సమాధానము, సత్యము, మోక్షము కలుగును గాక!
ప్రపంచములోని క్రైస్తవులు ముఖ్యముగా సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలును విశ్వసించే వారు బైబిలులోని సందేశాన్ని ఆధారం చేసుకొని ప్రతి సంవత్సరము ఏప్రెలు మాసములో రెండు దినాలను ప్రత్యేకమైన దినాలుగా గుర్తించి వాటిని శ్రద్ధాభక్తులతో గడుపుతుంటారు.
ఈ రెండు దినాలు ప్రభువైన యేసుక్రీస్తు [ఈసామసీహ్] వారి శ్రమలతోకూడిన మరణమును అటుతరువాత ఆయన పునరుత్థానమును అంటే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన సందర్భాలను పురస్కరించుకొని జరుపుకునే దినాలు.
నిజానికి యేసు ప్రభువు యొక్క ఘోర మరణము మానవాళి ప్రాయశ్చిత్తార్థము అంటే మానవుల పాపాలను క్షమించే ప్రక్రియకు ఆధారభూరితంగా వుండేందుకై సృష్టికర్త తానే నిర్వర్తించిన కార్యం అన్నది బైబిలు బోధ యొక్క సారాంశము.
ముస్లీంల ప్రశ్నలు
అయితే, ఈ సందర్భంగా క్రైస్తవేతరులకు ముఖ్యంగా ఇస్లాం మతస్తులకు మూడు రకాల ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం.
మొదటి రకానికి చెందిన ప్రశ్నలు ఇలా వుంటాయి:
ఈసా మరణం అవసరమా?
సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త సర్వశక్తిమంతుడు. ఆయనే సర్వాధికారి, సార్వభౌముడు. మానవులను క్షమించాలనుకున్నా లేక శిక్షించాలనుకున్నా దాన్ని ఆయన తక్షణం నిర్వర్తించగలడు. ఆయనను ప్రశించే వారెవరూ లేరు. అలాంటి సృష్టికర్త యేసు క్రీస్తు లేక ఈసా అల్ మసీహ్ వారి ఘోరమరణాన్ని ఆధారం చేసుకొనే మానవులను క్షమించాలా?
ఒక పాపిని క్షమించటానికి సృష్టికర్తకు ఈసా వారి మరణం ఆవశ్యకమా?
ఆయన మరణం లేకపోతే సృష్టికర్త పాపులను క్షమించే స్థితిలో లేడా?
రెండవ రకానికి చెందిన ప్రశ్నలు యిలా వుంటాయి:
ఈసా మరణం న్యాయమా?
ఒక పాపిని, దుష్టుని లేక అపరాధిని కాపాడటానికి ఒక అమాయకుని, నీతిమంతుని మరియు నిరపరాధిని శిక్షించటమన్నది న్యాయమేలా అవుతుంది?
అలాంటి విధానాన్ని లోకములోని ఏ చట్టమైనా లేక న్యాయవ్యవస్థ అయినా ఒప్పుకోదే! అందరికంటే అత్యున్నతమైన న్యాయవర్తనుడుగా వున్న సృష్టికర్త పాపులైన మానవులను క్షమించటానికి పరిశుద్దుడు ఏపాపమెరుగని మహాగొప్ప ప్రవక్త మరియు మసీహ్ అయిన ఈసా వారిని ఘోరంగా శిక్షించటమన్నది ఏరకంగా న్యాయమవుతుంది?
ఇక మూడవ రకానికి చెందిన ప్రశ్నలు క్రింది రకంగా ఉంటాయి:
ఈసా మరణం పాపాన్ని సమర్దించటము కాదా?
తప్పు చేసినవారికి శిక్షవిధించకపోగా వారి స్థానములో నీతిమంతుని శిక్షించటమన్నది గొప్ప అన్యాయమన్నది అటుంచి, అలాంటి విధానం తప్పుచేసిన వారిని సమర్ధించి వారిని పాపములో కొనసాగటాన్ని పురికొల్పుతుంది, కాదా?
అది పాపము చేయటానికి ఫ్రీప్యాస్ ను అందించటములాంటిదే కదా?
ఆవిధానములో క్షమాపణను అందుకున్న వ్యక్తులు యిక పాపము చేయటానికి భయపడక పోగా పైపెచ్చు యింకా ఘోరమైన పాపాలను చేయటానికి ప్రయత్నిస్తారు, కాదా?
ఈ వ్యాసంద్వారా నేను ఈ ప్రశ్నలకు విస్పష్టమైన జవాబులను మీముందు వుంచబోతున్నాను. అయితే, ముందస్తుగా సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు ప్రబోధాల ప్రకారము సృష్టికర్త యొక్క ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి.
సృష్టికర్తకున్న ప్రధాన గుణలక్షణాలు ఏవి? మానవజాతికి ప్రాప్తించిన విపత్తు ఏమిటి? యేసు క్రీస్తు లేక ఈసా అల్ మసీహ్ వారి ఘోర మరణానికున్న ఆంతర్యమేమిటి? అన్న మూడు ప్రాముఖ్యమైన అంశాలను వివరిస్తాను. ఆ వివరణ వెంటనే ముస్లీము మతస్తుల ప్రశ్నలకు జవాబులను మీ ముందుంచబోతున్నాను.
సృష్టికర్త గుణలక్షణాలు
బైబిలులో తననుతాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్తకు అనేక గుణలక్షణాలున్నయి. వాటిలో ప్రధామైనవి మూడు నైతిక గుణలక్షణాలు. అవి, పరిశుద్ధత, న్యాయతత్వం, మరియు ప్రేమ.
మొదటిది ‘పరిశుద్ధత’ అనే గుణలక్షణం. ఇది అనేక గుణాలుగా వ్యక్తపరచబడింది. ప్రత్యేకత, పవిత్రత, సంపూర్ణత, ఆత్మీయ వెలుగు మొదలైన గుణాలు మచ్చుకు కొన్ని. ఈ గుణలక్షణాని బట్టి అపవిత్రతకు అసంపూర్ణత్వానికి లేక అలాంటి వ్యక్తులకు సృష్టికర్త సన్నిధిలో ఎలాంటి స్థానం లేదు.
రెండవది ‘న్యాయతత్వం’ అనే గుణలక్షణం. ఈ గుణలక్షణాన్నిబట్టి సృష్టికర్తలో పక్షపాతానికి తావులేదు. మంచికి ఈవులను చెడుకు శిక్షను అందించటమన్నది న్యాయతత్వానికున్న ఒకానొక ప్రధాన లక్షణం. సృష్టికర్త న్యాయవ్యవస్థలో నిజమైన పశ్చత్తాపానికి క్షమాపణ వుంది. అయితే, దాన్ని పొందటానికి చేయబడిన చెడుకు కేవలము పశ్చత్తాపపడితే సరిపోదు. పశ్చత్తాపముతోపాటు జరిగిన నష్టానికి తగిన వెల చెల్లించడముద్వారానె క్షమాపణ సాధ్యపడుతుంది. [తవ్రాత్ (సం.కాం.5:5-8)]
దేవుని న్యాయవ్యవస్థలో క్షమాపణ అన్నది పాపాన్ని పట్టించుకోకపోవడంద్వారానో లేక దాన్ని దాచిపెట్టడంద్వారానో లేక దాన్ని అమోదించడంద్వారానో కలుగదు; పాపముద్వారా సంభవించిన నష్టానికి తగిన వెలను చెల్లించటముద్వారా మాత్రమే క్షమాపణ కలుగుతుంది. ఆ వెలను పాపాన్ని చేసిన వ్యక్తి అయినా చెల్లించాలి లేక ఆవ్యక్తి పక్షంగా పాపరహితుడైన మరొక వ్యక్తి అయినా స్వచ్ఛందంగా చెల్లించాలి. [తవ్రాత్ (యెషయా.53:8-11)]
ఇక మూడవ గుణలక్షణం ‘ప్రేమ.’ ఈ గుణలక్షణానికి అనేక విభాగాలు వున్నాయి. అందులో ఒకటి తననుతాను అర్పించుకోవటం. ప్రేమ యొక్క అత్యుత్తమ వ్యక్తీకరణ అన్నది స్వీయత్యాగం ద్వారానే సాధ్యపడుతుంది. సృష్టికర్త యొక్క ప్రేమాతత్వం ఊహాతీతమైనది. అత్యుత్తమమైన మరియు అత్యున్నతమైన ప్రేమకు ఆయనే ప్రతిరూపం.
మానవజాతి విపత్తు
ఇక మానవులకు ప్రాప్తించిన విపత్తుగురించి అలోచిస్తే సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు వివరణప్రకారము మానవులు ఆలోచనలద్వారా, మాటలద్వార, క్రియలద్వారా అపవిత్రతను దుర్నీతిని సంపాదించుకొని పరిశుద్ధుడైన సృష్టికర్తకు వ్యతిరేకమైన దిశలో జీవిస్తూ ఆయన సన్నిధిలోకి వెళ్ళే అర్హతను కోల్పోయారు.
అంతమాత్రమేగాక సృష్టికర్త యొక్క న్యాయతత్వాన్నిబట్టి తమ చెడు జీవితానికి తగిన ఫలాన్ని/శిక్షను మానవులు పొందబోతున్నారు. ఇది పరిశుద్ధుడైన సృష్టికర్త సన్నిధికి దూరంగా ఆయా వ్యక్తులకు వారివారి పాపాలకు తగిన మోతాదులోనే అమలుకాబోతున్న ప్రక్రియ.
ఈసా మసీహ్ మరణము
చివరగా యేసు క్రీస్తు [ఈసామసీహ్] పొందిన ఘోర మరణము యొక్క పరమార్థం ఏమిటి అని ఆలోచించాలి.
బైబిలు వివరణ ప్రకారం తమ అపవిత్రతచేత దుర్నీతిచేత పరిశుద్ధుడు న్యాయవంతుడు అయిన సృష్టికర్త సన్నిధిలోకి ప్రవేశించే అర్హత కోల్పోయి నిత్యశిక్షకు పాత్రులయ్యారు మానవజాతి అంతా.
అయితే, ప్రేమతత్వమనే నైతిక గుణలక్షణాన్ని కలిగివున్న సృష్టికర్త మానవులందరిని ప్రేమించేవాడు కనుక మానవులకు దాపురించిన విపత్తులోనుండి వారిని కాపాడి వారికి పరిశుద్ధతను నీతిని ఆపాదించి తద్వారా వారు తన సన్నిధిలో నిత్యమోక్షాన్ని అనుభవించే భాగ్యాన్ని పొందేందుకు వీలైన ప్రణాలికను విరచించాడు.
మానవ జాతి యొక్క పాపక్షమాపణా పరిష్కారం కేవలం మానవులమధ్యలోనుండే రాలేకపోయింది. అందుకు కారణం సంపూర్ణ దైవగ్రంథం బైబిలు ప్రకటిస్తున్నదాని ప్రకారం యే భేదం లేదు మానవులందరు పాపముచేత కళంకమైనవారే. [తవ్రాత్ (1రాజులు.8:46; కీర్తన.14:2-3; 143:2; ప్రసంగి.7:20); ఇంజీల్ (రోమా.3:23; 5:12)]
ఏ నరుడుకూడా తన పొరుగువాని తరపున పాపప్రాయశ్చిత్తం చేసి అంటే పొరుగువాడు చేసిన పాపాలకు తగిన వెలను చెల్లించి తన పొరుగువాన్ని న్యాయబద్దమైన శిక్షనుండి విడిపించే స్థితిలో లేడు [తవ్రాత్ (కీర్తన.49:7-9)]. కారణం, ప్రతి నరుడు కూడా పాపముచేత కళంకమైనవాడే కాబట్టి. ఒకవేల పాపమే లేని నరమాత్రుడంటూ వుంటే ఆ నరుడు తన విలువనుబట్టి తనలాంటి మరొక వ్యక్తి తరపున ప్రాయశ్చిత్తం చేసి ఒక్క వ్యక్తిని మాత్రమే శిక్షనుండి తప్పించగలడేమో!
సృష్టి మొదలుకొని తీర్పుదినమువరకు ఈ భూలోకముపై సృష్టించబడే లెక్కలేనంత సంఖ్యలో వుండే మానవులందరి తరుపున ప్రాయశ్చిత్తం చేయగల స్థితి, స్థాయి, విలువకలిగిన నరమాత్రుడెవరూ లేరు. ఆ పాత్రను పోశించాలంటే అనంతవిలువను కలిగిన దైవాంశసంభూతుడే అవతరించాలి. సరిగ్గా అదే జరిగింది యేసు క్రీస్తు [ఈసా అల్-మసీఅహ్] నందు.
[ఇంజీల్ యోహాను.1:1-2,14; రోమా.9:5; 2కొరింథీ.4:4; ఫిలిప్పీ.2:5-8; తీతుకు.2:13; హెబ్రీ.1:3-4,8].
ఈ లోకములో దైవాంశసంభూతునిగా అవతరించిన యేసు క్రీస్తు [ఈసా మసీహ్] యే పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని జీవించి మానవులందరి పాపాల ప్రాయశ్చిత్తార్థమైన బలిగా తన్నుతాను అర్పించుకొని ప్రవక్తలు ముందే ప్రవచించి చెప్పిన ఒక ప్రత్యేకమైన ‘దేవుని సేవకుడు’ [తవ్రాత్ (యెషయా.52:13-53:12)] అన్న పాత్రను పోశించాడు. ఈ విధంగా మానవాళి యెడల సృష్టికర్త విరచించిన మహోన్నత ప్రణాళిక నెరవేర్చబడింది.
తన ప్రణాలికలో భాగంగా ఒకవైపు తన న్యాయతత్వాన్ని తృప్తిపరచే వెలను తానే చెల్లించి మరొకవైపు తన పరిశుద్ధత ఆశిస్తున్న స్థాయిలో నీతిని తానే సిద్ధపరిచి సృష్టికర్త మానవాళికి మోక్షప్రాప్తిని అందుబాటులోకి తెచ్చాడు. మానవులకసాధ్యమైన ఈ రెండింటిని తన అంశతో ఈలోకములో జన్మించిన యేసు క్రీస్తు [ఈసామసీహ్] యొక్క జీవితం, శ్రమలు, మరియు మరణాలద్వారా సాధించి పెట్టాడు. ఇందులో సృష్టికర్త యొక్క స్వీయత్యాగం వుంది. ఇది మానవాళిపట్ల సృష్టికర్త చూపిన ప్రేమాత్యాగం!
ఇదంతా వాస్తవంగానే మానవాళి రక్షణకొరకు సృష్టికర్త తానే స్వయంగా ఏర్పాటు చేసిన బృహత్ప్రణాళిక అన్నదానికి తిరుగులేని ముద్రగా యేసు క్రీస్తు [ఇసా మసీహ్] మానవాళి కొరకైన పాపప్రయశ్చిత్తార్థ మరణము పొంది అటుతరువాత తాను ముందే స్పష్టీకరించిన విధంగా మూడు రోజులలో మరణాన్ని జయించి తిరిగి సజీవుడుగా లేచాడు!
[ఇంజీల్ (మత్తయి.17:22-23; 28:1-20; మార్కు.9:31; 16:1-20; లూకా.18:31-33; 24:1-53; యోహాను.10:18; 20:1-31)]
క్షమాపణ మరియు మోక్షం
అపవిత్రతతో దుర్నీతితో వున్న ఏ వ్యక్తి అయినా తన దుస్థితిని గుర్తించి పశ్చత్తాప హృదయముతో మానవాళి యెడల సృష్టికర్త యేసు క్రీస్తు నందు నెరవేర్చిన ప్రేమాత్యాగాన్ని విశ్వసించి ఆయనను క్షమాపణ వేడుకుంటే ఆ వ్యక్తి ఆంతర్యములో తిరిగి జన్మించినవాడై మోక్ష ప్రాప్తిని పొందగలడు. అలాంటివ్యక్తి ఈ లోకములో క్రొత్త జీవితాన్ని ప్రారంభించి క్రొత్త స్వభావములో ఎదుగుటకు మొదలుబెడుతాడు.
ప్రశ్నలకు జవాబులు
ఇక ఈ అంశానికి సంబంధించి క్రైస్తవేతరులకు మరిముఖ్యముగా ఇస్లాం మతస్తులకు వచ్చే ప్రశ్నలను గురించి ఆలోచిద్దాం.
మొదటి రకానికి చెందిన ప్రశ్న.
సృష్టికర్త సార్వభౌముడు గనుక మానవులను క్షమించి మోక్షాన్ని ప్రసాదించటానికి ఆయనకు అడ్డేమిటి?
ఇందుకుగాను యేసు క్రీస్తు లోకములోకి రావటము, శ్రమలను అనుభవించటము, మరణించటము, తిరిగిలేవటము అనే సుధీర్ఘ ప్రణాళిక యొక్క ఆవశ్యకత సృష్టికర్తకు వుందా?
జవాబు
సంపూర్ణదైవగ్రంథమైన బైబిలు బోధ ప్రకారము వుంది! ఎందుకంటే…
ఒక పాపిని క్షమించి మోక్షాన్ని అనుగ్రహించటమన్నది తనకున్న సార్వభౌమత్వముద్వారా సృష్టికర్త చేయగలడు అని భావిస్తే అదే కారణాన్నిబట్టి ఆయన ఏపాపమెరుగని ఒక నీతిమంతుని శిక్షించి నరక ప్రాప్తుని చేయగలగాలి. అలాంటి ప్రవృత్తి చపలచిత్తానికి మరియు అన్యాయానికి తిరుగులేని నిదర్శనం. ఈ దుర్గుణాలు సృష్టికర్తకు వుండవు, వుండకూడదు.
నిజమైన సృష్టికర్త పాపులైన మానవులను కాపాడి మోక్షాన్ని అనుగ్రహించాలన్న ప్రేమ తపనను కలిగినవాడు గనుక ఆయన ఆ కార్యాన్ని పరిశుద్ధత మరియు న్యాయతత్వం అనే తన ప్రవృత్తులకు వ్యతిరేకంగా కాకుండా వాటి పరిధులలోనే సాధించటానికి సుధీర్గమైన ప్రణాళిక అవసరత వుంది. ఆ ప్రణాళికలో భాగంగా మానవుల పాపాల ఫలితమైన నష్టానికి తగిన వెలను తానే చెల్లించి తన న్యాయతత్వాన్ని తృప్తిపరచాడు. అది ప్రభువైన యేసు క్రీస్తు [ఈసామసీహ్] వారి శ్రమలతోకూడిన మరణములో నెరవేర్చబడింది.
రెండవ రకానికి చెందిన ప్రశ్న.
పాపులను తప్పించటానికి ఏపాపమెరుగని నీతిమంతుడైన యేసును శిక్షించటము అన్యాయం కాదా?
జవాబు
నిజానికి ఒక అపరాధిని శిక్షనుంచి తప్పించటానికి ఒక నిరపరాధిని శిక్షకు గురిచేయటమన్నది నిరాపేక్షంగా అన్యాయమే. అయితే పాపులను రక్షించే ప్రణాళికలో భాగంగా యేసు క్రీస్తు [ఈసామసీహ్] యొక్క శ్రమలతో కూడిన మరణముద్వారా సృష్టికర్త జరిగించిన కార్యం అలాంటిది కాదు. దైవాంశసంభూతుడైన యేసు క్రీస్తు [ఈసామసీహ్] దైవ ప్రణాళికలోని ప్రతిక్షేపణా [substitution] పాత్రను పోశించి మానవులకు విమోచనను సంపాదించి వారు మోక్షాన్ని పొందే మార్గాన్ని సుగమం చేయటానికి తన యిచ్చపూర్వకంగా వచ్చాడు. మరోవిధంగా చెప్పలంటే మానవుల పాపాలకు తగిన శిక్షను విధించింది ఆయనే [అందుకు కారణం ఆయన యొక్క న్యాయతత్వం], ఆ శిక్షకు తగిన వెలను చెల్లించింది కూడా ఆయనే [అందుకు కారణం ఆయన యొక్క ప్రేమాతత్వం]!
మూడవ రకానికి చెందిన ప్రశ్న.
ఇది పాపాన్ని సమర్దించి దుష్టులు దుర్మార్గములోనే కొనసాగటాన్ని ప్రోశ్చహించటము కాదా?
జవాబు
ఏభేదం లేకుండా ఏనియమం లేకుండా చేసిన పాపాలకు ఎవరు ఏవెల చెల్లించకుండానే పాపులందరిని ఏకపక్షంగా క్షమించి మోక్షం ప్రసాదిస్తే తప్పకుండా అది పాపాన్ని సమర్దించి దుష్టులు దుర్మార్గములోనే కొనసాగటాన్ని ప్రోత్సహించటమవుతుంది.
కాని, ఈసా అల్-మసిహ్ [యేసు క్రీస్తు] నందు సృష్టికర్త నిర్వర్తించిన రక్షణకార్యం అన్నది అలాంటిది ఎంతమాత్రము కాదు. తమ దుర్నీతిని అపవిత్రతను గుర్తించి పశ్చత్తాపపడి తమ స్వంత నీతిపై లేక భక్తిపై ఆధారపడకుండా ఈసా మసిహ్ నందు సృష్టికర్త తానే నిర్వర్తించిన రక్షణకార్యమందు విశ్వాసముంచి ఆయనను క్షమాపణ వేడుకున్న పాపులకు మాత్రమే క్షమాపణ, మోక్షము. ఆరకంగా దైవానుగ్రహాన్ని పొందిన వ్యక్తులు క్రొత్త జీవితాన్ని సృష్టికర్తకు అంగీకారమైన రీతిలో ఆయన ఆత్మసహాయముతో జీవిస్తూ ఆయన లేఖనాలైన బైబిలు వెలుగులో కొనసాగాలి.
మీకు వ్యక్తిగతమైన పిలుపు
ప్రియమైన ముస్లీం సోదరాసోదరీలారా,
మీ పై దేవుని/అల్లాహ్ యొక్క దీవెనలు మెండుగా కుమ్మరించబడునుగాక!
సృష్టికర్త అనంత కరుణామయుడు. మానవులలో ఎవరు నరకములో ప్రవేశించటం ఆయన చిత్తం కాదు. అందుకే నిన్నూ నన్నూ క్షమించి మనకు క్రొత్త జీవితాన్ని ఒసగి నరకశిక్షనుండి తప్పించి మోక్షాన్ని ప్రసాదించాలన్న మహోన్నత సంకల్పముతోనే ఈ లోకములోకి ఈసా అల్-మసీహ్ వారిని పంపించటము జరిగింది. కేవలం ఆయనద్వారానే మానవాళికంతా నిజమైన మోక్షమార్గము లభిస్తుంది. ఈసా అల్-మసీహ్ వారు ఇప్పటికి సజీవుడు. కనుక, ఆయన మీ ప్రార్థనను విని మీకు మేలు చేయగల ఏకైక రక్షకుడు. దేవుడు/అల్లాహ్ మిమ్ములను దీవించునుగాక!
One Response
Hi praise the LORD