షూలమ్మీతి ప్రియుడు

షూలమ్మీతి ప్రియుడు

December 25, 2019 బైబిలులో ముహమ్మద్ 0

తోరా [తవ్రాత్]

అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.” (పరమగీతము 5:16)

దావా ప్రచారకుల వాదన

బైబిలులో ముహమ్మదు ఉన్నాడంటూ చెప్పే మాటలు: “పై వాక్యంలోని ‘అతికాంక్షనీయుడు ‘ అన్న పదం ఆదిమ భాషలోని హీబ్రూ బైబిలులో ‘మహమ్మదిమ్’ అన్న హీబ్రూ పదము యొక్క అనువాదం. అక్కడ రాబోవు ప్రవక్త అయిన ముహమ్మద్ గారు పేరుతో ప్రస్తావించబడ్డారు. ‘మహమ్మద్’ అన్న పేరుకు ‘యిమ్’ అన్న బహువచనపదాన్ని గౌరవసూచకంగా చేర్చడంతో అది మహమ్మదిమ్ (మహమ్మద్ + యిమ్ = మహమ్మదిమ్) గా మార్చబడింది. ఇది వ్యక్తిగత నామం కనుక ఈ పదాన్ని అనువాదం చేయకూడదు. పరమగీతము 5:16 లో ప్రవక్త ముహమ్మదుగారు పేరుతో ప్రవచించబడినప్పటికిని యుదులు మరియు క్రైస్తవులు సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంతో ఆ నామాన్నికూడా అనువదించారు.”

బైబిలులోని పై లేఖన సందర్భం

“యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? 

నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును 

అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. 

అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి. 

అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును. 

అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది. 

అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము 

అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు [מַחֲמַדִּ֑ים/makhmadd’im/మఖ్మద్దిమ్] యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.” (పరమగీతము 5:8-16)

యదార్థ పరిశీలన

వాస్తవాలు-1

పై వాక్యంలోని ‘అతికాంక్షణీయుడు’ అన్న పదం హీబ్రూ బైబిలులోని ‘మహమ్మదిమ్’ అన్న హీబ్రూ పదము యొక్క అనువాదం కాదు. అది ‘మఖ్మద్దిమ్’ [מַחֲמַדִּ֑ים/makhmadd’im] అన్న హీబ్రూ పదం యొక్క అనువాదం. ఇది మహమ్మదిమ్ కాదు, ముహమ్మదిమ్ కూడా కాదు. ముహమ్మదు అనే పేరు ఎంతమాత్రము కాదు. ఈ పదం ప్రియమైన లేక కోరదగిన [lovely or desirable] అనే భావాన్నిచ్చే మఖ్మద్ [מַחְמַד/makh-mawd] అనే హీబ్రూ పదానికి ‘యిమ్’ అన్నే హీబ్రూ బహువచన/విశేషణ పదాన్ని కలుపగా వచ్చిన ‘మఖ్మద్దిమ్’ అనే హీబ్రూ పదపు అనువాదం. 

వాస్తవాలు-2

‘మఖ్మద్దిమ్’ [מַחֲמַדִּ֑ים/makhmaddim] అన్న హీబ్రూ పదం వ్యక్తిగతనామం కాదు. యూదు లేఖనాలలోకాని క్రైస్తవ లేఖనాలలోకాని ఏవ్యక్తికి యిలాంటి పేరు లేదు. ‘మఖ్మద్దిమ్’ అన్న ఈ పదానికి అతిప్రియుడు, అత్యంతప్రియుడు, ప్రాణప్రియుడు, అతికాంక్షనీయుడు వంటి అర్థాలున్నాయి. ఇది ‘మహమ్మద్’ అన్న పేరుకు ‘యిమ్’ అనే బహువచనపదాన్ని గౌరవసూచకంగా చేర్చితే వచ్చిన పదం కాదు. ఇదే గ్రంథములో అంటే పరమగీతములో ప్రవక్త మరియు రాజు అయిన సోలోమోను పేరు యేడుసార్లు వ్రాయబడింది. అయినా ఒక్కసారికూడా సోలోమోనిమ్ అని పేర్కొనబడలేదు. దావీదు దావీదిమ్ అని, మోషే మోషేయిమ్ అని, అబ్రహాము అబ్రహామిమ్ అని బైబిలులో యెక్కడా పేర్కొనబడలేదు. బైబిలు అంతటిలో ఏనరునిపేరుకుకూడా ‘యిమ్’ అన్న బహువచనపదం చేర్చబడలేదు. ఆమాటకొస్తే ఒక వ్యక్తిని గౌరవించేందుకు ఆవ్యక్తి యొక్క నామానికి బహువచన పదాన్ని కలపడమన్నది యేభాషలోనైన లేక యేసంస్కృతిలోనైనా చూడం. ఉదాహరణకు, అహ్మదులు, అబ్దుల్లాలు, ముహమ్మదులు మొదలైన బహువచన పదజాలము గౌరవ సూచన కొరకు హీబ్రూ భాషలోనైనా లేక అరబ్బీ భాషలోనైనా లేవు. ఒకవేల అలాంటిది ఎక్కడైనా సంభవిస్తున్నా అది యూదు సంస్కృతిలో  లేక హీబ్రూ భాషలో మాత్రం లేని ఆచారం. 

వాస్తవాలు-3 

హీబ్రూ భాష అరాబిక్ భాష రెండూకూడా సెమెటిక్ భాషా కుటుంభానికి [family of Semetic languages] చెందిన భాషలు. ఆ కారణాన్నిబట్టి ఈ రెండు భాషలలోని పదాలు, వాటి ఉచ్చారణలు, ప్రాసలు, వ్యాకరణ విధానాలు ఒకదానితో మరొకటి కొంతవరకు సామీప్యాన్ని కలిగివుండటం సహజం.

భాషలలోని సామీప్యాన్ని ఆధారం చేసుకొని హీబ్రూ భాషలోని పదాలను వాటి భావాలను వక్రీకరిస్తూ బైబిలులో మఖ్-మద్ అనే ఉచ్చారణను దానినుండి ముహమ్మదు అనే వ్యక్తినామమును ఊహించుకొని అటుతరువాత అందులోనుండి ఇస్లాము ప్రవక్త అయిన ముహమ్మదును గురించిన భవిష్యవాణిని ఉత్పత్తి చేసుకోవటము అన్నది ముస్లీము దావా ప్రచారకులకే చెల్లు. నిజానికి బైబిలులో ముహమ్మదు గారి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు.

దావా ప్రచారకులు తమ వాదన నిజమని భావిస్తే క్రింది వాస్తవాలను కూడా వారు గమనములోకి తీసుకోవాలి:

అ) హీబ్రూ భాషలో అల్లాహ్ [אַלָּה/allah] అన్న పదముంది. అది బైబిలులోని తోరాహ్ [తవ్రాత్ గ్రంథము] లో ఉపయోగించబడింది [యెహోషువ.24:26]. అయితే, హీబ్రూ భాషలో దాని భావము సిందూర వృక్షము [oak tree]. ముస్లీములు “అల్లాహ్” అని అరాబిక్ భాషలో పలికిన సందర్భాలలో వారు సిందూర వృక్షాన్ని తలచుకుంటున్నారు అని తీర్మానించటం ఎంత అజ్ఙానముతో కూడినదో అలాగే యూదులు/క్రైస్తవులు “మఖ్మదిం” అన్న హీబ్రూ పదాన్ని ఉపయోగించిన సందర్భాలలో వారు ముహమ్మదు పేరును ఉచ్చరిస్తున్నారనుకోవటముకూడా అంత అజ్ఙానముతో కూడినది.

ఆ) ‘అక్బర్’ [עַכְבָּר/akbar] అనే ఉచ్చారణతో కూడిన పదం హీబ్రూ భాషలోను అలాగే అరాబిక్ భాషలోను వుంది. ఈ పదం కూడా బైబిలులోని తోరాహ్ [తవ్రాత్] లో వుపయోగించబడింది [లే.కాం.11:29]. అయితే, ఈ పదం హీబ్రూ మరియు అరాబిక్ భాషలలో వేరు వేరు అర్థాలను కలిగి వుంది. హీబ్రూలో ఈ పదానికి ‘పందికొక్కు’ అన్న అర్థం వుండగా అరాబికులో ‘గొప్ప’ [great] అన్న అర్థం వుంది. ముస్లీములు “అల్లహో అక్బార్” అని పలికిన ప్రతిసారి “సిందూర వృక్షం గొప్పదండోయ్” అనో లేక “అల్లాహ్ పందికొక్కండోయ్” అనో లేక “సిందూర వృక్షం పందికొక్కండోయ్” అనో ప్రకటిస్తున్నారని భాష్యం చెప్పటం ఎంత హాస్యాస్పదమో అలాగే బైబిలులోని పరమగీతాలు 5:16 వ వచనములోని ‘మఖ్మదిం’ అన్న పదాన్ని ముహమ్మదు అని వ్యాఖ్యానించటంకూడా అంత హాస్యాస్పదమైన ప్రయత్నం.

వాస్తవాలు-4 

ముస్లీము దావాప్రచారకులు సర్వసాధారణంగా బైబిలును తప్పుబట్టి తిరస్కరించే ప్రయత్నంగా దైవగ్రంథమైన బైబిలులో వున్న ‘పరమగీతాలు’ అన్న గ్రంథములో ‘బుతును’ చూడగలిగి తద్వారా బైబిలును ‘బూతు సాహిత్యంగా’ పేర్కొనే ‘బూతు మనోనేత్రాలు’ కలిగినవారు.

అతి విచిత్రంగా, అదేసమయములో దావాప్రచారకులు అదే గ్రంథములో తాము ప్రవక్తగా విశ్వసించి గౌరవించే ముహమ్మదుగారినికూడా ‘బూతు మధ్య’ చూడగలుగుతున్నారు. ఈ విపరీత ధోరణి దావా ప్రచారకుల ద్వంద్వ నీతికి/ప్రవృత్తికి నిదర్శనమా లేక బైబిలులో లేనిదాన్ని వున్నట్లుగా వున్నదాన్ని లేనట్లుగా చూపించేందుకు వారు చేస్తున్న అనేక విఫల ప్రయత్నాలలో ఒక ప్రయత్నపు ఫలితమా? విజ్ఙులకు ఇంతకన్నా విడమర్చి వివరించనవసరము లేదు.

వాస్తవాలు-5 

యూదు ఆచారవ్యవహారాలలో ద్రాక్షారసపానమన్నది ఒక సాధారణమైన ప్రక్రియ. యూదుమతవిశ్వాసాల ప్రకారం ద్రాక్షారసపానము తప్పుకాదుగాని తాగుబోతుతనం అంటే ద్రాక్షారసాన్ని అతిగా సేవించటం తప్పు. కాని, ఇస్లాము మతనిష్ఠ ప్రకారం ద్రాక్షారసపానమన్నదే పాపభూయిష్టమైన కార్యం.

షూలమ్మీతి అనే ఒక యవ్వన స్త్రీ మరియు ఆమె ప్రియుని మధ్య జరిగిన సంభాషణ యొక్క కావ్యరూపమే పరమగీతాలు అన్న గ్రంథము. ఈ కావ్యగాధ దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్యనున్న అనురాగాన్ని ఉపమానరూపములో లేక అలంకారార్థముతో వివరించే ప్రయత్నము. గ్రంథములోని యవ్వన స్త్రీ, షూలమ్మీతి, తన ప్రియుని గురించి పలికిన పలుకులలో [5:16] తమ ప్రవక్త ముహమ్మదు పేరును పేర్కొంది అంటూ ముస్లీము దావా ప్రచారకులు ఘంటాపథంగా వాదిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సింది, అదే అధ్యాయము ప్రారంభములోనే [5:1] షూలమ్మీతి ప్రియుడు ద్రాక్షారసపానకుడన్నది స్పష్టముగా పేర్కొనబడింది. కనుక, వారి వాదము ప్రకారము షూలమ్మీతి ప్రియుడు ముహమ్మదుగారు అయితే అదే అధ్యాయము యిస్తున్న సాక్ష్యము ప్రకారము ముహమ్మదు ద్రాక్షారసపానకుడు అని అవగతమవుతుంది. అంటే, పరమగీతాలు అన్న గ్రంథములో [5:16] ముహమ్మదుగారు పేరుతో ప్రస్తావించబడ్డారు అంటూ వాదిస్తున్న దావా ప్రచారకులు నిజానికి తమ మిడిమిడి జ్ఙానముతో వ్యర్థ వాదాలు చేస్తూ ఇస్లాము ప్రవక్తను ద్రాక్షారసపానకునిగా అంటే షూలమ్మీతి ప్రియునిగా చిత్రీకరిస్తున్నారు. ఈరకంగా దావా ప్రచారకులు చేస్తున్న ప్రయత్నాలు ఇస్లాము మతానికి అలాగే ముస్లీము సమాజానికి సిగ్గుచేటును కలిగిస్తున్నాయి అన్న సత్యాన్ని నిజముస్లీములు గ్రహించగలరు.

వాస్తవాలు-6

ఇస్లాము మతాన్ని స్థాపించి తనదంటూ ఒక చరిత్రను సృష్టించిన మహానుభావుడు ముహమ్మదుగారు. ఆయన యూదు మరియు క్రైస్తవుల గ్రంథాలను దైవగ్రంథాలుగా గుర్తిస్తూ తాను అందించిన ఖురాను గ్రంథములో అనేక పర్యాయాలు పేర్కొన్నప్పటికి ఏనాడుకూడా పరమగీతాలలో తన ప్రస్తావన వున్నదనిగాని లేక తన పేరు పేర్కొనబడిందనిగాని చెప్పుకోలేదు.

ముహమ్మదుగారే చేయని ప్రయత్నాన్ని దావాప్రచారకులు చేస్తూ ఒకవైపు ముహమ్మదుగారికి పొత్తుకుదరని లక్షణాలను ఆయనకు అంటగడుతూ మరోకవైపు ముహమ్మదుగారికన్నా తమకే అధిక జ్ఙానమున్నదంటూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ముస్లీము సమాజము కూడా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వత్తాసు పలకుతుండటం ఎంతో శోచనీయం.

వాస్తవాలు-7

పరమగీతాలు 5:16 వ వచనములోని మఖ్మద్ (מַחְמַד/makh-mawd/మఖ్-మద్) అనే హీబ్రూ మూలపదం ఒక వ్యక్తి నామము కనుక అది ఇస్లాము మత ప్రవక్త అయిన ముహమ్మదు గారిని సూచిస్తున్నది అని దావా ప్రచారకులు చేస్తున్న వాదనలో వాస్తవముంటే నిజానికి పాతనిబంధన గ్రంథములో ఆ పదం పన్నెండుసార్లు ఉపయోగించబడింది. అందులో కొన్ని క్రింద యివ్వబడిన వచనాలలో చూడగలం. మఖ్మద్ అనే హీబ్రూ మూలపదం ఉపయోగించబడిన ప్రతి స్థలములో ముహమ్మదు అన్న ఇస్లాము మత ప్రవక్త పేరును వుంచితే ఎలావుంటుందో మీరే పరిశీలించి చూడండి:

“మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు ‘ముహమ్మదు’ (హీబ్రూ మూలం పదం: מַחְמַד = మఖ్-మద్) అయినవన్నియు నాశనమైపోయెను.” (యెషయా.64:11) ఈ వాక్య ప్రకారం ముహమ్మదు నాశనమై పోయాడని అర్థం చేసుకోవాలా…?

“దాని ‘ముహమ్మదు’ (హీబ్రూ మూలం పదం: מַחְמַד/మఖ్-మద్) లన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునే యున్నది” (విలాపవాక్యములు.1:10) ఈ వాక్య ప్రకారం ముహమ్మదు శత్రువులకు చిక్కిపోయాడని అర్థం చేసుకోవాలా…?

“శత్రువువలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధివలె కుడి చెయ్యి చాపియున్నాడు కంటికి ‘ముహమ్మదు’ (హీబ్రూ మూలం పదం: מַחְמַד/మఖ్-మద్) లన్నిటిని నాశనముచేసి యున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించి యున్నాడు.” (విలాపవాక్యములు.2:4) ఈ వాక్య ప్రకారం ముహమ్మదును దేవుడు నాశనం చేశాడని అర్థం చేసుకోవాలా…?

“నరపుత్రుడా, నీ కన్నుల కింపైన ‘ముహమ్మదు’ (హీబ్రూ మూలం పదం: מַחְמַד/మఖ్-మద్) దానిని నీ యొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయ బోవుచున్నాను, నీవు అంగలార్చవద్దు ఏడువవద్దు కన్నీరు విడువవద్దు.” (యెహెజ్కేలు.24:16) ఈ వాక్యములో దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు భార్యను చంపబోతున్నవిశయాన్ని గూర్చి తెలియచేసాడు. అయితే, యిక్కడ ముహమ్మదు యెహెజ్కేలు భార్య అని నమ్మాలా…? అలాగే యెహెజ్కేలు భార్య అయిన ‘ముహమ్మదు’ను ఒక్క దెబ్బతో దేవుడు చంపబోతున్నాడు అని అర్థం చేసుకోవాలా…?

“లయము సంభవించినందున జనులు వెళ్లిపోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు పట్టణమువారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువు ‘ముహమ్మదు’ (హీబ్రూ మూలం పదం: מַחְמַד/మఖ్-మద్) లను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాసస్థలములో పెరుగును.” (హోషేయ.9:6) ఈ వాక్యము ప్రకారం ముహమ్మదును దురదగొండ్లు ఆవరిస్తాయి అని అర్థం చేసుకోవాలా…?

“ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండి వచ్చు ‘ముహమ్మదు’ [హీబ్రూ మూలం పదం: מַחְמַד/మఖ్-మద్] ను నేను నాశనము చేసెదను.” (హోషేయ.9:16) ఈ వాక్యము ప్రకారం ముహమ్మదును దేవుడు నాశనము చేయబోతున్నాడు అని అర్థం చేసుకోవాలా…?

పై కారణాలన్నింటిని బట్టి బైబిలులో ముహమ్మదు గారి పేరు ప్రస్తావించబడలేదు అన్నది విజ్ఙులైనవారికి వేరే వివరించి చెప్పనవసరము లేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *