పునరుత్థానము: ముస్లీం సందేహాలు

పునరుత్థానము: ముస్లీం సందేహాలు

April 19, 2021 ప్రశ్నలు ముస్లీంల ప్రశ్నలు 0

క్రైస్తవ విశ్వాసానికి మూలరాయి క్రీస్తు సిలువయాగం. దాని పర్యవసానంగా మరణం పై సంభవించిన విజయమే పునరుత్థానానికి నాంది!

బైబిల్ లోని పునరుత్థానాన్ని గురించి ఒక ముస్లీం దావా ప్రచారకుడు కొన్ని ప్రశ్నలను లేవనెత్తాడు. ఆ ప్రశ్నలను పరిశీలించి చూసాము. అవన్నీ అర్థవంతమైన ప్రశ్నలే. సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్ ప్రకటిస్తున్న పునరుత్థానాన్ని గురించి క్రైస్తవ విశ్వాసానికి వెలుపల ఉన్న ఏవ్యక్తికైనా రావలసిన ప్రశ్నలవి. అవి సత్తువ కలిగిన ప్రశ్నలు, వాటికి సత్తువ కలిగిన జవాబులే కావాలి!

ఇక ప్రశ్నలను అడిగిన విధానాన్ని గురించి పరిశీలించి చూస్తే అది సంస్కారవంతంగా ఉంది అని చెప్పవచ్చు. ప్రశ్నలలో వాటిని లేవనెత్తిన వ్యక్తి క్రైస్తవులనుగాని లేక క్రైస్తవ విశ్వాసాలనుగాని కించపరచిన ఆధారాలేవీ లేవు. ఇది అభినందనీయం!

చివరగా, ప్రశ్నలను అడిగిన ఉద్దేశ్యం ఏమిటి…? సత్యాన్ని ప్రేమించి, సత్యాన్ని అన్వేశిస్తూ, సత్యాన్ని హత్తుకొని దానికి దాసోహమై నిత్యజీవాన్ని పొందాలన్న తపనే ప్రశ్నల ఉద్దేశ్యమైతే ప్రశ్నలను లేవనెత్తిన ఆ దావా ప్రచారకున్ని సృష్టికర్త దీవించి సత్యాన్ని గ్రహింపచేసి నాశనమార్గములోనుండి జీవమార్గములోనికి నడిపించాలని మా ప్రార్థన. అలాంటి ఉద్దేశం ఉన్న ప్రతి వ్యక్తినీ దేవుడు దీవించి సత్యాన్ని గ్రహింపచేసి నిత్యజీవాన్ని అనుగ్రహించును గాక!

అలా కాకుండా క్రైస్తవుల విశ్వాసాన్ని కలవరపరచాలన్న కపటంతో మరియు కుయుక్తితో ప్రశ్నలను లేవనెత్తి ఉంటే క్రింద మీముందు ఉంచబోతున్న వాక్యాధారమైన జవాబులు ప్రశ్నలను లేవనెత్తిన దావా ప్రచారకునికొరకుగాని లేక ఆయనలాంటి స్వభావలక్షణలను కలిగిఉన్న వారికొరకుగాని ఉద్దేశించబడినవి కావు. దైవ సత్యాలు పరిశుద్ధమైనవి మరియు ప్రశస్తమైనవి. వాటి పట్ల వ్యతిరిక్త ప్రవర్తనను ప్రదర్శించేవారి ముందు వాటిని పెట్టవద్దు అన్నది ప్రభువే యిచ్చిన హితబోధ [మత్తయి.7:6].

కనుక, క్రింది జవాబులు సత్యసంబంధులకు మరియు సత్యాన్వేశకులకొరకు మాత్రమే అన్నది చదువరులు గ్రహించగలరు!

ముస్లీం ప్రశ్న – 1

పాత నిబంధన గ్రంధములో పునరుత్థానము గూర్చిన ప్రస్తావన ఏదీ? ప్రవక్తలు తమ జాతి ప్రజలకు బోధించారా? లేదా?

క్రైస్తవ వివరణ:

పాత నిబంధన గ్రంధములో ‘పునరుత్థానము’ గూర్చిన ప్రస్తావన ఉంది. అయితే దాని గ్రహించటానికి ముందు ‘పునరుత్థానము’ అంటే ఏమిటో అర్థం చేసుకోగలగాలి.

‘పునరుత్థానము’ అన్న పదం క్రొత్తనిబంధనా గ్రంథము యొక్క మూలభాష అయిన గ్రీకు భాషలోని అనస్తాసిస్ [ἀνάστασις = లేచి నిలబడుట] అనే పదపు తెలుగు అనువాదం. “లేచి నిలబడుట” అన్న అర్థాన్ని కలిగి వున్న ఈ పదం క్రొత్తనిబంధనలో “మృతులు లేచి నిలబడుట” అనే భావార్థాన్ని అందించే సందర్భాలలో “మృతుల పునరుత్థానము” [resurrection of the dead] గా అనువదించబడింది.

