పస్కాపండుగ

పస్కాపండుగ

November 11, 2021 Uncategorized 0

పస్కా పండుగ ప్రారంభం

[ని.కాం.12:1-28; లే.కాం.23:1-8; సం.కాం.9:1-14; ద్వి.కాం.16:1-8]

పాతనిబంధన గ్రంథం ప్రకారం ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దాసత్వంలోనుండి అనేక అద్భుత కార్యాలద్వారా విడిపించి తీసుకువచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించాలని అజ్ఙాపించబడ్డారు.

అబీబు లేక నిసాన్ అని పిలువబడే మాసములో 14వ దినాన పస్కా పశువును వధించి సిద్ధం చేసుకోవాలి.

బైబిల్ పరిభాషలో ఒక సాయంత్రం మొదలుకొని మరొక సాయంత్రం వరకు ఒక దినంగా లెక్కించబడుతుంది. అంటే, ప్రతి దినం రెండు సాయంత్రాలుంటాయి.

పస్కాను సాయంకాలం సిద్ధం చేసుకొని అదే రాత్రి దాన్ని భుజించాలి. నిర్గమాకాండములోని వివరాల ప్రకారం మొదటి పస్కా పండుగ నిసాన్ 14వ దినాన రెండవ సాయంకాలం ప్రారంభమైనది.

ఇశ్రాయేలీయులు నిసాన్ 14వ దినాన వధించి సిద్ధం చేసుకున్న పస్కాను బుజించిన సాయంత్రం [14వ దినంలోని రెండవ సాయంత్రం] వారు తమ ఇంటిలోకే పరిమితం అయివుండగా ఆ రాత్రే అంటే నిసాన్ 15వ నాడు దేవుడు ఐగుప్తీయుల మొదటి సంతానాన్ని సంహరించాడు.

నిసాన్ 14వ దినాన సిద్ధపరచుకున్న పస్కాను భుజించి మరుసటి దినం అంటే నిసాన్ 15వ దినాన ఇశ్రాయేలీయులు తామున్న స్థలాన్ని వదిలి తాము కలుపుకున్న పిండి ఇంకా పులియకముందే బయలుదేరారు.

పై రెండు కారణాలనుబట్టి 1400 క్రీ.పూ. క్రితం ఇశ్రాయేలీయులు రాబోవుతరాలలో జ్ఙాపకార్థంగా ఉండటానికై ఒకరోజు పస్కాను దానివెంటనే యేడు రోజుల పులియని రొట్టెల పండుగను జరుపుకోవాలని ఆజ్ఙాపించబడ్డారు. అంటే, ఇప్పటికి దాదాపు 3400 సంవత్సరాల క్రితం ఈ రెండు పర్వదినాలు ఆవిష్కరించబడ్డాయి.

దేవుని ఆజ్ఙ ప్రకారం, ఇశ్రాయేలీయులు కానాను దేశంలోకి ప్రవేశించిన తరువాత పస్కాపండుగను తాము ఉంటున్న ఊరిలోని తమ ఇళ్ళల్లో కాకుండా యెరూషలేములోని దేవాలయము వద్ద పస్కా పశువును బలిగా వధించి పస్కా పండుగను జరుపుకునేవారు.

పాటింపులలో మార్పులు

ఇశ్రాయేలీయులు పస్కాపండుగను నిసాన్ 14న మరియు పులియనిరొట్టెల పండుగను నిసాన్ 15 మొదలుకొని 21 వరకు పాటించటం కొనసాగించారు. అయితే, కొన్ని సందర్భాలలో కొందరు ఆయా కారణాలనుబట్టి యివ్వబడిన మాసంలో కాకుండా వేరే మాసంలో కూడా పస్కాను ఆచరించిన సంఘటనలు బైబిల్ లో ఉన్నాయి. [సం.కాం.9:6-12; 2దిన.వృ.30:2,15]

కాలక్రమేణా యూదులు పస్కాపండుగను అలాగే పులియనిరొట్టెల పండుగను కలిపి సమిష్టిగా ‘పస్కాపండుగ’ గా పేర్కొనటం ప్రారంభించారు. ఈ క్రమంలో నిసాన్ 14వ దినం ‘సిద్ధపరచుదినం’ గా 15వ దినం మొదలుకొని 21వ దినం వరకు పండుగదినంగా గుర్తిస్తూ ఆచరిస్తున్నారు. ఈనాడు పస్కా పశువును బలి యివ్వటానికి యెరూషలేములో దేవాలయము లేదు గనుక యూదులు నీసాను 15వదినం పస్కాను భోజనం చేసి ఆ దినం మొదలుకొని యేడు దినాలు పులియని రొట్టెల పండుగను జరుపుకుంటారు.

క్రొత్తనిబంధన పస్కా

క్రొత్తనిబంధన బోధ ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్తనిబంధన విశ్వాసుల యొక్క పస్కాబలిగా అర్పించబడ్డాడు [1కొరింథి.5:7]. యేసుక్రీస్తు నిసాన్ మాసం 14వ దినం సిలువమరణం పొందాడు. అయితే, ఆయన అదేదినం అంటే నిసాన్ 14వ దినాన సాయంత్రం [మొదటి సాయంత్రం] తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించాడు, తరువాత ఆరోజే మధ్యాహ్నం పస్కా బలిగా మారాడు.

క్రొత్తనిబంధన బోధ ప్రకారం మెస్సయ్య [క్రీస్తు] క్రొత్తనిబంధన విశ్వాసులకొరకు పస్కా బలిపశువుగా అర్పించబడ్డాడు. దీనిభావం, పాతనిబంధనలోని పస్కా బలి ఏవిధంగా దేవాలయములో వధించబడి భుజించబడిందో అదేవిధంగా యేసు క్రీస్తు బలిగా చేయబడ్డాడు అనికాదు. పాతనిబంధ గ్రంథములోని పస్కా బలిపశువు యొక్క అతి ప్రధానమైన ఉద్దేశ్యం దేవుని మాటలను విశ్వసించిన వారి కుటుంభం దేవుని ఉగ్రతకు లోనుకాకుండా రక్షించబడటం. అది క్రొత్తనిబంధన ప్రకారం పస్కా బలిగా అర్పించబడిన క్రీస్తుద్వారా క్రొత్తనిబంధన విశ్వాసులు పొందే రక్షణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *