స్పష్టత కరువైన ‘స్పష్టమైన’ ఖురాన్

స్పష్టత కరువైన ‘స్పష్టమైన’ ఖురాన్

July 12, 2021 ఇస్లాం ఖుర్'ఆన్ గ్రంథం విశ్వాసాలు 0

ప్రగల్భాల ప్రకటనలు

“అలిఫ్‌ – లామ్‌ – రా. ఇది ఒక గ్రంథం. దీని వాక్యాలు నిర్దుష్ట మైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు, సర్వం ఎరిగిన వాని తరఫు నుండి స్పష్టంగా విశదీకరించబడ్డాయి.” (ఖురాను – సురాహ్ 11:1)

“ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాకుండా ఇంకొక న్యాయనిర్ణేతను వెతకాలా? యదార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వొసగామో వారికి, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుంచి సత్య సమేతంగా వచ్చిం దన్న విషయం బాగా తెలుసు. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు శంకించేవారిలో చేరిపోకు.” ((ఖురాను – సురాహ్ 6:114)

“మేము ఈ జనుల వద్దకు, మా సంపూర్ణ జ్ఞానంతో బహు స్పష్టంగా విశదీకరించిన గ్రంథాన్ని చేరవేశాము. విశ్వసించినవారికి అది మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం.” (ఖురాను – సురాహ్ 7 : 52)

గొప్పలు చెప్పటం, ప్రగల్భాలు పలకటం యేడవ శతాబ్ధపు అరబ్బు కవులకు ప్రత్యేకమైన కళ. ఖుర్’ఆన్ వచనాలను రాసింది ఎవరైనా వారు తమ సమకాలికుల బలహీనతలను, అసమర్ధతను, మరియు పరిధులను ఆసరా చేసుకొని తమకాలములో తమ జనులమధ్య తమకున్న కవితా పాండిత్యం ద్వారా తాము చెప్పే మాటలను దైవ సూక్తులుగా చెలామణి చేసుకోగలిగారు.

ఆ ప్రయత్నములో తాము పలికే మాటలను రాబోవు తరాలలో కొందరైనా గుడ్డిగా నమ్మక శల్యపరీక్ష చేసి తమ మోసప్రయత్నాలను బయటపెట్టగలరని ఊహించలేకపోయి ఉండవచ్చు. అందుకే ఖుర్’ఆన్ రచయిత(లు) తమ గ్రంథాన్ని దైవగ్రంథమని నమ్మబలికేందుకు అది “స్పష్టంగా విశదీకరించిన గ్రంథం” అంటూ ప్రగల్భాలు చెప్పేందుకు సహితం వెనుతీయలేదు.

క్రింది అంశాలను పరిశీలించి, పై మూడు వాక్యాలలో గొప్పగా చెప్పుకున్న “స్పష్టత” అసలు ఖుర్’ఆన్ గ్రంథములో ఉందో లేదో విజ్ఙులైన వారు గ్రహించగలరు.

1. పాపాల క్షమాపణ

తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించిన వాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు.” (ఖురాన్ – 4 : 48)

“(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశచెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.”(ఖురాన్ – 39 : 53)

అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి, వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు.” (ఖురాన్ – 4:17)

పై వాక్యాలో ఉన్న అస్పష్టత మరియు వాటిని చదివితే వచ్చే ప్రశ్నలు:

(అ) ఇంతకు అల్లాహ్ క్షమించే పాపాలు యేవి? క్షమించని పాపాలు యేవి?
(ఆ) షిర్క్ పాపాన్ని అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని అల్లాహ్ క్షమిస్తాడా లేదా…? క్షమిస్తే సురా 4:48 అబద్దమవుతుందికదా? క్షమించకపోతే సురా 39:53 అబద్దమవుతుంది కదా?
(ఇ) షిర్క్ పాపాన్ని అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని అల్లాహ్ క్షమించకపోతే ఒకప్పుడు క్రైస్తవులుగా ఉండి షిర్క్ పాపానికి ఒడిగట్టినవారు [ముస్లీలంల అభిప్రాయం ప్రకారం] తరువాత ఇస్లాం మతాన్ని పుచ్చుకొని ముస్లీంలలాగా మారిన వారి పాపాలు క్షమించబడనట్లే కదా…? వారు నరకానికి పోవటం తప్పనిసరే కదా? ఆపక్షంలో మత పార్పిడివలన వారికి లాభమేమిటి? ఒకవేళ వారిని క్షమిస్తే, సురా 4:48 లో అలాగే సురా 4:17 లో చెప్పబడిన విశయాలు అబద్దమనే కదా..?

ఇంతకు, పై ఖురాన్ వాక్యాల బోధలో పాపాలు క్షమించబడే విశయములో స్పష్టత ఎక్కడుంది…?

2. శిక్ష ఎవరికి?

అరబ్బీ భాషా ఖురానులోని పదజాలాన్ని అక్షరార్థంగా అనుసరించి చేసిన అనువాదం…

“ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని (మాత్రమే) హతమార్చాలి. ” (ఖుర్’ఆన్ సురా 2:178)

అరబ్బీ భాషా ఖురానులోని సమస్యను గ్రహించి ఆ సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నముతో చేసిన మరో అనువాదం…

“ఓ విశ్వాసులారా! హత్య విషయంలో మీ కొరకు న్యాయప్రతీకారం (ఖిసాస్) నిర్ణయించబడింది. ఆ హత్య చేసినవాడు, స్వేచ్ఛగలవాడైతే ఆ స్వేచ్ఛాపరుణ్ణి, బానిస అయితే ఆ బానిసను, స్త్రీ అయితే ఆ స్త్రీని (వధించాలి).” (ఖుర్’ఆన్ సురా 2:178)

పై వాక్యంలోని ప్రకటనను గమనిస్తే రావలసిన ప్రశ్నలు:

(అ) హతుడు స్వతంత్రుడైతే అతనికి బదులుగా ఏ స్వతంత్రుని ప్రాణం తీయాలి?
(ఆ) హతుడు బానిస అయితే అతనికి బదులుగా ఏ బానిస ప్రాణం తీయాలి?
(ఇ) చంపబడిన వ్యక్తి స్త్రీ అయితే ఆమెకు బదులుగా ఏ స్త్రి ప్రాణం తీయాలి?
(ఈ) “హత్యచేసిన వ్యక్తిని చంపాలి” అన్న మూడు ముక్కల్లో వచ్చే స్పష్టతను కనీసజ్ఙానమున్న ఏవ్యక్తి అయినా వ్యక్తపరచగలడు. మరి, పై వాక్యాన్ని వ్రాసిన వారికి ఆ జ్ఙానం ఎందుచేత కొరవడింది…?!

3. విడాకుల కారణం

భార్యాభర్తలు విడాకులు తీసుకోకూడదని దేవుడు తన సత్యప్రవక్తలద్వారా స్పష్టపరిచాడు. అయినా, ఆ దైవసందేశానికి వ్యతిరేకంగా అరబ్బుల మధ్య 7వ శతాబ్ధములో అందించబడిన ఖుర్’ఆన్ గ్రంథములో భర్త విడాకులు యివ్వవచ్చు అంటూ ప్రకటిస్తూ అందుకుగల కారణాల విషయములో మాత్రం ఏ స్పష్టతా యివ్వలేదు.

“ఎవరయితే తమ భార్యలతో సంబంధం పెట్టుకోబోమని ఒట్టేసుకుంటారో వారి కొరకు నాలుగు మాసాల గడువు ఉంది. మరి వారు గనక (ఈలోగా) మరలివస్తే అల్లాహ్ కూడా క్షమించేవాడు, జాలిచూపేవాడు. ఒకవేళ వారు విడాకులు ఇవ్వాలనే నిశ్చయించుకుంటే, నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు.” (ఖుర్ ఆన్ – సుర 2:226-227)

పై వాక్యంలోని ప్రకటనను గమనిస్తే రావలసిన ప్రశ్నలు:

(అ) పై వాకములోని అంశం, “విడాకులు యివ్వటం.” ఇక్కడ ఒక పురుషుడు తన భార్యకు విడాకులు యిచ్చే విధానాన్ని గురించి తెలియచేయబడుతున్నది. మరి ఏకారణాన్ని బట్టి భర్త తన భార్యకు విడాకులు యివ్వవచ్చో అన్న స్పష్టత ఎక్కడుంది?
(ఆ) ఆ మాటకొస్తే, ఇక్కడే కాదు ఖుర్’ఆన్ లో ఆ స్పష్టత ఇంకెక్కడైనా ఉందా?
(ఇ) ఖుర్’ఆన్ అంతటిలో ఆ స్పష్టత లేకపోతే, ఏకారణం లేకున్నా భర్త తన భార్యకు విడాకులు యిచ్చి దులిపేసుకోవచ్చు అన్నదా ఖుర్’ఆన్ చేస్తున్న బోధ…?!
(ఈ) ఏకారణాన్నిబట్టి విడాకులు యివ్వవచ్చోనన్నది ఖుర్’ఆన్ లో లేకపోతే అంత ప్రాముఖ్యమైన సమాచారాన్ని ఖుర్’ఆన్ రచయిత(లు) మరిచిపోయారనా లేక వారి దృష్టిలో దానికి విలువేలేదనా?

4. నిర్ణయించబడిన విధి

మానవులు ఈ లోకములో జన్మించకముందే అల్లాహ్ వారి జీవితాన్ని, వారి క్రియలను, అలాగే వారి అంతిమ గమ్యాన్ని ముందే వ్రాసి పెడతాడు అని ఖురాన్ మరియు హదీస్ లు బోధిస్తున్నాయి:

“అల్లాహ్ మాకు రాసిపెట్టింది తప్ప మరొకటి మాకు జరుగదు.ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్ నే నమ్ముకోవాలి” అని (ఓ ప్రవక్తా) వారికి చెప్పు” (సురాహ్ 9:51).

“మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని (అతని సమక్షంలో) బయటపెడతాము. దాన్ని అతను తెరచిన పుస్తకంలా చూసుకుంటాడు.” (సూరాహ్ 17:13)

ఒకవైపు పై విధంగా బోధిస్తున్న ఖురాన్ [మరియు హదీసులు] మరొకవైపు క్రిందివిధంగా కూడా బోధిస్తున్నాయి:

“…ఆపైన అల్లాహ్‌తానుకోరినవారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.” (సూరాహ్ 14:4)

“అల్లాహ్ ఎవరినయినా దారితప్పిస్తే, ఇక ఆ తరువాత అతన్ని ఆదుకునే వాడెవడూ ఉండడు…” (సూరాహ్ 42:44)

“విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు (ఇంతకు మునుపు) తిన్నదానికి, తాగినదానికి వారిపై ఎటువంటి పాపం ఉండదు. కాకపోతే వారు ఇక మీదట భయభక్తులతో మెలగాలి, విశ్వసించి మంచిపనులు చెయ్యాలి. మళ్లీ భయభక్తుల వైఖరిని అవలం బించాలి, విశ్వసించాలి. మళ్ళీ అల్లాహ్‌కు భయపడుతూ సద్వర్తనులుగా మసలుకోవాలి. ఇటువంటి సద్వర్తనులనే అల్లాహ్‌ ప్రేమిస్తాడు.” (సురాహ్ 5:93)

పై ఖురాన్ వాక్యాలను చదివిన వారికి వచ్చే ప్రశ్నలు:

(అ) మొదటే అల్లాహ్ నరుల విధివ్రాతను వ్రాయించి ఉంటే, యిక నరులను పనిగట్టుకొని తిరిగి అల్లాహ్ అపమార్గాన్ని పట్టించాల్సిన అవసరత యేమిటి?

(ఆ) అయినా, మంచి జీవితం జీవించి పరలోకానికి వెళ్ళాలి లేక చెడ్డ జీవితం జీవించి నరకానికి వెళ్ళాలి అంటూ నరుల విధిరాతను ముందే వ్రాసిపెట్టే దేవుడు న్యాయవంతుడు ఎలా అవుతాడు? అసలు అలాంటి అన్యాయం, కౄరత్వం మరియు అధర్మం అన్న లక్షణాలు నిజదేవునిలో ఉంటాయా…?

(ఇ) అల్లాహ్ ఒక వ్యక్తి చెడు జీవితం జీవించి నరకానికి వెళ్ళాలి అంటూ విధివ్రాతను వ్రాసిపెడితే ఆ వ్యక్తి అలాగే చెడు జీవితం జీవించాలి, నరకానికి వెళ్ళాలి. అతనికి వేరే విధంగా జీవించే మార్గం లేదు. కాని, ఆ వ్యక్తిని నీతిమార్గములో అల్లాహ్ కు భయపడుతూ జీవించాలి అంటూ ఖురాన్ బోధించటంలోని విజ్ఙత ఏమిటి?

(ఈ) అల్లాహ్ ఒక వ్యక్తి మంచి జీవితం జీవించి పరలోకం వెళ్ళాలి అంటూ విధివ్రాతను వ్రాసిపెడితే ఆ వ్యక్తి అలాగే జీవించాలి మరి! ఆ రకంగా వ్రాసిపెట్టిన తరువాతకూడా ఆ వ్యక్తిని నీతిమార్గములో అల్లాహ్ కు భయపడుతూ జీవించాలి అంటూ ఆజ్ఙాపించటములోని ఔనత్యం ఏమిటి?

(ఉ) ఇంతకూ “అల్లాహ్‌కు భయపడుతూ సద్వర్తనులుగా మసలుకోవాలి” (సురాహ్ 5:93) అంటూ చెప్పబడుతున్న ఆజ్ఙ ఎవరికొరకు?

పై ప్రశ్నలేగాక, ఖురాన్ బోధలో విధిరాత, మానవ నిర్ణయ స్వాతంత్రము, మరియు మానవుల వ్యక్తిగత బాధ్యత అన్న అంశాలను సమన్వయపరచే విషయంలో ఖురాన్ రచయిత(లు) గొప్పగా చెప్పుకొన్న ‘స్పష్టత’ ఎక్కడుంది…?!

5. హంతకునికి శిక్ష

నరహత్య రెండు రకాలు. ఒకటి, పొరబాటును చంపటం [unintentional killing]. రెండు, ఉద్దేశ్యపూర్వకంగా చంపటం [intentional killing]. ఈ విభజన ప్రతి దేశ చట్టాలలో ప్రతిబింబిస్తుంది.

పై రెండు రకాల నరహంతకులకు యేన్యాయస్థానం ఒకే శిక్షను విధించదు. ఒకవేళ అలా చేస్తే అది అన్యాయం మరియు అనాగరికం అని వేరే చెప్పక్కరలేదు.

ఒకవ్యక్తి వాహనాన్ని నడుపుతూ ప్రమాదవశాత్తు మరొక వూక్తి మరణానికి కారకుడు కావచ్చు. అది “పొరబాటుగా చంపటం.” అలా కాకుండా, ఒక వ్యక్తి మరో వ్యక్తిపై పగబట్టి ఆ వ్యక్తిని ప్రణాళికాబద్దంగా చంపటం జరిగితే అది “ఉద్దేశ్యపూర్వకంగా చంపటం.” ఈ రెండు హత్యలకు ఒకే శిక్ష విధించబడదు.

ఈ రకమైన విభజన మరియు వాటికి తగిన వేరువేరు శిక్షలు 3500 సంవత్సరాల క్రితమే బైబిల్ లో సవివరంగా తెలియచేయబడ్డాయి [సంఖ్యాకాండము 35:9-34].

మరి కేవలం 1400 క్రితం యివ్వబడిన ఖురాన్ ఈ విషయాన్ని గురించిన స్పష్టత యేది?

హత్యకు సంబంధించిన శిక్షను గురించి ఖురాన్ తెలియచేస్తున్నదాన్ని క్రింది వచనాలలో చూడవచ్చు:

“ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని (మాత్రమే) హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తరువాత కూడా ఎవరయినా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది.” (ఖురాను – సురాహ్ 2:178)

పై ఖురాన్ వాక్యంలో “పొరబాటున చంపటం” మరియు “ఉద్దేశ్యపూర్వకంగా చంపటం” అన్న రెండు వేరువేరు హత్యలకు చెందిన వివరణ యేది వాటి స్పష్టత యేది…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *