అల్లాహ్ కు భవిశ్యత్తు ముందే తెలుసా…?

అల్లాహ్ కు భవిశ్యత్తు ముందే తెలుసా…?

May 23, 2020 ప్రశ్నలు 0

క్రింది వ్యాసం ఒక ముస్లీముకొచ్చిన క్లిష్ట సందేహానికి క్రైస్తవ వివరణ.

క్రైస్తవ దృక్కోణములో ధార్మికపద నిర్వచనాలు

దేవుడు/సృష్టికర్త: సామాన్య లక్షణాలతో కూడిన నిర్వచనము ప్రకారం దేవుడు సర్వవ్యాప్తి, సర్వజ్ఙాని, మరియు సర్వశక్తిమంతుడు. తాత్విక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారము దేవుడు నిత్యుడు, అనంతుడు, మరియు అద్వితీయుడు. నైతిక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారం దేవుడు పరిశుద్ధుడు, న్యాయవర్తనుడు, మరియు ప్రేమామయుడు. 

సర్వజ్ఙానం: తెలియదగినదంతా తెలుసుకొని వుండటం. తెలియదగినదంతా దేవునికి తెలిసు. కాని, తెలియజాలనిది దేవునికికూడా తెలియదు. మరొక నిజమైన దేవున్ని సృష్టించటమెలాగో, తననుతాను ఉనికిలోలేకుండా నాశనము చేసుకోవటమెలోగో, తాను పాపము చేయగలగటమెలాగో, తానే ఎత్తలేని పెద్ద రాయిని సృష్టించటమెలాగో మొదలైనవి దేవునికి తెలియవు. అందుకు కారణం, ఇవన్నీ తర్కవిరుద్దమైన మరియు అర్థరహితమైన మాటలు గనుక అవి అసాధ్యాలే గాక స్వతహాసిద్ధంగా తెలియజాలనివి. తర్క విరుద్ధమైనవి అర్థరహితమైనవి దేవునికి కూడా తెలిసేవి కావు!  

అయితే, వాస్తవాలు, అర్థవంతమైనవన్ని, అలాగే సుసాధ్యమైనవన్నీ దేవునికి తెలిసు. కారణం, అవే తెలియబడగలిగేవి. అస్థిత్వం అన్నది మూడు రకాలు. తప్పనిసరిగా ఉనికిని కలిగి ఉండాల్సిన అస్థిత్వం [ఎప్పుడూ వుండే అస్థిత్వం–దేవుడు], సాధ్యమైన ఉనికితోకూడిన అస్థిత్వం [ఉనికిలో ఉండవచ్చు లేక ఉనికిలో లేకుండవచ్చు–మానవులు, ప్రాణులు, పదార్థం, కాలము, మొదలైనవి], అసాధ్యమైన ఉనికితోకూడిన అస్థిత్వం [ఒక క్రొత్త నిజమైన దేవుడు, దేవుడే ఎత్తలేని రాయి, త్రిభుజాకారములోని వృత్తము, మొదలైనవి].     

సాధ్యమైన ఉనికితోకూడిన వన్నీ ఆగంతుక [contingent] అస్థిత్వాలు. అలాంటివన్నీ తప్పనిసరిగా ఉనికిని కలిగివున్న అస్థిత్వం పై [దేవుడు] ఆధారపడి ఉంటాయి. 

సాధ్యమైన  ఉనికితోకూడిన అస్థిత్వాలను దేవుడు పథక రచనచేసి సృష్టించగలడు. దేవుడు సృష్టించెవన్ని తెలియబడగలిగినవి [knowable]. ఈ కారణాన్నిబట్టి తాను సృష్టించాలని సంకల్పించేవన్నీ దేవునికి తెలిసు. ప్రవచనము లేక భవిశ్యవాణి ఈ కోవకు చెందినదే. తాను సంకల్పించినవన్నీ దేవునికి తెలిసు; తాను సంకల్పించనివేవి దేవునికి తెలియదు.  

భవిశ్యత్తు: భవిశ్యత్తు అన్నది ఇప్పుడు ఒక వాస్తవమైన ఉనికిని కలిగి వున్నది కాదు. ఒకవేళ అది రాబోవు కాలములో ఉనికిని కలిగివుండబోతే దానికి కర్త దేవుడే! కనుక, భవిశ్యత్తులో తాను ఎవేవి ఏవిధంగా సంకల్పించి సృష్టించి భవిశ్యత్తును రూపుదిద్దబోతున్నాడో ఆవిధంగానే దేవుడు భవిశ్యత్తును ఎరుగును. ఇందులో నిర్ణయ స్వేచ్ఛ కలిగిన దేవదూతల, మానవుల వునికి అలాగే వారి నిర్ణయాలు మరియు గమనాలు కూడా వున్నాయి. [యెషయా.37:26, 46:10-11, 48:3]   

భవిశ్యత్తును సృష్టించబోయేది దేవుడే అయితే, యిక తాను దాన్ని ఎలా సృష్టించబోతున్నాడోనన్నది అలాగే అది ఎలా ఉండబోతున్నదో నన్నది దేవునికి ఖచ్చితంగా తెలుసు. తాను సృష్టించబోతున్న భవిశ్యత్తులోని కొన్ని పాత్రలను, సంఘటనలను, లేక నిర్ణయ స్వేచ్ఛగల నరుల కార్యాలను దేవుడు ముందే సంకల్పించి సృష్టించే నిర్ణయం తీసుకోకుండా వదిలేస్తే యిక అలాంటి వాటి స్థానాలు తరువాత నింపబడే శూన్య స్థానాలుగా మిగిలిపోతాయి.

భవిశ్యత్తులోని వేటినైతే దేవుడు నిర్ణయించకుండా వదిలేసాడో అవన్నీ తరువాతి కాలములో దేవునిచేత లేక నిర్ణయ స్వేచ్ఛగల వ్యక్తులచేత నింపబడే ‘శూన్య స్థానాలు.’ అ  శూన్య స్థానాలలో తెలుసుకోగలిగింది ఏదీ లేదు. ఆ కారణాన్నిబట్టి, ఆ శూన్య స్థానాలు రాబోవు కాలములో తన సార్వభౌమత్వముచేతనైనా లేక తానే అనుగ్రహించే నిర్ణయ స్వేచ్ఛగలిగే దేవదూతలచేతనైనా, మానవులచేతనైనా ఏవిధంగా పూర్తిచేయబడుతాయో నన్నది దేవునికి ముందే తెలియవు.  

ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళేది లేక నరకానికి వెళ్ళేది ఆవ్యక్తి పుట్టకముందే దేవునికి తెలుసా…? తెలీదు! తెలిసే అవకాశముకూడా లేదు. ఎందుకంటే, దేవుడు తన సార్వభౌమత్వముతో గాని లేక ఆ వ్యక్తి తన నిర్ణయ స్వేచ్ఛద్వారా గాని ఆ గతిని యింకా నిర్ధారించలేదు. అయితే, ఒకవేళ దేవుడే ఆ వ్యక్తి గమ్యాన్ని నరకంగా ఆ వ్యక్తి పుట్టకముందే తన సార్వభౌమత్వముద్వారా నిర్ధారిస్తే అప్పుడు అది దేవునికి తెలుస్తుంది. కాని, అలాంటి నిర్ణయం దేవున్ని అన్యాయస్తునిగా, ప్రేమలేనివానిగా, చెడ్డవానిగా ఋజువుపరుస్తుంది. ఈ లక్షణాలేవి నిజదేవుని తత్వములో లేశమైనా లేవు. దేవుడు తన తత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయజాలడు! 

భవిశ్యత్తు నాకు తెలుసు అని దేవుడు ప్రకటిస్తే దాని భావం ఆ భవిశ్యత్తును దేవుడే నిర్ణయించి నిర్ధేషించాడు అని. అలాంటి భవిశ్యత్తు తప్పకుండా వాస్తవరూపందాల్చి తీరుతుంది. దేవుడు నిర్ధేశించిన భవిశ్యత్తులో భాగంగా అందులోని కార్యాలు సంఘటనలు అలాగే నిర్ణయ స్వేచ్ఛగల వ్యక్తుల నిర్ణయాలుకూడా ముందే దేవునిచేత నిర్ధేశించబడితే వాటిని బట్టి దేవుడు ఎవరినీ లెక్క అడుగడు లేక శిక్షించడు. ఇది దేవుని న్యాయతత్వాన్నిబట్టి గ్రహించగలిగిన సత్యం.

ఇస్లాం సమస్య

పై వాస్తవాల వెలుగులో ఇస్లాము బోధిస్తున్నట్లుగా ఎవరు నరకానికి వెళుతారో ఎవరు పరలోకములో ప్రవేశిస్తారో వారు పుట్టకముందే ఖురాను ప్రకటించే అల్లాహ్ కు ముందే తెలుసు అన్నది నిజమైతే దాని భావము ప్రతివ్యక్తిని ఆ వ్యక్తి జీవితాన్ని మరియు ఆ వ్యక్తి చేరుకునే అంతిమ స్థానాన్నికూడా ఖురాను ప్రకటించే దేవుడే నిర్ణయించి నిర్ధారిస్తున్నట్లు.

నిజానికి ఖురాను మరియు హదీసులు రెండు అదే బోధను ప్రకటిస్తున్నాయి [ఖుర్ ‘ఆన్ సురా 7:178-179; సాహీహ్ బుఖారి, సంపుటి 9, హదీతు సంఖ్య 641; సంపుటి 2, పుస్తకము 23, హదీతు సంఖ్య 444; సంపుటి 8, పుస్తకము 77, హదీతు సంఖ్య 593; సాహీహ్ ముస్లీము పుస్తకము 33, హదీతు సంఖ్య 6436]. అంటే, కొందరు వ్యక్తులను తాను సృష్టించక మునుపు ఖురాను దేవుడు ఆ వ్యక్తుల పుట్టుక, జీవన విధానము, మరణ విధానములతో పాటు వారు నరకానికి వెళ్ళటముకూడా అన్నీ తానే సంకల్పించి నిర్ధేశిస్తాడు. అలాంటి దృష్టాంతంలో మానవులకు నిజమైన నిర్ణయ స్వేచ్ఛ అంటూ ఏదీ వుండదు.     

ఆ రకమైన స్వభావలక్షణాలుండి న్యాయతత్వం మరియు ప్రేమాస్వభావాలు రెండు లేనివాడు నిజదేవుడు కానేరడన్నది అటుంచి అలాంటి వ్యక్తి అత్యంత కౄరమైన దుష్టత్వానికే మారుపేరుగా గుర్తించాలి. అదృష్టవశాత్తు అలాంటి దేవుడు ఉనికిలో లేడు, కొందరి ఊహాగానాలలో తప్ప! నిజానికి సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు అలాంటి తర్కవిరుద్ధమైన ‘జ్ఙానాన్ని’ దేవునికి అంటగట్టడం లేదు.

న్యాయం: దేవుడు తన సార్వభౌమత్వములో తన నిర్ణయ స్వేచ్ఛను వదలుకొని దేవదూతలకు మరియు మానవులకు సంపూర్ణ నిర్ణయ స్వాతంత్రాన్ని అనుగ్రహించగలడు. అప్పుడే ఆయన వారి హృదయాలోచనలనుబట్టి నిర్ణయాలనుబట్టి వారికి తీర్పుతీర్చగలడు. అలాంటి సంపూర్ణ స్వాతంత్రాన్ని యివ్వకుండా తన సంకల్పాన్నిబట్టి నిర్ణయాన్నిబట్టి వారికి తీర్పుతీర్చి వారిని శిక్షించటం అన్నది న్యాయవిరుద్ధమేగాక పతాకస్థాయిలో వ్యక్తపరచబడే దుష్టత్వం. ఈ రెండు లక్షణాలు నిజదేవుని ప్రవృత్తికి వ్యతిరేకమైనవి.

నిజమైన నిర్ణయ స్వేచ్ఛ కలిగిన వ్యక్తులను వారి హృదయాలోచనలు కార్యాలను బట్టి ఏవిధమైన పక్షపాతము లేకుండా ఒక ప్రామాణికతను ఆధారం చేసుకొని తీర్పుతీర్చటమే న్యాయము. మంచి చేసినవారికి తగిన మేలును, చెడు చేసినవారికి తగిన శిక్షను అందిచటము అందులో భాగం. 

శిక్షార్హమైనవాటిని చేయని వారిని శిక్షించటము అంతేగాకుండా శిక్షార్హమైన వాటిని చేసిన వారిని వారు చేసిన చెడు యొక్క ఫలితానికి ఎలాంటి ప్రత్యమ్నాయాన్ని స్థాపించకుండా వారిని వదిలేయటము రెండూ న్యాయవ్యతిరేకమైనవి. [సామెతలు.17:15] 

ప్రేమ: దేవునికున్న ప్రధాన నైతిక గుణలక్షణాలు పరిశుద్ధత [యెషయా.6:1-3; ప్రకటన.4:8], న్యాయతత్వం [ద్వి.కాం.32:4; యెషయా.30:18; కీర్తన.89:14], మరియు ప్రేమాతత్వం [ని.కాం.34:6; 1యోహాను.4:8,16].

నిజమైన ప్రేమ కేవళం మాటలకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైనది కాదు. కార్యాచరణలో ప్రత్యక్షమయ్యేదే నిజమైన ప్రేమ. ఉత్కృష్ట విధానములో ప్రత్యక్షమయ్యేది దైవప్రేమ. స్వీయ త్యాగం అన్నది ప్రేమయొక్క ఉత్కృష్ట ప్రత్యక్షత. ఎవరూ నశించటం యిష్టపడని నిజదేవుని పరిపూర్ణ యిచ్ఛకు కారణభూతం ప్రేమాతత్వం . దాని కార్యసాధక ప్రత్యక్షత ఈసా అల్-మసీహ్ వారి త్యాగపూరితమైన బలియాగం! [1తిమోతి.2:3-6; యోహాను.3:16; రోమా.5:6-10]

క్రైస్తవ పరిష్కారం

లోకములోని ప్రజలందరి పాపాల ఫలితమైన చెడుకు తగిన ప్రత్యమ్నాయాన్ని కోరేది దేవుని న్యాయతత్వం. ఒకవైపు తన న్యాయతత్వాన్ని సంతృప్తిపరచేందుకు మరోవైపు తన ప్రేమతత్వాన్ని ప్రత్యక్షపరచేందుకు నిజదేవుడు ఒక ప్రణాళికను సంకల్పించి దాని ప్రకారము సకాలములో తానే పాపప్రాయశ్చిత్తార్థ కార్యాన్ని నెరవేర్చి పెట్టాడు [ని.కాం.34:7; కీర్తన.145:9; అపో.కా.10:34-35; రోమా.11:32; తీతుకు.2:11, 3:4; 1యోహాను.4:9-10]. శిక్షార్హులైన వారందరు తమ స్వనీతిపై మరియు స్వభక్తిపై ఆధారపడకుండా కేవలం ఆయన నెరవేర్చిన కార్యమందు విశ్వాసముంచి నిజమైన పశ్చత్తాపముతో దేవుని వేడుకుంటే రాబోవు తీర్పుదినాన అందించబడబోయే శిక్షనుండి తప్పించే దైవక్షమాపణను ఇక్కడే యిప్పుడే అందుకోగలరు.  

దేవుడే సంపాదించిపెట్టిన ఈ రక్షణ కార్యములో మానవుల పాపాల ఫలితమైన చెడుకు ప్రత్యమ్నాయంగా దేవుడే తగిన వెల చెల్లించటం జరిగింది [రోమా.5:6-8,18; 1యోహాను.2:1-2]. అంటే, దేవుని న్యాయతత్వము ఆశిస్తున్న ప్రత్యమ్నాయ వెలను/శిక్షను దేవుని ప్రేమతత్వము చెల్లించింది. ఈ వెల/శిక్ష పాపుల పక్షంగా చెల్లించబడింది. కనుక, ఈ విధానములో ప్రతి పాపికి క్షమాపణపొందే అవకాశాన్ని దేవుడు కలిగించాడు. ఈ కార్యాన్ని దేవుడు చేసి వుండకపోతే మానవజాతికి క్షమాపణ పొందే మార్గం లేదు. 

ఏ నరుడు తాను లేక తన పొరుగువాడు మోక్షం పొందేందుకు వీలుగా తన/పొరుగువాని పాపాలకు తగిన వెలను/శిక్షను చెల్లించలేడు [కీర్తన.49:7-9]. అది దేవుడు చెల్లిస్తేనే తీర్చబడేది. క్షమాపణతో మొదలయ్యే నిత్య రక్షణ దేవుని ఉచిత బహుమానం. అది కృపచేత విశ్వాసముద్వారానే పొందగలము.

మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.” [ఎఫెసీ.2:8-9]. 

   

       

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *