నిజదేవుని ప్రవృత్తి
సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు. ఆయనను గూర్చిన జ్ఙానం కూడా అనంతమైనది. నిజదేవుని గురించిన సంపూర్ణ జ్ఙానం సృష్టించబడిన ఏ వ్యక్తికీ అందనటువంటిది. అయినా, మానవులకు ఉపకరించేందుకు వీలుగా దేవుడు తన గురించిన గ్రహింపును కొంతవరకు నిజమైన ప్రవక్తల/అపోస్తలుల గ్రంథాలలో అందించడము జరిగింది. ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ ప్రేరణలో (inspiration) యివ్వబడింది గనుక దాని గ్రహింపునుకూడా ఆ దేవుని ఆత్మ నడిపింపులోనే (illumination) మానవులు గ్రహించగలరు. అయితే ఈ నడిపింపు అన్నది విశ్వాసుల విధేయత మరియు ఆత్మీయ పరిణితిపై ఆధారపడివుంది. ఈ కారణాన్నిబట్టి దైవగ్రంథములోని ప్రత్యక్షతలను గురించి విశ్వాసుల గ్రహింపులలో హెచ్చుతగ్గులుండే అవకాశముంది.
సృష్టికర్త అయిన నిజదేవుడు సృష్టికి అతీతమైనవాడు మరియు సృష్టికి వేరైనవాడు. దేవుడు [אֱלֹהִ֑ים/Θεὸς/الله/God] అన్న పదం అన్ని సమయాలలో సృష్టికర్తనే సూచించనవసరం లేదు. ఆ పదాన్ని ఉపయోగించిన వ్యక్తి లేక గ్రంథము యొక్క దృష్టిపథంలో వున్న భావం మరియు గ్రహింపులే ఆ సందర్భములో ఆపదం సూచిస్తున్నదాన్ని నిర్వచించగలవు.
‘ఏకైక దేవుడు’ అని పేర్కొన్నప్పటికి అది నిజదేవున్ని గురించి చెప్పబడిన మాట కానవసరము లేదు. ఏకదేవుడు/ఏకైకదేవుడు/ఒకేదేవుడు/ఒక్కదేవుడు వంటి పదజాలము అబద్ద దేవునికి లేక లేనిదేవునికి అంటే కేవలము మాటలకు ఊహలకు మాత్రమే పరిమితమైన దేవునికి కూడా వాడబడుతున్నాయి ఈనాటి ధార్మిక ప్రయత్నాలలో. ఈ అత్యంతప్రమాదకరమైన కారణాన్నిబట్టి నిజమైన అద్వితీయదేవున్ని మాత్రమే గుర్తించి విశ్వసించగలగాలి.
బైబిలులో దేవుని గూర్చిన ప్రస్తావన వుంది. అలాగే, ఖురానులోకూడా దేవుని గూర్చిన ప్రస్తావన వుంది. ఈ రెండు గ్రంథాలు ‘దేవుడు’ [אֱלֹהִ֑ים/Θεὸς/الله/God] అనే ఒకే పదాన్ని ఉపయోగించాయి. అంతమాత్రాన ఈ రెండు గ్రంథాలు ఒకే దేవున్ని పరిచయం చేస్తున్నాయని తీర్మానించటానికి వీలులేదు. బైబిలు పరిచయం చేస్తున్న దేవునికి [אֱלֹהִ֑ים/Θεὸς/الله/God] మరియు ఖురాను పరిచయం చేస్తున్న దేవునికి [אֱלֹהִ֑ים/Θεὸς/الله/God] మధ్య హస్థిమశకాంతర తేడా వుంది!
నిజదేవుడు నిత్యుడు (Eternal), అనంతుడు (Infinite), స్వయంభవుడు (Self-Existent) మరియు అద్వితీయుడు (One). ఇవి దేవుని యొక్క తాత్విక గుణలక్షణాలుగా (Philosophical Attributes) చెప్పుకోవచ్చు. ఈ గుణలక్షణాలలో ఏది కొదవైనా అలాంటి దేవుడు నిజదేవుడు కాదు అన్నది సుస్పష్టం!
పరిపూర్ణమైన పరిశుద్ధత (Holiness), న్యాయం/నీతి (Justice/Righteousness), మరియు ప్రేమ (Love) అన్నవి నిజదేవునికి వున్న నైతిక గుణలక్షణాలు (Moral Attributes). ఇందులో ఏగుణలక్షణంలేని దేవుడైనా అబద్ధ దేవుడైనా అయివుండాలి లేక మాటలకు ఊహలకు మాత్రమే పరిమితమయిన దేవుడైనా అయివుండాలి.
చివరగా, సర్వశక్తిమంతుడు (Omnipotent), సర్వజ్ఙాని (Omniscient), మరియు సర్వవ్యాప్తి (Omnipresent) అన్నవి నిజదేవుని సహజ గుణలక్షణాలు (Natural Attributes) అన్నది మరువకూడదు. ఈ గుణలక్షణాలులేని దేవున్ని పరిచయం చేసే ఏధార్మిక మార్గమైనా అసత్యమార్గమని ఇట్టే గుర్తించవచ్చు.
అనంతుడైన దేవుడు సర్వవ్యాప్తిగా వుండటం తధ్యం, అది అనిర్వార్యం. అలా సర్వవ్యాప్తిగా వుండలేని దేవుడు పరిధులుగల దేవుడు గనుక అలాంటి దేవుడు అనంతుడు కాదు మరిముఖ్యంగా నిజదేవుడు కానేకాదు. నిజదేవుడు సర్వవ్యాప్తిమంతుడై వున్నా ఆయన సృష్టిని తగలకుండా సృష్టితో ఎలాంటి అనుసంధానము లేకుండా వున్నవాడు. అందుకే సృష్టికర్త ‘నేను ఉన్నవాడను’ అనువాడనై వున్నాను అంటూ తన ప్రవక్తకు తన నామమును వెల్లడిపరిచాడు. నిజదేవుడు వ్యాపించని స్థలము విశ్వములో ఎక్కడాలేదు. ఉనికిలోకి వచ్చిన ఈ విశ్వమంతా ఆయనలో సృష్టించబడింది. ఆయనకు బయట లేక వేరుగా వుండే స్థలమంటూ ఏదీ లేదు. ఆయనలో ఆయననుబట్టి ఉనికిని కలిగివున్నా అది ఆయనలోని భాగం కాదు కానేరదు. స్వయంభౌమత్వం అన్నది సృష్టికర్తకు మాత్రమే చెందిన ప్రవృత్తి. అది సృష్టికర్తకు మరియు సృష్టికి మధ్యనున్న ఎప్పటికి తొలగని అగాధం.
సృష్టికర్త అయిన దేవుడు తాను ఆశించిన రీతిలో తాను నిర్ధారించిన కాలములో సృష్టికి తనను తాను ప్రత్యక్షపరచుకోగల శక్తిసామర్థ్యమున్నవాడు. తన సంపూర్ణ మహిమాప్రభావాలతో కాకుండా సృష్టి వీక్షించగల స్థాయిలో తన ప్రత్యక్షతను అనుగ్రహించటమన్నది కేవలం నిజదేవునికే సుసాధ్యం. కాని, ఊహలకు మాత్రమే పరిమితమైన అబద్ద దేవునికి ఇది అసాధ్యం!
సృష్టి వీక్షించగల స్థాయిలో సృష్టికర్త తన ప్రత్యక్షతను అనుగ్రహించిన వైనాలు సంపుర్ణ దైవగ్రంథమైన బైబిలులోని పాతనిబంధన భాగములోనే [తవ్రాత్ కితాబ్] అనేకం వున్నాయి [ఆది.కాం.3:8-21; 11:1-9; 18:1-33; 32:22-32]. వీటికి పరాకాష్టగా అందించబడిన అంతిమ దైవప్రత్యక్షతను గూర్చి క్రొత్తనిబంధన గ్రంథములో [ఇంజీల్ కితాబ్] సవివరంగా తెలియచేయబడింది [యోహాను.1:1-18; ఫిలిప్పీ.2:5-8; హెబ్రీ.1:1-14].
దేవుని వాక్కు [కలాముల్లాహ్/లోగోస్] దేవునిలోని అస్తిత్వం. కనుక, దేవుని వాక్కు [కలాముల్లాహ్/లోగోస్] దేవుడు. అయితే, యిక్కడ దేవుని అస్తిత్వాన్ని 1, 2, 3…అంటూ గణితశాస్త్ర విధానములో గుర్తించకూడదు లెక్కించకూడదు. అందుకు కారణం, దేవుడు లేక ఆయన అస్తిత్వం గణితశాస్త్రానికి అతీతం! దేవుని వాక్కు [కలాముల్లాహ్/లోగోస్] శరీరధారిగా ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు [యోహాను సువార్త 1:1-14; ఫిలిప్పీ.2:5-8; 1తిమోతి.3:16]. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు [రబ్ ఈసా అల్-మసీహ్]
[పరిశుద్ధుడు: పవిత్రత, పరిపూర్ణత, మరియు ప్రత్యేకతల సమ్మేళణము కలిగినవాడు;
నిత్యుడు: ఆది అంతము లేనివాడు;
అనంతుడు: అపరిమితుడు; హద్దులు/పరిధులు లేనివాడు;
అద్వితీయుడు: ద్వితీయములేనివాడు; తనకు వేరుగా సాటిగా పోటిగా ధీటుగా మరొకడు లేనివాడు;]
గమనిక: దేవుడు (అల్లాహ్/God) అని సంబోధిస్తున్నా ఒకవేళ అది నిజదేవున్ని గురించి కాకపోతే ఆ సంబోధన అబద్ద దేవునికేనన్నది విస్పష్టం. అబద్ద దేవుడు రెండు రకాలుగా వుండే అవకాశముంది:
(అ) సృష్టించబడినదేదైనా లేక ఎవరైనా దేవునిగా సంబోధించబడితే అది అబద్ద దేవుడుగా లెక్కించబడుతుంది/లెక్కించబడుతాడు.
(ఆ) లేనిదేవుడు అంటే కేవలము మనుషుల ఊహలకే మాత్రమే పరిమితమైన దేవుడు కూడా అబద్ద దేవుడుగానే లెక్కించబడుతాడు.
అద్వితీయుడు అనంతుడు గ్రంథాలు నిజదేవుడు నిత్యుడు న్యాయం పరిశుద్ధత ప్రత్యక్షత ప్రవృత్తి ప్రేమ బైబిలు సర్వజ్ఙాని సర్వవ్యాప్తి సర్వశక్తిమంతుడు సృష్టికర్త స్వయంభవుడు