“మృతులు లేచి నిలబడటము” లేక మృతులైన వారు సజీవులుగా మారబోతున్నారు అన్న సంఘటన దేవుని తీర్పు దినాన సంభవించబోతున్న వాస్తవం. మరణించిన మనుషులు మట్టిలో కలిసిపోయినా వారిలోని ప్రతివ్యక్తి ఆ దినాన తిరిగి సజీవునిగా లేచి నిలబడబోతున్నాడు. అందులో కొందరు నిత్యజీవానికి వారసులుగా ఉండటానికి మరికొందరు తీర్పు/శిక్షను అనుభవించటానికి సజీవులుగా మారబోతున్నారు.

ఈ వివరాలు నిజప్రవక్తల పరంపరద్వారా అందించబడిన గ్రంథాలలో [తవ్రాత్, జబూర్, ఇంజీల్ = బైబిల్] ప్రజలకు అందించబడ్డాయి. అందులో మచ్చుకు కొన్ని ఈ క్రింద యివ్వబడిన లేఖనాలు:

ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.” (యోబు.19:26)

అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.” (కీర్తన.16:9-11)

మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.” (యెషయా 26:19)

మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.” (దానియేలు.12:2)

​”అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.” (హోషేయా 13:14)

ముస్లీం ప్రశ్న – 2

మత్తయి 22: 23
పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి..
అపో.కార్యములు 23: 7
సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురుగాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.

పునరుత్థానములేదని, దైవ దూత యైనను, ఆత్మయైనను లేదని సద్దూకయ్యులకు ఆ విశ్వాసము ఎక్కడ నుండి వచ్చింది?

క్రైస్తవ వివరణ:

పునరుత్థానము ఉందని, దేవదూతలు మరియు ఆత్మలు ఉన్నారని దైవ లేఖనాలు బోధిస్తున్నాయి. అయినా, ఆ లేఖనాలను సరిగ్గా ధ్యానించక దుర్బోధకుల వ్యాఖ్యానాలను లేక అబద్ధ ప్రవక్తల ప్రకటనలను విశ్వసించి అసత్యమార్గాలలో పయనిస్తున్న మతమూఢులు ఈనాడేకాదు ఆనాడుకూడా ఉన్నారు అని నిజవిశ్వాసులు గ్రహించటానికి సద్దూకయ్యులు మరియు వారి విశ్వాసాలు చక్కటి నిదర్శనం!

ముస్లీం ప్రశ్న – 3

మత్తయి 22:31
మృతుల పునరుత్థానమునుగూర్చినేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?

పునరుత్థానము గూర్చి దేవుడు ఎవరితో ఏమని చెప్పాడు? అది ఎక్కడ వ్రాయబడి ఉన్నది? వివరణ కూడా ఇవ్వండి!

క్రైస్తవ వివరణ:

పై లేఖన భాగము యొక్క సందర్భము ప్రభువైన యేసు క్రీస్తు యూదులలోని సద్దూకయ్యులు అనబడే వారి ప్రశ్నలకు జవాబివ్వటం.

సద్దూకయ్యులు అసత్యములో జీవిస్తూ పరలోకాన్ని గురించి అవగాహనాలోపాన్ని కలిగి ఉండేవారు. వారి లోపభూయిష్టమైన మతవిశ్వాసాలను బట్టి యేసు ప్రభువు యొక్క బోధలను సరియైన విధంగా అర్థం చేసుకోలేక ఆయన బోధిస్తున్న పునరుత్థాన సంఘటనను ఆధారం చేసుకొని ఈనాడు కొన్ని మానవకల్పిత మతాలలో అభివర్ణించబడుతున్నట్లుగా పరలోకంలో భౌతికపరమైన సుఖభోగాలు ఉంటాయని భ్రమపడ్డారు.

వారి ఆత్మీయ అజ్ఙానాన్ని అలాగే పరలోకాన్ని గురించి వారికున్న అనైతిక అభిప్రాయాన్ని ఖండిస్తూ ప్రభువు పై మాటలు పలికాడు.

ఈ సందర్భములో ప్రభువు ఖండిస్తున్నది ఏమిటి…?
మరణించిన వారందరు సజీవులుగా మార్చబడిన తరువాత వారు ఐహికసుఖభోగాలను అనుభవిస్తారు, వారిలో లింగభేదాలు కొనసాగుతాయి, మరియు వారు వివాహాలు చేసుకోబూతున్నారు అనే సత్యదూరమైన దురభిప్రాయాలను యేసు ప్రభువు ఖండిస్తున్నాడు.

నిజానికి అలాంటి దుర్బోధలద్వారా అబద్ధ బోద్ధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ మతాలు ఐహిక సుఖభోగాలకు అర్రులుచాచే అధములను మభ్యపెడుతూ అలాంటివారిని ఆకట్టుకునేందుకు పరలోకాన్నే పరమ నీచస్థాయిలో అభివర్ణిస్తున్నాయి.

ఈ విశయములో మతమూఢులైన సద్దూకయ్యులకు బుద్ధి చెప్పే ప్రయత్నములోనే యేసు ప్రభువు “మృతుల పునరుత్థానమునుగూర్చి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువలేదా?” అంటూ ప్రశ్నించాడు.

పాతనిబంధన గ్రంథములోని “నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నాను” అన్న లేఖన భాగములో మర్మంగా అందించబడిన మృతుల పునరుత్థానానికి చెందిన సత్యాన్ని క్రొత్తనిబంధన బోధలో భాగంగా యేసు ప్రభువు విశదీకరిస్తున్నాడు.

దేవుడు “నేను అబ్రాహాముకు దేవునిగా ఉంటిని, ఇస్సాకుకు దేవునిగా ఉంటిని, యాకోబుకు దేవునిగా ఉంటిని” [I was the God of Abraham, Isaac, and Jacob] అని చెప్పటం లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మృతులై ఉన్నా వారు సజీవులుగా మారబోతున్నారన్న సత్యాన్ని ప్రతిభింబిస్తూ ఆయన, “నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నాను” [I am the God of Abraham, Isaac, and Jacob] అని ప్రకటించాడు. అందులో దాగి ఉన్న సూక్ష్మమైన ఈ మర్మాన్ని యేసు ప్రభువు ఆనాటి అసత్యములో జీవిస్తున్న మతమూఢులకు వివరించే ప్రయత్నం చేసాడు.

అసత్యంలో జీవిస్తున్న మతమూఢులైన వారికి ఈ సత్యం ఆనాడైనా ఈనాడైన అర్థం కావటం బహుకష్టం!

ముస్లీం ప్రశ్న – 4

లూకా 20: 35
పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు.

పునరుత్థానము పొందుటకు యోగ్యులని యెంచబడినవారు ఎందుకు పెండ్లి చేసికొనరు? దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వండి!

క్రైస్తవ వివరణ:

పై వాక్య సందర్భాన్ని పరిశీలించి గమనించాల్సిన విశయం, ఈ లేఖనము ప్రస్థావిస్తున్నది పరమునకు లేక పరలోకములోకి ప్రవేశించకముందు ప్రవేశించేవారి అర్హతను గురించిన వివరణ కాదు. అది పరలోకములోకి ప్రవేశించగలిగిన వారి స్థితిని గురించిన వివరణ.

పునరుత్థానమునకు అంటే జీవపునరుత్థానమునకు యోగ్యులని యెంచబడి పరలోకములోకి ప్రవేశింపజేయబడినవారందరు పెండ్లిచేసికోరు, పెండ్లికియ్యబడరు.

అందుకు కారణం, పరలోకం ఈ భూలోకమువలె భౌతిక అవసరతలు సుఖాలు కలిగిన స్థలం కాదు. అక్కడికి ప్రవేశించేవారందరు భౌతిక శరీర లక్షణాలకు అతీతమైన మహిమ శరీరాలతో వసిస్థారు. కనుక, అక్కడివారు పెండ్లిచేసికోరు, పెండ్లికియ్యబడరు.

ముస్లీం ప్రశ్న – 5

లూకా 20: 36
వారు పునరుత్థానములో పాలివారైయుండి,(మూలభాషలో-పునరుత్థానపు కుమారులై యుండి) దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.

అసలు పునరుత్థానము అని దేనిని అంటారు?
చావరు అంటే అర్ధం ఏమిటి?
దేవదూతలకు మరణం ఉందా లేదా?
దేవుని కుమారులకు మరణం ఉందా లేదా?

క్రైస్తవ వివరణ:

మానవులు మరణించిన తరువాత తిరిగి బ్రతికిన సందర్భాలు పాతనిబంధన గ్రంథములో అలాగే క్రొత్తనిబంధన గ్రంథములో అనేక పర్యాయాలు పేర్కొనబడ్డాయి. వాటిలోని మచ్చుకు రెండు ఈ క్రింద యివ్వబడినవి:

“ఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొని యెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను. ” (1రాజులు.17:21-22)

“ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.” (యోహాను.11:43-44)

పై సందర్భాలలో చనిపోయిన వ్యక్తులు తిరిగి బ్రతికారు. అది పునరుత్థానము [resurrection] కాదు. అది కేవలం పోయిన ప్రాణం తిరిగి రావటం [resuscitation/revitalization]. అలా చనిపోయి తిరిగి బ్రతికిన వారు కొంతకాలానికి అందరిలా చనిపోయారు.

అయితే, పునరుత్థానము పొందేవారు ముఖ్యంగా జీవ పునరుత్థానాన్ని పొందేవారు ఇంకెప్పుడు మరణించరు. అంతేగాక, వారు పరలోక వాసులలా అంటే దేవదూతలలా మహిమ శరీరాలను ధరిస్తారు. మహిమశరీరం భౌతిక ప్రపంచములో భాగం కాదు. కనుక, అది భౌతిక నియమాలకు అతీతమైనది మరియు అదృశ్యమైనది. అయినా, పరలోక వాసులు ధరించే ఆ మహిమశరీరం వారి యిచ్చను బట్టి తాత్కాళికంగా భౌతిక ప్రపంచములో ప్రతక్షం కాగలదు మరియు భౌతిక నియమాలతో పొందిక కలిగి ఉండగలదు.

పరలోకములో వసించే దూతలైనా లేక జీవపునరుత్థానం ద్వారా పరలోకంలోకి ప్రవేశించిన నిజవిశ్వాసులైనా మహిమ శరీరాలతో మరణాతీతులుగా నిత్యం జీవిస్తారు.

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్ బోధిస్తున్న ‘పునరుత్థానం’ అన్నది మరణాన్ని దాటిన లేక జయించిన స్థితి!

ముస్లీం ప్రశ్న – 6

యోహాను 5: 29
మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

జీవ పునరుత్థానము అంటే ఏమిటి?
తీర్పు పునరుత్థానము అంటే ఏమిటి?

క్రైస్తవ వివరణ:

జీవ పునరుత్థానమన్నది నిజవిశ్వాసులు అంటే స్వంత భక్తిపై మరియు స్వంతనీతిపై ఆధారపడకుండా దేవుడే యేసుక్రీస్తు యొక్క సిలువ బలియాగముతో సిద్ధపరచిన రక్షణ కార్యాన్ని విశ్వసించి నూతన జన్మానుభవములోకి ప్రవాశించి దేవుని పిల్లలుగా మారిన వారు పొందే పునరుత్థానము. ఆ పునరుత్థానం పరలోకానికి మరియు నిత్య జీవానికి ప్రవేశద్వారం!

తీర్పు పునరుత్థానమన్నది అనీతిమంతులు మరియు మతమూఢులు, అంటే దేవుడే యేసుక్రీస్తు యొక్క సిలువ బలియాగముతో సిద్ధపరచిన రక్షణ కార్యాన్ని విశ్వసించకుండా స్వంత భక్తిపై స్వనీతిపై ఆధారపడి మానవకల్పిత మతాలలో కొనసాగుతున్న వారు, పొందబోయే పునరుత్థానము. ఈ పునరుత్థానం శిక్షకు మరియు నరకానికి ప్రవేశద్వారం!

ముస్లీం ప్రశ్న – 7

యోహాను 11: 25
అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;

పునరుత్థానమును జీవమును నేనే అంటే అర్ధం ఏమిటి?
యేసు నందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అంటే?
లాజరు లాగా లేక మరేదైనా?

క్రైస్తవ వివరణ:

ప్రభువు పలికిన మాట, “పునరుత్థానమును జీవమును నేనే!” దీని భావం మానవులకు పునరుత్థానాన్ని అంటే మరణించిన తరువాత వారిని తిరిగి మరణించని విధంగా సజీవులను చేసేది నేనే [యేసే]! ఆలాగే, తిరిగి మరణించకుండా బ్రతికించి వారిని నిరంతరం జీవింపజేసేది కూడా నేనే [యేసే]!

యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అంటే నిజవిశ్వాసి అయినవ్యక్తి మరణించిన తరువాత నిత్యజీవాన్ని పొందేందుకు తిరిగి బ్రతుకుతాడు అని భావం.

లాజరు మరణించి లేచింది పునరుత్థానము కాదు! మరణించి కొన్ని రోజులతరువాత యేసుక్రీస్తు మాటచేత బ్రతికి సమాధిలోనుండి బయటకు వచ్చిన లాజరు కొంతకాలానికి అందరిలాగే మరణించాడు. అయితే, అంత్యదినాన నిజ విశ్వాసులందరితోపాటు ఇంకెప్పుడు మరణించకుండా నిత్యజీవాన్ని అనుభవించటానికై లాజరుకూడా పునరుత్థానం పొందబోతున్నాడు.

ముస్లీం ప్రశ్న – 8

యోహాను 11:26
బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

బ్రతికి యేసు నందు విశ్వాసము ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అంటే అర్ధం ఏమిటి?
బ్రతికే ఉంటాడు అతనికి మరణం రాదు అనియా? లేక ఏమిటి?

క్రైస్తవ సమాధానం:

పైన ప్రభువు చెప్పిన మాతల సందర్భము, “అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.” (యోహాను.11:25-26)

“బ్రతికి యేసు నందు విశ్వాసము ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు” అంటే యేసు నందు విశ్వాసముంచి చనిపోయినవారు బ్రతుకుతారు. అంతేకాకుండా అలా బ్రతికినవారు తమలో కొనసాగుతున్న యేసునందలి విశ్వాసమును బట్టి వారు యిక ఎన్నటికి చనిపోరు. వారికి మరణము రాదు.

ముస్లీం ప్రశ్న – 9

అపో.కార్యములు 1: 22
ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను.
అపో.కార్యములు 4: 33
ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు(కొన్ని ప్రాచీన ప్రతులలో-క్రీస్తు అని కూర్చబడియున్నది) పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.

యేసువారు ఏ పునరుత్థానము పొందారు?
శిష్యులు పునరుత్థానము గూర్చి సాక్ష్యం ఇచ్చారు?

క్రైస్తవ వివరణ:

యేసు ప్రభువు జీవ పునరుత్థానము పొందాడు. ఆయన శిష్యులు ప్రభువు పొందిన జీవ పునరుత్థానమును గురించి సాక్ష్యం యిచ్చారు.

ముస్లీం ప్రశ్న – 10

అపో.కార్యములు 2: 31
క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.

దావీదు క్రీస్తు పునరుత్థానము
గూర్చి చెప్పాడు అని ఎలా తెలిసింది ?
వాస్తవానికి అక్కడ ఆపదమే లేదు.

క్రైస్తవ వివరణ:

అవును క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఎక్కడ? క్రింది లేఖన భాగములో…

“సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకనేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.” (కీర్తన.16:8-11)

“నా శరీరముకూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు” అన్న పదజాలములోని మర్మగర్భితంగా యివ్వబడిన సందేశం ఏమిటంటే దావీదు తాను తిరిగి జీవించబోతున్నాడు అన్న సత్యాన్ని ఆ విధానములో వ్యక్తపరుస్తున్నాడు.

ఇదే సందర్భములో దావీదు/దావూద్ యేసు క్రీస్తును [నీ పరిశుద్ధుని] దేవుడు కుళ్ళుపట్టనీయడు అంటూ తెలియచేస్తున్నాడు. దాని భావం యేసు ప్రభువు మరణించిన తరువాత తిరిగి సజీవుడుగా లేస్తాడు అన్నది విశ్వాసులకు అందించబడుతున్న భావార్థం.

వెరసి 16 కీర్తనలో దావీదు/దావూద్ భవిశ్యత్తులో జరుగబోయే సంఘటన అంటే మృతులు తిరిగి సజీవులుగా మారుతారు అన్న సత్యాన్ని తెలియచేస్తూ భవిశ్యవాణిని పై విధానములో అందించాడు.

పై భవిశ్యవాణి యొక్క వివరణను విశదీకరిస్తున్న సందర్భములో క్రొత్తనిబంధన గ్రంథములో స్పష్టతకొరకు పునరుత్థానము అన్న పదము వాడబడింది. ఆ పదం అక్కడ ఉండాలి అన్న నియమమేదీ లేదు. వివరణలో యివ్వబడిన సమగ్ర సందేశాన్ని విజ్ఙులైన వారు గమనిస్తారు.

ముస్లీం ప్రశ్న -11

అపో.కార్యములు 17: 32
మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరు దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమనిరి.
అపో.కార్యములు 23: 5
వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించిసహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.
అపో.కార్యములు 23: 6
అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.

సద్దుకయ్యులే నా అపహాస్యం చేసినది ఇంకా ఎవరైనా చేశారా ?
ఇదైతే తీర్పు దినపు పునరుత్థానము గూర్చి యే కదా! మరేదైనా చెప్పదలచు కున్నారా?

క్రైస్తవ వివరణ:

అపోస్తలుడైన పౌలు అందరిముందు “మృతుల పునరుత్థానము” ను గురించి పలికాడు. ఈ సత్యాన్ని సద్ధూకయ్యులేకాదు అక్కడ ఉన్న అవిశ్వాసులైన యూదేతరులు కూడా విశ్వసించరు. కాబట్టి సద్దూకయ్యులతో పాటు యూదేతరులు కూడ మృతుల పునరుత్థానమును గూర్చి అపహాస్యం చేసి ఉంటారని చెప్పవచ్చు.

అవును, ఇది తీర్పుదినపు పునరుత్థానమును గూర్చినదే!

ముస్లీం ప్రశ్న – 12

అపో.కార్యములు 24: 15
నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.
అపో.కార్యములు 24: 15
నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.

అందరికీ జరిగే…. తీర్పుదినపు పునరుత్థానము
అనే కదా అర్ధం ! ఇంకేమైనా చెప్పదలచు కున్నారా?

క్రైస్తవ వివరణ:

అవును పై లేఖనాలలో ప్రస్తావించబడిన పునరుత్థానము తీర్పుదినానికి ముందు జరిగే సంఘటన.

ముస్లీం ప్రశ్న:

అపో.కార్యములు 26:22
అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత,….

యేసువారు పునరుత్థానము పొందిన వారిలో మొదటివాడు ఎలా అయ్యారు? యేసువారు సిలువ శ్రమలు పొందిన రోజునే అనగా శుక్రవారం నాడే అనేక మంది పునరుత్థానము అయ్యారు కదా?

మత్తయి 27: 53
వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.

క్రైస్తవ వివరణ:

యేసు ప్రభువు సిలువ మరణము పొందిన రోజు జరిగిన సంఘటన…

“సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.” (మత్తయి.27:52-53)

“యేసువారు సిలువ శ్రమలు పొందిన రోజునే అనగా శుక్రవారం నాడే అనేక మంది పునరుత్థానము అయ్యారు” అన్నది మీ అభిప్రాయము/గ్రహింపు. అది సరియైనది కాదు.

పై వాక్యములో నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అని వుందిగాని అది ప్రత్యేకించి వారి విశయములో జరిగిన “పునరుత్థానము” అని వ్రాయబడలేదు మరియు అలాగని అర్థం చేసుకోనవసరంకూడా లేదు. నిజానికి వారు లాజరులా తిరిగి బ్రతికారని అటుతరువాత అందరిలాగే మరణించారని గ్రహించాలి.

ముస్లీం ప్రశ్న:

1కోరింథీయులకు 15: 21
మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.

అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది యేసువారి ద్వారా మృతుల పునరుత్థానము కలిగినది అని పౌలు వాదన.

ఆదాము ద్వారా ఏ మరణం వచ్చింది?
యేసువారి ద్వారా పునరుత్థానము కలగడం ఏమిటి?

శుక్రవారం పునరుత్థానమును లు అయిన వారు ఎలా అయ్యారు?
అబ్రాహాము, ఇస్సాఖ్, యాకోబులు దేవుని దృష్టిలో సజీవంగానే ఉన్నారు కదా! వారికి ఎలా కలిగింది?

క్రైస్తవ వివరణ:

“ఆదాము ద్వారా మరణం వచ్చింది యేసువారి ద్వారా మృతుల పునరుత్థానము కలిగినది” అన్నది పౌలు వాదన కాదు, అపోస్తలుడైన పౌలు ద్వారా యివ్వబడిన దైవ లేఖనం.

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్ బోధ ప్రకారం ఆదాముద్వారా రేండు రకాల మరణాలు ప్రారంభమయ్యాయి. ఒకటి, ఆత్మీయ మరణం. అంటే దేవుని ఆత్మతో మానవుని ఆత్మకున్న అన్యోన్య సంబంధం కోల్పోవటం. అది పాపము చేసిన వెంటనే సంభవించిన ఘాతుకం. రెండు, భౌతిక మరణం అంటే దేహము, ప్రాణము, మరియు ఆత్మలు వేరై పోవటం. ఇది పాపము చేసిన వెంటనే జరిగిన ఘటన కాదు.

యేసు ప్రభువు పాపానికి ఫలితంగా ప్రవేశించిన మరణం నుండి తప్పించి తిరిగి జీవింప చేయబోతున్నాడు అదే మృతుల పునరుత్థానము.

శుక్రవారమునాడు ఎవరు పునరుత్థానము కాలేదు. అది లాజరులా కేవలము తిరిగి బ్రతకటము మాత్రమే.

అబ్రాహాము, ఇస్సాఖ్, యాకోబులు దేవుని దృష్టిలో సజీవంగానే ఉన్నారు. వారికింకా పునరుత్థానము కాలేదు, కాబోతున్నది.

ముస్లీం ప్రశ్న – 13

మృతుల పునరుత్థానము ఎలా ఉంటుందో చెప్పిన పౌలు!
1కోరింథీయులకు 15: 42
మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;

యేసువారి పునరుత్థానము కూడా అలాగే జరిగిందా?
యేసువారు క్షయమైన శరీరంతో మూడవ రోజు కనిపించారా? లేక అక్షయమైన శరీరంతో వచ్చారా?
శిష్యులకు కనిపించడం, మాట్లాడటం, ఆహారం భుజించడం వగైరా ఏ శరీరానికి అవసరం? మాంసము, ఎముకలు ఉన్న క్షయమైన శరీరానికే కదా!?

క్రైస్తవ వివరణ:

మృతుల పునరుత్థానమును గురించిన వివరణను దేవుడే అపోస్తలుడైన పౌలుద్వారా విశ్వాసులకు అందించాడు.

యేసు ప్రభువు యొక్క పునరుత్థానము సరిగ్గా అలాగే జరిగింది. క్షయమైన ఆయన దేహం అక్షయతను ధరించుకొని మహిమ శరీరంగా పునరుత్థానమయ్యింది. దేవదూతలలా పరలోకనివాసానికి యోగ్యమైన మహిమ శరీరమే పునరుత్థాన శరీరం. ఆ శరీరధారులు దేవదూతలవలే తాము యిచ్చయించినప్పుడు భౌతిక ప్రపంచములో ప్రత్యక్షమవుతూ భౌతిక సూత్రాలతో పొందిక కలిగి ఉండగలరు.

అదే యేసు ప్రభువు చేసాడు. శిష్యులకు కనిపించడం, మాట్లాడటం, ఆహారం భుజించడం వగైరా ఆయన తన పునరుత్థాన శరీరం లేక మహిమ శరీరంతో చేసాడు. ఆయన ఆహారాన్ని భుజించింది ఆకలి కావటాన్నిబట్టి కాదు, కేవలం వారికి తాను తిరిగి లేచాడు అన్నది నిరూపించటానికి. భౌతిక శరీరాలతో ప్రత్యక్షమైన దేవ దూతలు సహితం ఆహారాన్ని భుజించారు [ఆది.కాం.18:1-8], ఆకలికావటాన్నిబట్టి కాదు అతిధి సత్కారాలను గుర్తించి, స్వీకరింంచి, ఆశీర్వదించటానికి!

ముస్లీం ప్రశ్న -14

ఫిలిప్పీయులకు 3: 10
ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,
ఫిలిప్పీయులకు 3: 11
ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.

సమస్తాన్ని పెంటగా ఎంచుకొని పౌలు జీవించడానికి కారణం యేసువారి లాంటి జీవితం అనుభవించడము ద్వారా, శ్రమలు కష్టాలు ఓర్చుకోవడం ద్వారా మాత్రమే పునరుత్థానము సాధ్యం అని గుర్తించి ఆ ప్రకారం జీవించాడు.
కేవలం నమ్మకంతో పునరుత్థానము పొందేది అయితే అవి అన్నీ ఎందుకు? నేటి బోధకులకు చక్కని హితోపదేశం!

