భవిశ్యవాణి

భవిశ్యవాణి

December 30, 2019 బైబిలులో ముహమ్మద్ 0

మానవాళికి ఆదినుండి అంతమువరకు యిహలోకానికి మరియు పరలోకానికి సంపూర్ణంగా సరిపడే విధంగా దేవుని తరపున అనుగ్రహించబడిన ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథం బైబిలు. ప్రారంభ ప్రత్యక్షతగా పాతనిబంధన గ్రంథం (యూదు లేఖనాలు) అంతిమ ప్రత్యక్షతగా క్రొత్తనిబంధన గ్రంథం (క్రైస్తవ లేఖనాలు) మానవాళికి దైవసందేశంగా అందించబడ్డాయి. ఈ రెండు నిబంధన గ్రంథాలను లేక లేఖన గ్రంథాలను కలిపి పరిశుద్ధ గ్రంథం (బైబిలు) అని పేర్కొంటారు. ఈ కారణాన్నిబట్టి బైబిలు సంపూర్ణ దైవగ్రంథము అని నిర్ధారించబడింది.

బైబిలు గ్రంథం దాదాపు నలభైమంది దైవప్రేరితులద్వార మానవాళికి అందించబడిన  దైవగ్రంథం. ఒకే సంస్కృతికి చెంది ప్రామాణీకరించబడిన నిజప్రవక్తల పరంపరలోనుండి అందించబడిన దైవవాక్కుల సంపుటి, బైబిలు. 

ఏకవ్యక్తిస్థాపిత మతధర్మాలయిన ఇస్లాం, మార్మను, బహాయి మరియు అహ్మదీయ మతస్తులు యూదు క్రైస్తవ ప్రవక్తలను వారి లేఖనాలను అనుకరిస్తూ తమ మత ప్రామాణికతను మరియు చెల్లుబాటును స్థాపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. దైవగ్రంథమైన బైబిలులోని ప్రవచనాల సందర్భాలను ఒకవైపు వక్రీకరిస్తూ మరొకవైపు ఖూనీచేస్తూ అవి తమ మతస్థాపకుని రాకడనుద్దేశించే భవిశ్యవాణిగా చెప్పబడ్డాయంటూ తమను తాము మభ్యపెట్టుకోవడమే కాకుండా సాతానుడు ఏవిధంగా హవ్వను మోసంచేసి పాపంలో పడవేసాడో అదేవిధంగా మోసంతో అమాయకులైనటువంటి క్రైస్తవులను [మరిముఖ్యంగా నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నవారిని] సత్యమార్గంలోనుండి దారితప్పిస్తున్నారు. ఇది సోచనీయం మరియు గర్హనీయం.

ఇస్లాము మతస్తులయిన ముస్లీము దావాప్రచారకులు యిలాంటి మోసపూరితమైన ప్రయత్నంలో తమది అందెవేసిన చేయి అని రుజువుపరచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ముస్లీము దావాప్రచారకులు ముస్లీముల ప్రవక్త ముహమ్మదుగారు  దైవగ్రంథమైన బైబిలులో ప్రవక్తగా ప్రస్థావించబడ్డారంటూ అనేకమంది అమాయక క్రైస్తవులను అలాగే అమాయక ముస్లీములనుకూడా మభ్యపెట్టి మోసంచేయడం బాగా పెరిగిపోతున్నది.  

అదే సమయములో బహాయి మతస్తులు తమ ప్రవక్త ‘బహ ఉల్లా’ రాకడను గురించి ఖురాను ప్రవచించింది అని చేసే బోధలకు అలాగే అహ్మదీయ మతస్తులు తమ మత నాయకుడు ‘మిర్జా గులాం అహ్మద్’ కూడా ఖురానులో ప్రవచించబడ్డాడు అంటూ ప్రకటించుకునే మాటలకు తగిన స్పందన ఏదీ యివ్వలేకపోతున్నారు.

ఇస్లాము మత ప్రవక్త ముహమ్మదుగారు అల్లాహ్ పంపగా వచ్చిన ప్రవక్త అని ఇస్లాము మతగ్రంథము ఖురాను పదేపదే ప్రకటిస్తున్నది. ఐతే పరిశుద్ద గ్రంథము బైబిలుకూడా అదే విశయాన్ని ప్రకటిస్తున్నది అని అనడం ఎంతవరకు వాస్తవం? నిజానికి బైబిలుకూడా అదే విశయాన్ని ప్రకటిస్తున్నది అని అనడంలోని సత్యం నేతి బీరకాయలోని నెయ్యి వంటిది. 

కొందరు ముస్లీములు, మరిముఖ్యంగా దావాప్రచారకులు, తమ మత ప్రవక్త ముహమ్మదుగారు బైబిలులో ప్రవక్తగా ప్రస్తావించబడ్డాడని అంతేకాక రాబోవుతున్నట్లుకూడా ప్రవచించబడ్డాడంటూ చెప్పుకోవడము వాదించడము చేస్తుంటారు. ఈ రకంగా చెప్పుకునే ప్రయత్నంలో వారు చెప్పే మాటలను చేసే వాదనలను జాగ్రత్తగా గమనించిచూస్తే అవి గుడ్డెద్దు చేనిలోపడ్డ చందాన వున్నాయి అన్నది ఇట్టే అర్థమైపోతుంది. 

సగటు ముస్లీములకు అలాగే దావాప్రచారకులకూడా తమ మత ప్రవక్త అయిన ముహమ్మదుగారిని పరిశుద్ద గ్రంథం బైబిలులో చూడాలన్న తపన ఎందుకుంది? 
ఇస్లాము మతప్రవక్త అయిన ముహమ్మదుగారికి బైబిలులో ప్రస్తావించబడాల్సిన ఆవశ్యకత యేమిటి? 

పై ప్రశ్నలకు జవాబు ఈ క్రింది కారణాలు: 

1) కొందరు ముస్లీములు తాము ప్రవక్తగా విశ్వసించిన ముహమ్మదుగారు నిజంగా ప్రవక్త అయిన పక్షంలో ఆమాటకొస్తే తాము నమ్ముతున్నవిధంగా ఆయన చివరి ప్రవక్త మరియు మానవాళికి పరిపూర్ణ మాదిరి అంటూ అయితే ఇస్లాముకంటే ముందే దైవగంథముగా ప్రమాణీకరించబడ్డ యూదు క్రైస్తవ లేఖనాలైన బైబిలులో ఆయనను గురించిన  ప్రస్తావన ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించగలిగారు.    

2) దావాప్రచారకులు తాము దైవగ్రంథమని విశ్వసించే ఖురాను యొక్క విశ్వసనీయతను స్థాపించడానికి ఖురానులోని కొన్ని వాక్యాలు సూచిస్తున్న విధంగా ఇస్లాము మతప్రవక్త ముహమ్మదుగారి గురించి యూదు క్రైస్తవ లేఖనాలైన బైబిలులో చుసే/చుపించే విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు, ఖురానులో క్రింది ప్రకటనను చూస్తాము:

“ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాసి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు (కరుణించబడతారు), అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో లిఖితపూర్వకంగా లభిస్తుంది…” (సురా 7:157)

గమనించాలి, పై ఖురాను వాక్యం ఇస్లాము ప్రవక్త ముహమ్మదును గురించిన ప్రస్తావన తౌరాతు మరియు ఇంజీలు గ్రంథాలలో ఉంది అని మాటమాత్రంగా చెప్పుకోవటమేగాని ఖురానంతటిలో ఒక్క సారయినా తౌరాతు గ్రంథములోని ఫలాని వాక్యం లేక ఇంజీలు గ్రంథములోని ఫలాని వాక్యం ముహమ్మద్ జీవితములో నెరవేర్చబడింది అంటూ ఒక్క లేఖనానయినా పూర్వగ్రంథాలలోనుండి ఉటంకించలేకపోయింది.

పై వాక్యాన్ని నిజంగా ఇస్లాము ప్రవక్త ముహమ్మదు గారే అందించారా అన్నది ప్రశ్నార్దకం. ముహమ్మదుగారి సమయములో మక్కామదీనాలలో యూదులు క్రైస్తవులు జీవిస్తుండటమేగాక వారు తమ ధార్మిక గ్రంథాలైన తవ్రాత్ మరియు ఇంజీల్ గ్రంథాలను చదువుతుండేవారు అన్నది ఇస్లామీయ గ్రంథాలే తెలియచేస్తున్నవి. కనుక, ముహమ్మదు గారు ఆ మాటలను అందించి ఉంటే ఆయన తప్పకుండా అదే సమయములో యూదులు మరియు క్రైస్తవుల యొద్ద ఉన్న గ్రంథాలను తెప్పించి అందులోని తన ప్రస్తావన ఎక్కడుందో చూపించేవారు. అలాంటిదేది జరుగలేదు కనుక, ఆ మాటలను ఇస్లాము ప్రవక్త ముహమ్మదుగారు చెప్పలేదు.

పామరుడైన ముహమ్మదుగారు ఖురాను గ్రంథాన్ని వ్రాయలేదు. ఆయన చెప్పిన లేక పలికిన మాటలను ఆయన అనుచరులు విని వ్రాసి పెట్టారు అన్నది ఇస్లామీయ గ్రంథాలు తెలియచేస్తున్న విశయము. అదే వాస్తవమైతే

ఆయన తరువాత సురా 7:157 లోని మాటలనుకూడా ముహమ్మదుగారి అనుచరులు లేక ఆతరువాతి ముస్లీములు వ్రాసిపెట్టినవి అనుకోవటానికి అవకాశం లేకపోలేదు.

అయితే, దావా ప్రచారకులు ఖురానులో ఎలాంటి మార్పులు లేవు ప్రపంచమంతా ఒకే ఖురాను ఉంది అంటూ సత్యదూరమైన మాటలను ప్రకటిస్తుండటం పరిపాటే. అయితే, వారి మాటలను వారి పండితులే ఖండిస్తున్నారు.

అయినా, దావా ప్రచారకులు బైబిలులోని వివరాలను తమ వితండవాదాలతో, వక్రవ్యాఖ్యానాలతో, లేక కుతర్కాలతో వివరిస్తూ సురా.7:157 లోని మాటలను సత్యమైనవాటిగా నిరూపించే ప్రయత్నాన్ని శతవిధాలుగా చేస్తున్నారు.

3) ఇక పై రెండు కారణాలే కాకుండా మూడవ కారణంగా దావాప్రచారకులు తమ మత మార్పిడి ప్రయత్నంలో అమాయక క్రైస్తవులను కుయుక్తితో మోసయుక్తంగా విశ్వాసబ్రష్టులను చేసి తమ మతంలోకి చేర్చుకునే ప్రయాసలోనిదే ఈ ప్రయత్నమంతాకూడా.

నిజాల నిగ్గు తేల్చేందుకు యదార్థంగా విషయపరిశీలన చేయడం అన్నది అతిప్రాముఖ్యమైన విధానం. ఇది సభ్యసమాజం యొక్క సుసంస్కృతి. వ్యక్తులనుగాని, వ్యక్తుల విశ్వాసాలనుగాని ద్వేశించకుండా, దూశించకుండా మరియు కించపరచకుండా విశయపరిశోధన చేయడమే ఈ వ్యాస ప్రయత్నం. చదువరులు రాగద్వేశాలకు ఆవేశాలకు తావివ్వక, సత్యాన్వేషణను ప్రేమిస్తూ విశాలహృదయంతో ఈ వ్యాసములో యివ్వబడిన విశయాలకు/అంశాలకు హేతుబద్ధంగా స్పందిస్తూ వాటిని సద్విమర్శతో పరిశీలించల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.  

ఇస్లాము మతస్తులు అంటే ముస్లీములు ప్రవక్తగా విశ్వసించి గౌరవించే ముహమ్మదుగారు దైవగ్రంథమైన బైబిలులో ఉన్నారో లేదో పరిశీలించడానికి ముందు అసలు ముహమ్మదుగారు ఎవరు, ఆయన గురించి ముస్లీముల విశ్వాసం యేమిటి మరియు ఆయన గురించి ఇస్లామీయ గ్రంథాలు యేమంటున్నాయి అన్నది కొంత పరిశీలించి చూడాలి.

చరిత్రలో ముహమ్మదు

అరేబియా ప్రాంతములోని మక్కా పట్టణంలో బహుదేవతారాధనతో విగ్రహారాధికులుగా వుండిన అరబ్బు జాతీయులమధ్య అబ్దుల్లా మరియు అమీనా దంపతులకు ముహమ్మదుగారు 570 క్రీ.శ. లో జన్మించారు. 610 క్రీ.శ. లో తాను హీరా గుహలో ఒంటరిగా వున్న సమయములో తనకు సంభవించిన భయభీతితో కూడిన ఒక అనూహ్యమైన అనుభవాన్ని ఆధారం చేసుకొని అల్లాహ్ తనను ప్రవక్తగా పిలిచి ఇస్లాము మతధర్మాన్ని బోధించమని ఆజ్ఞాపించాడంటూ ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. అటుతరువాత ముహమ్మదుగారు దాదాపు 23 సంవత్సరాలు జీవించి 632 క్రీ.శ. లో మరణించారు. ఆ 23 సంవత్సరాల వ్యవధిలో ముహమ్మదుగారు అల్లాహ్ పేరుతో వల్లెవేసిన బోధలను సూక్తులను ఆయన అనుచరులు ఆకులపై, రాళ్ళపై, జంతుచర్మాలపై, ఎముకలపై వాటిని వ్రాసిపెడుతూ వచ్చారు. ముహమ్మదు చెప్పిన కొన్ని సూక్తులను అనుచరులలోని కొందరు వళ్ళెవేయడముకూడా నేర్చుకున్నట్లు ఇస్లామీయ గ్రంథలనుబట్టి తెలుస్తున్నది. ఆయన తదనంతరం ఆయన అందించిన సూక్తులు క్రోడీకరించబడి ముస్లీముల మతగ్రంథమైన ఖురానుగా వాడుకలోకి వచ్చాయి. 

ముహమ్మదుగారి గురించి ముస్లీములకున్న విశ్వాసాలు మరియు నమ్మకాలు   

– ఆయన అల్లాహ్ చేత యెన్నుకొనబడి మానవాళికి తన సందేశాన్ని అందించడానికి పంపబడిన ప్రవక్త
– ఆయన అల్లాహ్ చేత పంపబడిన ఆఖరి ప్రవక్త మరియు చివరి సందేశకుడు
– ఆయన మానవాళికి అల్లాహ్ అనుగ్రహించిన అత్యుత్థమ మార్గదర్శకుడు మరియు అనుకరించాల్సిన చక్కటి మాదిరి
– ఆయన యూదు మరియు క్రైస్తవ ప్రవక్తల పరంపరకు చెందినవాడు
– ఆయన యూదు మరియు క్రైస్తవ ప్రవక్తలు తెచ్చిన సందేశాన్నే ఆల్లాహ్ యొద్దనుండి తీసుకువచ్చాడు
– ఆయనకు అల్లాహ్ జిబ్రాయిల్ అనే దూతద్వార ఖురాను గ్రంథాన్ని అందించాడు

పై విశ్వాసాలన్నికూడా ముస్లీములు ఖురాను గ్రంథపు బోధలనాధారం చేసుకొని యేర్పరచుకున్నవే. ఐతే గమనార్హమైన విశయం యేమిటంటే ముహమ్మదుగారిని గురించి  ముస్లీములు యేర్పరచుకున్న పై విశ్వాసాభిప్రాయలన్నిటికి  ఆధారపూరితమైన ఖురానును వారికి తీసుకొనివచ్చిందికూడా ముహమ్మదుగారే! అంటే, ముహమ్మదుగారు ఖురానును తెచ్చి ఇది ఆల్లాహ్ గ్రంథం అన్నారు, మరి ఆ గ్రంథంలో అంటే ఖురానులో చూస్తే “ముహమ్మదుగారు ప్రవక్త, ఆయన చెప్పేది అంతా సత్యం” అన్న సందేశం వుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ముహమ్మదుగారికి ఖురాను సాక్ష్యం, ఖురానుకు ముహమ్మదుగారు సాక్ష్యం! ఇలాంటి సాక్ష్యాధారాలు ఎంతవరకు తర్కబ్ధమైనవో వెరే చెప్పక్కరలేదు. ఈ పంథాలో అలోచించేవారు ఏమతాన్నైనా లేక నేను ప్రవక్తను అంటూ చెప్పుకొచ్చే ఏవ్యక్తినైనా ఆమోదిస్తూ అంగీకరించాల్సిందే. ఆమాటకొస్తే బహాయి మతాన్ని స్థాపించిన బహవుల్లాను ఆయన తీసుకువచ్చిన కితాబ్-ఇ-అఖదస్ అనే గ్రంథాన్ని, మార్మను మతాన్ని స్థాపించిన జోసెఫ్ స్మిథును ఆయన తీసుకొనివచ్చిన మార్మను గ్రంథాన్ని, అలాగే అహ్మదియ్యా మతాన్ని స్థాపించిన మిర్జాగులాం అహ్మదును ఆయన తీసుకొనివచ్చిన మాల్ఫుజాత్ గ్రంథాన్ని కూడా అమోదించుకొని అంగీకరించాల్సిందే. 

ఇస్లాము మతస్తులు మరియు బహాయి మతస్తులు అలాగే ఖదియాని/అహ్మదీయ మతస్తులు అయిన కొందరు ఒకవైపు సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలును తమ ముర్ఖవాదనలచేత తప్పుబట్టే ప్రయత్నము చేస్తూనే మరోవైపు తాము తప్పుబడుతున్న బైబిలులోనే తాము ప్రవక్తగా భావించే తమ మత స్థాపకుని రాకనుగూర్చిన భవిశ్యవాణి ఉందంటూ నిరూపించేందుకు శతవిధాలా ప్రయాసపడుతుంటారు. ఈ తరహా ప్రయత్నమన్నది వారి మతవిశ్వాసాల దివాళుకోరుతనానికి నిలువెత్తు నిదర్శనం!

దావా ప్రచారకుల దూర్త వాదాలు…

దావా ప్రచారకుల మొదటి వాదన

దావా ప్రచారకుల రెండవ వాదన

దావా ప్రచారకుల మూడవ వాదన

దావా ప్రచారకుల నాలుగవ వాదన

దావా ప్రచారకుల ఐదవ వాదన

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *