చరిత్రలో విచిత్రం!
మానవ చరిత్రలో యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన దినానికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని చారిత్రక మరియు ధార్మిక గ్రంధాల ఆధారాల ప్రకారం ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువు సిలువ శ్రమలు అనుభవించి, మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు!
ఆ మహోన్నత దినాన్ని ఈస్టర్ లేక పస్కా అనే పేరుతో నిజవిశ్వాసులు పర్వదినంగా జరుపుకుంటారు. అందుకు కారణం, జగమెరగాల్సిన సత్యం—మరణం ఓడించబడి జీవమార్గానికి తలుపులు తెరచుకున్న దినం!
యూదా మతపెద్దల ప్రొద్భలంతో రోమా అధికారులు యేసు క్రీస్తును హింసించి, చంపి, చేతులు దులుపుకున్నారు. వారి ప్రవర్తన మనందరిలోని పాపాస్వభావానికే ప్రతీక అంటే అతిశయోక్తి కాదు.
యేసును క్రీస్తుగా అంగీకరించని యూదా మతపెద్దలు, పరిసయ్యులు ఆయన చేస్తున్న సూచక క్రియలనుబట్టి అలాగే ఆయన చేస్తున్న బోధనుబట్టి క్రమక్రమంగా ప్రజలందరు ఆయన వైపుకు మళ్ళటం చూసి తట్టుకోలేకపోయారు. ఇంకా ఆయన తమ వేశధారణ జీవితాన్ని తరచు యెండగడుతూ విమర్శిస్తుండటాన్నిబట్టి కూడా ఈర్శాద్వేశాలతో రగిలిపోయారు.
వాటికి తోడు, జరుగుతున్న వాటిని సాకుగా చేసుకొని రోమా అధికారులు తమ స్థలాన్ని అధికారాన్ని తీసేసుకుంటారని భయపడిపోయారు. దీనికి పరిష్కారం? వారి ఆలోచన ప్రకారం, క్రీస్తు అని నమ్మబడుతున్న యేసును చంపటం!
అయితే, ఆయనను చంపాలని పన్నాగాలు పన్నుతున్న వారికి తెలియని విశయం యేమిటంటే, యేసు క్రీస్తు తాను వారి చేతికి అప్పగించబడబోతున్నాడని, వారు తనను హింసించి చంపబోతున్నారన్న వాస్తవాన్ని ముందే తన శిష్యులకు భవిశ్యవాణిని రూపంలో తెలియచేస్తూ వచ్చాడన్న నగ్న సత్యం!
“ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మి వేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను.” (లూకా.18:31-33)
“అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా” (మత్తయి.16:21)
నిజానికి తాను ఈలోకానికి వచ్చింది మానవుల యొక్క విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని యివ్వటానికే అంటూ పరలోకవాసి అయిన యేసు క్రీస్తు తానే స్వయంగా ప్రకటిస్తూ వచ్చాడు…
“ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.” (మత్తయి.20:28)
“తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.” (యోహాను.10:15)
సరిగ్గా అదే జరిగింది. ఆయనను యూదా మతపెద్దలు పట్టి బంధించి రోమా అధికారులకు అప్పగించగా రోమా అధికారులు ఆయనను హింసించి సిలువవేసి చంపారు. అయితే, మరణము ఆయననను పట్టి ఉంచలేకపోయింది. యేసు క్రీస్తు తాను ముందే వాగ్ధానం చేసిన విధంగానే మరణాన్ని జయించి తిరిగి సజీవునిగా లేచాడు. అదే మొదటి ఈస్టర్/పస్కా పర్వదినం.
అయినా, అవిశ్వాసులు అబద్దబోధకులు పై దైవసత్యాన్ని కాలరాచే ప్రయత్నములో యేసుక్రీస్తు మరణించలేదని అసలు ఆయన మానవుల పాపాలకు విమోచనా క్రయధనంగా మరణించటానికి రాలేదంటూ దైవ వ్యతిరేక అసత్యాన్ని ప్రచారం చేయటం మొదలు బెట్టారు. వారు తమదైన శైలిలో, “క్రైస్తవులు అయితే యేసువారు తమ పాపముల కోసం మరణించారు అని భావిస్తున్నారు. నిజంగానే యేసువారు వారి పాపాలకోసం మరణిస్తే మళ్ళీ క్రైస్తవులు ఎందుకు మరణిస్తారు?” అంటూ అజ్ఙానంగా, అమాయకంగా క్రైస్తవులను కలవరపెట్టే ఉద్దేశ్యంతో సందేహాన్ని వెళిబుచ్చుతున్నారు!
సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్ ప్రకారం మొదటి మానవ జంట పాపం చేయటాన్నిబట్టి భౌతికమరణం లోకంలో ప్రవేశించింది. అంటే, ఆదాము హవ్వలు పాపం చేసిన మరుక్షణంలోనే మరణించారని కాదు. పాపఫలితంగా కొంత కాలం తరువాత వారు మరణాన్ని చవిచూడాల్సి వచ్చింది. అలాగే, పాపానికి విరుగుడుగా యేసు క్రీస్తు తనను తాను విమోచనా క్రయధనంగా అర్పించుకోవటాన్ని బట్టి సంపూర్ణ క్షమాపణా నిత్యజీవాలు నరులకు అందుబాటులోకి వచ్చాయి. భౌతిక మరణం నరులకు ఏలాగు వెంటనే సంభవించలేదో ఆలాగే భౌతిక మరణంపై విజయం కూడా వెంటనే సంభవించదు. అది కొంత కాలం తరువాత అంటే పునరుత్థాన సమయములో సంభవిస్తుంది. మరోమాటలో చెప్పాలంటే, అప్పుడు మరణం మ్రింగివేయబడుతుంది!
“బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.” (1కొరింథి.15:52-54)
లేఖనాల ప్రకారం, యేసు క్రీస్తు యొక్క మరణము ద్వారా పాపులకు విమోచన మరియు నిత్యజీవం లభిస్తాయి. ఆ సత్యాన్ని బట్టి, క్రైస్తవులు ఆయన మరణమునకు అప్పగింపబడిన రోజును “గుడ్ ప్రై డే,” అంటే మంచి శుక్రవారంగా పరిగణిస్తారు.
దావా ప్రచారకుల అభిప్రాయ ప్రకారం, “ముస్లిం సమాజం అయితే ఇస్లాం చారిత్రక ఆధారాలు బట్టి అవిశ్వాసుల బారిన పడి చాలా మంది ప్రవక్తలు హత్య చేయబడ్డారు. కాని రసూల్ అంటే దైవ గ్రంథంతో [ఈసాతో పంపబడింది ఇంజీల్ గ్రంథం] పంపబడిన ప్రవక్తలను ఎవరూ చంపలేరు అన్న ప్రఘాడమైన విశ్వాసం ఉంది.” కాని, యిది వారు విశ్వసించే ఖురాన్ బోధ ప్రకారం మాత్రం కాదు. ఆసక్తికరంగా, యేసు క్రీస్తుద్వారా యివ్వబడిన ఇంజీల్ గ్రంథం ఎక్కడుంది అని వారిని అడిగితే నీళ్ళు నములుతారు లేదా అసత్య ప్రేళాపణలతో కూడిన సోది చెపుతారు తప్ప ఖురాన్ ప్రకటిస్తున్న ప్రకారం “ఇంజీల్ గ్రంథం క్రైస్తవుల వద్ద ఉంది” అని చెప్పే విశ్వాసం యదార్థత వారికి లేవు.
నిజానికి, ఖురాన్ గ్రంథం కేవలం యూదులు తామే మెస్సయ్యను చంపామంటూ గొప్పలు చెప్పుకోవటాన్ని ఖండిస్తున్నది. ఖురాను గ్రంథములో ఎక్కడా “మెస్సయ్యను ఎవరూ చంపలేదు లేక ఎవరూ సిలువకు ఎక్కించలేదు” అంటూ చేసిన ప్రకటన ఏదీ లేదు. అలాంటి దైవ వ్యతిరేకమైన మరియు చరిత్ర విరుద్దమైన వార్తను ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ గారు సమర్ధించినట్లు ఒక్క సహీహ్ హదీసు కూడా లేదు! అయినా, ముస్లీములు ఖురాను బోధకు అలాగే వారి ప్రవక్త మాటలకు వేరైన దావా ప్రచారకుల అసత్య అభిప్రాయాన్నే వేద వాక్కుగా విశ్వసించటం ఎంతో శోచనీయం.
“ఇంకా “మర్యమ్ పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము” అని అనటం వల్ల – (వారు శిక్షను చవిచూశారు). నిజానికి వారు (యూదులు) ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు.” (ఖుర్’ఆన్ 4:157)
పై ఖురాను బోధ ప్రకారం యేసు క్రీస్తును సిలువ వేసి చంపింది యూదులు కాదు. అక్షరార్థముగా చెప్పాలంటే ఆయనను సిలువ వేసి చంపింది రోమనులు. ఇది చారిత్రక సత్యం. ఈ సత్యాన్ని గురించిన వివరాలు క్రొత్తనిబంధన గ్రంథములో [ఇంజీల్ గ్రంథములో] విస్పష్టముగా తెలియచేయబడ్డాయి. యేసు క్రీస్తును సిలువవేసి చంపాలని ఆశించింది యూదులు, కాని ఆపని చేసింది రోమనులు. ఈ ఖురాను సత్యాన్ని తిరస్కరిస్తున్న ముస్లీంలందరు ఈ విశయములో అవిశ్వాసులుగా మారారు!
ఒకవేళ, దావా ప్రచారకులు వక్రీకరిస్తున్న ప్రకారం, “దేవుడు యేసు క్రీస్తును మరణించకుండా తప్పించాడు అందుకై దేవుడే ఆయన స్థానములో మరొక వ్యక్తిని ఆయనలా మార్చి పెట్టాడు” అన్నది నిజమైతే, సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రవక్తను పురుగులలాంటి మనుషుల చేతిలోనుండి తప్పించేందుకు అంత పెద్ద మోసం/దగా చేయాల్సిన అగత్యం ఆయనకు ఉందా…? అలాంటి దేవుడు అసలు నిజదేవుడెలా అవుతాడు…?!
నిజదేవుడు తన ప్రవక్తను ఈలోకములోనుండి పరలోకానికి తీసుకువెళ్ళాలని నిశ్చయించితే పరలోకమునుండి అగ్ని రథాన్నో లేక మేఘ వాహనాన్నో పంపిస్తాడు. [2రాజులు.2:1-12; అపో.కా.1:9]
చావకుండా కాపాడటం గొప్పకాదు, చచ్చిన వ్యక్తిని తిరిగి పునరుత్థాన శరీరముతో జీవింపచేయటం గొప్ప. అది కేవలం నిజదేవునికి మాత్రమే సాధ్యం! అదే జరిగింది ఆ మొదటి ఈస్టర్/పస్కా పర్వదినాన.
అందుకే యేసు క్రీస్తు తానే సెలవిస్తున్నాడు,
“నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.” (ప్రకటన.1:18)
అవును యేసు క్రీస్తు సజీవుడు. ఆయన బ్రతికే ఉన్నాడు. ప్రవక్తలుగా పంపబడిన వారు అలాగే ప్రవక్తలుగా చెప్పుకున్న వారు అందరూ మరణించి మట్టిలో కలిసిపోయారు. కాని, మరణాన్ని జయించి తిరిగి సజీవునిగ మహిమ శరీరంతో లేచిన యేసు క్రీస్తు మాత్రమే సజీవుడు. ఆయనే నిన్నూ నన్నూ మరణం తరువాత సజీవులనుగా చేయగలడు!
ఆయన లోకరక్షకుడు, అందరికి ప్రభువు!
ఈ దైవ సత్యాన్ని చేబట్టుదాం, ప్రకటిద్దాం, ఈ సత్యంలో జీవిద్దాం!!!
ఇది ఈస్టర్/పస్కా పర్వదినపు సందేశం!
దేవుడు మిమ్ములను దీవించి సర్వసత్యములోనికి నడిపించును గాక!
క్రీస్తు శిష్యుడు
బ్ర.ప్రసన్న కుమర్