క్రైస్తవ వివరణ:

ఇక్కడ లేఖనాలను సరిగ్గా చదవటం రాకపోవటమన్నది అలాగే సందర్భాన్ని సరిగ్గా పరిశీలించి చూడటం తెలియకపోవటమన్నవి ప్రశ్నలోని సమస్యలుగా కనపడుతున్నవి.

ఫిలిప్పీ.3:10-11 లోని సత్యాన్ని గ్రహించటానికి ఆ సందర్భాన్ని పరిశీలించాలి. అంతకుముందు ఉన్న లేఖనాలను అంటే 1-9 వరకుగల వచనాలను సరిగ్గా చదివిచూడగలగాలి.

“మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనం దించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును. ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై, ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మ శాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడునిమిత్తమును,”

అపోస్తలుడైన పౌలు గర్వించటానికి ఎన్నో కారణాలు ఉన్నా వాటన్నిటిని పెంటగా ఎంచుకుంటున్నాడు. అందుకు కారణం “క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి” పొందటం. మరోమాటలో చెప్పాలంటే విశ్వాసమూలంగా పొందగలిగిన నీతి ముందు ఇహలోకసంబంధమైన గొప్పతనాలన్నీ పెంటలాంటివి.

“శ్రమలు కష్టాలు ఓర్చుకోవడం ద్వారా మాత్రమే పునరుత్థానము సాధ్యం” అని అపోస్తలుడైన పౌలు చెప్పలేదు. అలాగని పొరపాటుగా ఊహించుకోవటం గ్రహింపులోని సమస్య. మరి పౌలు క్రీస్తులా కష్టాలు అనుభవించాలని కోరటం దేనికి?
“…ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును…ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును…” అంటూ పౌలు తన వ్యక్తిగత ఆశను వ్యక్తపరుస్తున్నాడు. అంతేగాని, శ్రమలు కష్టాలు ఓర్చుకోవడం ద్వారా మాత్రమే పునరుత్థానము సాధ్యం అంటూ బోధించటం కాదు.

ముస్లీం ప్రశ్న – 15

2తిమోతికి 2: 18
వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.

సద్దుకయ్యులు అయితే కాదనిపిస్తోంది మరి ఎవరు వీరు? పునరుత్థానము గతించడం అంటే ఏమిటి? ఏమి చెబుతున్నారు? వివరణ అవసరం!

క్రైస్తవ వివరణ:

ఆది క్రైస్తవులలో కొందరు ఈనాటి క్రైస్తవ విశ్వాస భ్రష్ఠులలా తాము విశ్వాస భ్రష్ఠులు కావటమేగాక అమాయక క్రైస్తవులనుకూడా తమ కుయుక్తులతో అబద్ధబోధలతో కలవరపెడుతూ నాశయనమార్గాలలోకి నడిపించేవారు. అలాంటి అబద్ధ క్రైస్తవులు చెప్పే ఒకానొక దుర్బోధ పునరుత్థానము లేదు అది ముందే జరిగిపోయింది అని. ఇలాంటి బోధ సంపూర్ణ దైవగ్రంథములో లేని బోధ. అయినా, అనేక అబద్ధ బోధకులు ప్రవక్తలు ఆయా కాలాలలో ప్రజలమధ్య బయలుదేరి అలాంటి విపరీత వాక్యవిరుద్ధమైన అసత్యాలను బోధిస్తూ విశ్వాసులను కలవరపరుస్తూ వస్తున్నారు ఈనాటివరకు.

ముస్లీం ప్రశ్న – 16

హెబ్రీయులకు 11: 35
స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.

స్త్రీలు తమవారిని అంటే చనిపోయిన తమ భర్తలను పిల్లలను పునరుత్థానము ద్వారా పొందారు అంటే ఏమి అర్ధం అవుతోంది?
శ్రేష్ఠ పునరుత్థానము అని దేనిని అంటారు? అది పొందగోరు వారు యాతన పెట్టబడడం అంటే ఏమిటి ?

క్రైస్తవ వివరణ:

హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసమును గురించినది. విశ్వాసమును నొక్కివక్కాణిస్తున్న క్రమములో అనేకమంది విశ్వాస వీరులను పరిచయం చేస్తూ అదే సమయములో ఆ దినాలలో అంటే క్రీస్తుకు ముందు మరణించిన వారిలో కొందరు తిరిగి బ్రతికిన సందర్భాలను ఎత్తిచూపుతూ ఆ సంఘటనలు పునరుత్థానముకు సాదృశ్యముగా పరిచయం చేస్తున్నది. విశ్వాసులు ఆ సాదృశ్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు ఆ సందర్భాములోనే “మరి శ్రేష్ఠమైన పునరుత్థానము” అంటూ అసలైన పునరుత్థానమును అంటే నీతిమంతుల పునరుత్థానమును గురించి ప్రస్తావిస్తున్నది.

నీతిమంతులైనవారు హింసించబడుతున్నాపుడు తమ విశ్వాసాన్ని వదిలి హింసించబడటము నుండి తప్పించుకోవటముకన్నా యతానలను సహించి రాబోవుతున్న “నీతిమంతులు పొందబోయే శ్రేష్ఠమైన పునరుత్థానము” లో పాలుపొందటానికై యాతనలను సహించారు.

ముస్లీం ప్రశ్న – 17

ప్రకటన గ్రంథం 20: 5
ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

కడమ మృతులు ఎవరు? పునరుత్థానములు ఎన్ని ఉన్నాయి? పునరుత్థానము ఉంది, శ్రేష్ట పునరుత్థానము ఉంది, మొదటి పునరుత్థానము ఉంది. మొదట అన్నాము అంటే కనీసం రెండవది అయినా ఉండి ఉండాలి.

క్రైస్తవ వివరణ:

పునరుత్థానము ఉంది. పునరుత్థానము రెండు రకాలు. మొదటిది నీతిమంతుల పునరుత్థానము. ఇది యేసుక్రీస్తు తిరిగి ఈ లోకానికి రెండవసారి రావటానికి ముందు సంభవిస్తుంది. ఈ పునరుత్థానములో పాలుపొందేవారు ధన్యులు. నిజవిశ్వాసులు ఈ లోకములో మరణించిన వెంటనే కేవలం ఆత్మలుగానే పరలోకం వెళుతారు. అయితే, వారు పరలోకవాసులలా మహిమ శరీరాలను ధరించటానికి పునరుత్థానం వరకు వేచి ఉండాలిసిందే. కనుక, మొదటి పునరుత్థానములో వారు సజీవులుగా మారటమేగాక, మహిమశరీరాలతో నిత్యజీవాన్ని అనుభవిస్తూ ప్రభువుసన్నిధిలో కొనసాగుతారు. అయితే, అవిశ్వాసులు అనీతిమంతులు ఈ దశలో మరణావస్తలోనే ఉంటూ పాతాళము యొక్క కబంధ హస్తాలలో తాత్కాలిక యాతనలను అనుభవిస్తూ కొనసాగుతారు.

యేసు ప్రభువు మరియు మొదటి పునరుత్థానములో పాలుపొందినవారు కలిసి వెయ్యి సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తారు. వారి పరిపాలన వెయ్యి సంవత్సరాలు కొనసాగిన పిదప రెండవ పునరుత్థానము సంభవిస్తుంది. ఈ రెండవ పునరుత్థానములో అవిశ్వాసులు/అనీతిమంతులు తిరిగి సజీవులుగా చేయబడుతారు, తీర్పులో నిలబడి తగిన శిక్షలు అందుకొని నరకములో ప్రవేశిస్తారు.

ముస్లీం ప్రశ్న – 18

1కోరింథీయులకు 15: 12
క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరుమృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?

ఏమి చెప్పదలచు కున్నాడు?
యేసువారిని గూర్చి పౌలు ఏ పునరుత్థానము గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు?
ఈ మొత్తం విషయాల సరైన అవగాహన వస్తే తప్ప యదార్ధానికి చేరుకోవడం అసాధ్యం!

క్రైస్తవుల వివరణ:

పై లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువు యొక్క పునరుత్థానము అంటే మొదటి పునరుత్థానము లేక శ్రేష్ఠమైన పునరుత్థానమునకు నాందిగా మరణం పై విజయాన్నిసాధించి జీవమార్గానికి ద్వారం తీసిన సత్యాన్ని గురించి సాక్ష్యం యిస్తున్నాడు.

పునరుత్థానాన్ని గురించి సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్ తెలియచేస్తున్న సమగ్ర సత్యాన్ని సరిగ్గా అవగతం చేసుకోవలంటే ఊహలపై ఆధారపడకుండా బైబిల్ ను ఆసాంత ప్రార్థనా పూర్వకంగా చదివి ధ్యానించగలగాలి. అది లేకపోతేనే అనుమానాలు, సందేహాలు, అస్పష్ట అవగాహనలు కలిగేది!

ముగింపు

ముస్లీం దావా ప్రచారకుడు లేవనెత్తిన ప్రశ్నలకు విస్పష్టంగా పునరుత్థానమునుగురించి క్రైస్తవ వివరణ అందించాము. ఈ సందర్భములో పునరుత్థానమును గురించి ముస్లీం వివరణను కోరుతూ దావా ప్రచారకునిముందు క్రింద కొన్ని ప్రశ్నలను ఉంచుతున్నాము.

ఖురాన్ గ్రంథం అన్నింటికి సవివరంగా సమాధానాలను తెలియచేస్తుంది అంటూ ముస్లీంలు అభిప్రాయపడుతుంటారు. మరి, ఖురాన్ గ్రంథం అందిస్తున్న స్పష్టతను క్రింది ప్రశ్నల విశయములో తెలియచేయండి:

  1. మృతులు తీర్పుదినాన ఏవిధంగా లేచి నిలబడుతారు అని ఖురానులో వివరించబడింది?
  2. ఖురాన్ ప్రకారం తీర్పుదినం వరకు మృతులైనవారి పరిస్థితి యేమిటి? నీతిమంతుల పరిస్థితి మరియు అనీతిమంతుల పరిస్థితి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *