అబ్రహాము బలి: ఇస్సాకా లేక ఇష్మాయేలా?
రమారమి 4370 సంవత్సరాల క్రితం [2350 క్రీ.పూ.] జలప్రళయము సంభవించి నోవహు కుటుంభము తప్ప మానవజాతి అంతా తుడిచిపెట్టుకు పోయింది. జలప్రళయము నిమ్మళించిన తదుపరి భూమిపై మనుషులు తిరిగి విస్తరించడం ప్రారంభమైంది.
దాదాపు 350 సంవత్సరాల తరువాత ప్రభువైన దేవుడు మానవులలోనుండి అబ్రహామును ఎన్నుకొని ప్రవక్తగా ఏర్పరచుకొని మానవాళి నిమిత్తము తాను సంకల్పించిన ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోశించేందుకు ఆయనను ప్రత్యేకపరచుకున్నాడు (ఆదికాండము.12:1-4).
అబ్రహాముకు ముగ్గురు భార్యల ద్వారా ఎనిమిదిమంది కుమారులు కలిగారు. అందులో మొదటిభార్య శారా ద్వారా దేవుడిచ్చిన మాట చొప్పున వాగ్ధత్త కుమారుడు ఇస్సాకు జన్మించాడు (ఆదికాండము.15:1-4; 18:9-15).
దాసిగా వుండి రెండవభార్యగా మారిన హాగరు ద్వారా అబ్రహాముకు ఇష్మాయేలు మొదటి కుమారునిగా జన్మించాడు (ఆదికాండము.16:1-16). అటుతరువాత కెతూరా ద్వారా ఆరుగురు కుమారులు జన్మించారు (ఆదికాండము.25:1-2).
అబ్రహాముకున్న ఎనిమిదిమంది కుమారులలో ఇస్సాకుది ప్రత్యేకస్థానం. ఇస్సాకు అబ్రహాముకు రెండవ కుమారుడైనా ఆయనకు ఒక వాగ్ధాన కుమారునిగా జన్మించాడు. అందుకే అబ్రహాముకు ఇస్సాకు అంటే ప్రాణం. ఆవిధంగా ఇస్సాకు అబ్రహాముకు ప్రత్యేకమైన లేక అద్వితీయ కుమారుడుగా లెక్కించబడ్డాడు (ఆదికాండము.22:1-2).
వాగ్ధాన కుమారుడు ఇస్సాకు జన్మించిన తరువాత అబ్రహాము ఒకప్పుడు తన భార్య శారాకు దాసిగా వుండి శారాచేతనే తనకు రెండవ భార్యగా యివ్వబడిన హాగరును మరియు ఆమెద్వారా పుట్టిన కుమారుడు ఇష్మాయేలును యిద్దరిని శారా ప్రొద్భలముతో బయటికి పంపించివేయటము జరిగింది. ఈ కష్టసాధ్యమైన పనిని అబ్రహాము కేవలము దేవుని అనుమతితోనే నెరవేర్చగలిగాడు (ఆదికాండము.21:5-14).
అబ్రహాము హాగరును మరియు ఆమెద్వారా పుట్టిన ఇష్మాయేలును పంపివేసిన సంఘటనను గురించిన వివరణ తవ్రాత్ [తోరాహ్] లో క్రింది విధంగా ఉంది:
“కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేతదూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.” (ఆ.కాం.21:14-16)
పై వివరణ సందర్భములో గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు:
- ఆ సమయములో ఇష్మాయేలు దాదాపు 16 సంవత్సరాల యువకుడు.
- అబ్రహాము హాగరు భుజముమీద పెట్టినవి ఆహారము మరియు నీళ్ళ తిత్తి. ఇష్మాయేలు చంటిపిళ్ళవాడు కాదు కనుకు అతనిని ఆమెకు అప్పగించాడు. ఒకవేళ ఇష్మాయేలు చంటిపిళ్ళవాడు అయివుంటే అతనిని ఆమె భుజముపై కాదు నడుముపై కూర్చోబెట్టేవాడు. కాని అతని వయస్సును బట్టి అలా జరుగలేదు.
- హాగరు మరియు ఇష్మాయేలు యిరువురు తిరిగిన ప్రాంతము ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిన తోటలాంటి ప్రాంతము కాదు. అది బెయెర్షెబా అరణ్యము. ఈ అరణ్య ప్రాంతము ఇశ్రాయేలు దక్షిణ ప్రాంతములోని నెగెవ్ ఎడారిప్రాంతములోని భాగము. వేసవిలో ఈ అరణ్య ప్రాంతము యొక్క ఉష్ణోగ్రత 50 డిగ్రీ సెల్సియస్ కు పైగా వెళ్ళటము కద్దు.
- తల్లితో పాటు మండుటెండలో అటుయిటు తిరుగులాడిన ఇష్మాయేలు 16 సంవత్సరాల యువకుడైనా అతనికి యెండదెబ్బ తగిలి నిర్వీర్యుడయ్యాడన్నది సుస్పష్టం. యెండదెబ్బ తగిలిన వ్యక్తి ఎంతవస్సున్నా వాడిపోయిన కాడలా పసివానికంటే బలహీనుడిగా మారిపోతాడన్నది అలాంటి పరిస్థితిలోని వ్యక్తులను చూసిన వారికి వేరే చెప్పక్కరలేదు. ఆ కారణాన్నిబట్టే అతని తల్లి హాగరు అతనిని ఒక పొద క్రింద వదిలి శోకతప్తురాలుగా కూర్చుండిపోయింది.
ఆ సందర్భములో యెహోవా దూత ప్రత్యక్షమై తల్లిని కుమారుని ఆదుకోవటం జరిగింది [ఆ.కాం.21:17-20].
అటుతరువాత, ప్రభువైన దేవుడు అబ్రహామును పరీక్షించే ప్రయత్నములో తనకు ప్రియంగా వుంటూ ఒక విశిష్టతను కలిగి ఆ సమయానికి తన ఇంటిలో తనతోపాటు ఏకైక కుమారునిగా జీవిస్తున్న ఇస్సాకును బలిగా అర్పించమంటూ అబ్రహామును ఆజ్ఙాపించాడు. అందుకు ఏమాత్రము సంకోచించకుండా అబ్రహాము దేవుని ఆజ్ఙకు లోబడి తన ప్రియకుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించేందుకు సిద్దమయ్యాడు.
అప్పుడు దేవుడు అతనిని అడ్డుకొని ఇస్సాకు స్థానములో బలిగా అర్పించేందుకు ఒక పొట్టేలును చూపించగా అబ్రహాము దాన్ని బలిగా అర్పించాడు [ఆదికాండము.22:1-18].
4000 సంవత్సరాల క్రితం [2000 క్రీ.పూ.] జరిగిన పై సంఘటనలు మానవకోటికి సవివరింగా ఎక్కడ తెలియచేయబడ్డాయి? 3400 సంవత్సరాలక్రితం [1400 క్రీ.పూ.] ప్రవక్త అయిన మోషేద్వారా అవతరించబడిన తోరా/తౌరాత్ అన్న దైవగ్రంథములో వివరించబడ్డాయి.
అయితే, అటుతరువాత వీటిలోని కొన్ని విశయాలు మాత్రం 2000 సంవత్సరాల తరువాత అంటే 1400 సంవత్సరాల క్రితం [610 క్రీ.శ.] ఇస్లాము ప్రవక్త అయిన ముహమ్మదుగారు అందించిన ఖురాను గ్రంథములోకూడా ప్రస్తావించబడ్డాయి. అందులోని కొన్ని గమనార్హమైన విశయాలు:
(1) దేవుని ఆజ్ఙకు లోబడి అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించేందుకు తీసుకువెళ్ళడము గురించి ఖురానులో ప్రస్థావించబడినా ఇందుకు సంబంధించి తోరా/తౌరాత్ గ్రంథములో వున్న వివరాలలో పది శాతం వివరాలుకూడా ఖురానులో లేవు.
(2) కొందరు ముస్లీము దావాప్రచారకులు నమ్మబలుకుతున్నట్లుగా “అబ్రహాము ఇష్మాయేలును బలిగా అర్పించేందుకు తీసుకువెళ్ళాడు” అన్న విస్పష్టమైన ప్రకటన యేదీ ఖురానులో లేదు.
(3) ఇస్సాకు కుమారులను/వంశస్థులను దేవుడు ప్రవక్తల పరంపరలో చేర్చినట్లు ఖురాను స్పష్టమైన సాక్ష్యం యిస్తున్నా (సురా.45:16) ఇష్మాయేలు కుమారులకు/వంశస్థులకు దేవుడు ప్రవక్తల పరంపరలో స్థానమిస్తున్నట్లు ఖురానులో స్పష్టమైన ప్రకటన యేదీ లేదు.
(4) ఇస్సాకు పుట్టుకను గురించిన శుభవార్తను దేవుడు ఇస్సాకు యొక్క తల్లికి మరియు తండ్రికి తెలియచేసినట్లు ఖురాను విస్పష్టమైన పదజాలముతో దృవపరుస్తున్నది (సురా.11:71 & 37:112). అయితే, ఈ అధిక్యత మరియు విశిష్టత అన్నది ఖురానులో ఇష్మాయేలు పుట్టుకకు యివ్వబడలేదు అన్నది గమనార్హమైన విశయము.
(5) తన కుమారుని బలిగా అర్పించబోతున్న అబ్రహాముని అడ్డుకొని దేవుడు ఇస్సాకు స్థానములో బలిగా అర్పించబడేందుకు ఒక ‘పొట్టేలును’ చూపించిన వివరము తోరా/తౌరాత్ లో స్పష్టంగా పేర్కొన్నప్పటికి ఖురానులో మాత్రం ఆవివరణ కొరవడింది.
(6) తోరా/తౌరాత్ లో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు స్థానములో ఒక పొట్టేలును బలిగా అర్పించాడు అన్న వివరణ మాత్రం యివ్వబడింది (ఆదికాండము.22:13-14). ఖురానులో అబ్రహాము కుమారున్ని “మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము” (సురా.37:107) అంటూ దేవుడు ప్రకటించినట్లు వ్రాయబడింది.
అయితే, ఖురానులో ఈ సందర్భములో చెప్పబడినట్లు ఒక పెద్ద బలిపశువును ‘ఎవరికి’ పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి ‘ఎవరినుండి’ దేవుడు విడిపించాడు?
(7) అబ్రహాము తన కుమారున్ని బలిగా అర్పించటానికి తీసుకువెళ్ళిన సందర్భము ఖురానులో ఒకే స్థలములో పేర్కొనబడింది (సురా.37). ఈ సందర్భములో ఖురాను అబ్రహాము కుమారునిగా ఇస్సాకును స్పష్టముగా పేరుతో పేర్కొంటూ పరిచయము చేస్తున్నది.
కాని, ఇదే సందర్భములో ఇష్మాయేలు పేరును ఎక్కడా ప్రస్తావించలేదు అన్నది గమనార్హమైన విశయము!
ఖురాను: సురా.37:99-113
“అతను (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు : “నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు.
“నా ప్రభూ! నాకు గుణవంతుడైన [الصَّالِحِينَ/l-ṣāliḥīna] కుమారుణ్ణి ప్రసాదించు” (అని ప్రార్థించాడు). అందువల్ల మేమతనికి, సహనశీలుడైన [حَلِيمٍ/ḥalīmin] ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము.
“మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్ చంటీ! నేను నిన్ను ‘జిబహ్’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్న గారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా [حَلِيمٍ/ḥalīmin] పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.
“మరి వారిరువురూ (దైవాజ్ఞను) శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు.
“అప్పుడు మేమతన్ని పిలిచాము – “ఓ ఇబ్రాహీం! నువ్వు కలను నిజంచేసి చూపావు.”
“నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. యదార్థానికి అదొక బహిరంగ పరీక్ష!
“మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము. ఇంకా భావితరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిల్చి ఉంచాము. ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక!
“సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాము. నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.
“మరి మేమతనికి, సద్వర్తనులలో [الصَّالِحِينَ/l-ṣāliḥīna] ఒకడైన ఇస్‌హాఖ్ ప్రవక్త గురించిన శుభవార్తను ఇచ్చాము.”
అబ్రహాము అబ్రహాము బలి ఇష్మాయేలు ఇస్సాకు ఇస్‌హాఖ్ కుమారుడు దేవుడు ప్రవక్త బలి