మోషేవంటి ప్రవక్త

మోషేవంటి ప్రవక్త

December 23, 2019 బైబిలులో ముహమ్మద్ 1

తోరా [తవ్రాత్]

వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.” (ద్వితీయోపదేశకాండము 18:18)

దావా ప్రచారకుల వాదన

పై లేఖనములో ప్రవచించబడిన మోషేవంటి ప్రవక్త క్రైస్తవులు విశ్వసిస్తున్నట్లు యేసు క్రీస్తును గురించి కాదు, అది ముహమ్మదు ప్రవక్తనుగురించినది. అందుకుగల కారణం, పై లేఖనములోని ‘వారి సహోదరులు’ అన్న పదజాలము ఇశ్రాయేలు వంశస్థులను సూచించడములేదుగాని ఇష్మాయేలు వంశస్థులను సూచిస్తున్నది. యేసు క్రీస్తు ఇశ్రాయేలు వంశములోనుండి వచ్చాడు కనుక అది ఆయనకు వర్తించదు. ముహమ్మదు ఇష్మాయేలు వంశములోనుండి వచ్చాడుగనుక ఆ ప్రవచనము ఆయనకు వర్తిస్తుంది. 

బైబిలులోని పై లేఖన సందర్భం

దావా ప్రచారకుల వాదనలోని సత్యాసత్యాలను పరిశీలించకముందు క్రింద యివ్వబడిన వారు పేర్కొనే తోరా [తవ్రాత్] లేఖనము యొక్క సమీప సందర్భాన్నికూడా పరిశీలించాల్సిన ఆవశ్యకత వుంది:

హోరేబులో ఆ సమాజదినమున నీవు నేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.  మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది; వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.” (18:15-19)

యదార్థ పరిశీలన

తోరా [తవ్రాత్] గ్రంథములోని ద్వితియోపదేశకాండము అన్న పేరుగల గ్రంథములో 18 వ అధ్యాయమునందలి 15 మొదలుకొని 19 వచనాలవరకు యివ్వబడిన ప్రవచనాలలో మోషే వంటి ఒక గొప్ప ప్రవక్త యొక్క రాకడను గురించి తెలియచేయబడింది. అయితే, ప్రవచించబడిన మోషేవంటి ప్రవక్త ఎవరు…?

తాల్ముదు బోధలనాధారం చెసుకున్న యూదుమతస్తుల అభిప్రాయం ప్రకారము అది మోషే వెంటనే ఇశ్రాయేలీయులను నడిపించటములో నాయకత్వాన్ని చేపట్టిన యెహోషువాను గురించిన ప్రవచనం. ఇక ఇస్లాము మతబోధలను ప్రచారం చేస్తున్న దావా ప్రచారకుల కథనం ప్రకారము అది ఇస్లాము మత స్థాపకుడు ముహమ్మదు రాకడను గురించిన ప్రవచనం. క్రైస్తవుల గ్రహింపు ప్రకారం అది యేసు క్రీస్తును గురించిన ప్రవచనం. నిజనిర్ధారణకు లేఖన పరిశోధనే సరియైన విధానం. 

‘మోషేవంటి ప్రవక్త’ అంటే ఏమిటి? మోషే వంటి రూపురేఖలు కలవాడు అని భావమా? మోషే వంటి హావభావాలున్న వ్యక్తి అని అర్థమా? లేక, మోషే పోషించిన పాత్రను పోషిస్తూ ఆయన కలిగియున్న ప్రత్యేకతలను కలిగియున్న వాడు అని సూచించటమా?

‘మోషేవంటి ప్రవక్త’ అంటే మోషే ఏవిధంగా ఉత్కృష్ట విధానములో జీవిస్తూ తన జీవితములో దైవశక్తిని వ్యక్తపరచాడో ఆవిధానములో ఉత్కృష్ట జీవితాన్ని జీవిస్తూ దైవశక్తిని వ్యక్తపరచే ప్రవక్త అని భావము. ఇది గ్రహించని దావా ప్రచారకులు తమదైన వైఖరిలో వాదిస్తూ మోషే సహజసిద్ధంగా తల్లితండ్రికి పుట్టాడు అలాగే ముహమ్మదు సహజసిద్ధంగా తల్లితండ్రికి పుట్టాడు, మోషేకు పెళ్ళి అయింది అలాగే ముహమ్మదుకు పెళ్ళి అయింది, మోషేకు పిల్లలు పుట్టారు అలాగే ముహమ్మదుకు పిల్లలు పుట్టారు, మోషే పేరు ‘మ’ అన్న హల్లుతో మొదలవుతుంది అలాగే ముహామ్మదు పేరు ‘మ’ అన్న హల్లుతో మొదలవుతుంది, మోషే యుద్దాలలో పాలుగొన్నాడు ముహమ్మదుకూడా యుద్దాలలో పాలుగొన్నాడు అంటూ ఈలాంటి పసలేని ప్రత్యేకతలను వళ్ళెవేస్తు ముహమ్మదే మోషేవంటి ప్రవక్త అని తమకు తాము నిరూపించుకొని చంకలు గుద్దుకుంటూ సంబరపడిపోతుంటారు. ఈ రకమైన వాదనా విధానం అన్నది దాన్ని అవలంభించేవారి ఆత్మీయ గ్రహింపు మరియు విచక్షణా స్థాయిలకే అద్దం పడుతుంది.

తోరాలోనుండి వుటంకించబడిన పై లేఖనములో ‘మోషేవంటి ప్రవక్త’ గురించి ఎవరు, ఎవరితో, ఏమని తెలియచేస్తున్నారు…?

‘మోషేవంటి ప్రవక్త’ గురించి సెలవిస్తున్నది ఎవరు?
దైవజనుడు మోషే ద్వారా ప్రభువైన దేవుడు.

‘మోషేవంటి ప్రవక్త’ గురించి ఎవరికి ప్రకటించబడుతున్నది, ఐగుప్తీయులకా లేక అస్సీరీయులకా లేక అరబ్బులకా/ఇష్మాయేలీయులకా లేక ఇశ్రాయేలీయులకా?
ఇశ్రాయేలీయులకు!

‘మోషేవంటి ప్రవక్త’ ఏమి చేయబోతున్నాడని వివరిస్తున్నది?
ప్రభువైన దేవుడు ఆజ్ఙాపించినది యావత్తు ‘వారితో’ అంటే ఇశ్రాయేలీయులతో [ఐగుప్తీయులతో కాదు, అస్సీరీయులతో కాదు, అరబ్బులతో లేక ఇష్మాయేలీయులతో కాదు] చెప్పును!

పై లేఖనాలలో యివ్వబడిన రాబోతున్న ‘మోషేవంటి ప్రవక్త’కు చెందిన ప్రధానమైన గుర్తులు

(1) దేవుడు ఆయనను వారి [ఇశ్రాయేలీయుల] మధ్య పుట్టించబోతున్నాడు/లేపబోతున్నాడు (18:16)
(2) దేవుడు ఆయనను వారి [ఇశ్రాయేలీయుల] కొరకు పుట్టించబోతున్నాడు/లేపబోతున్నాడు (18:16)
(3) దేవుడు ఆయనను వారి [ఇశ్రాయేలీయుల] సహోదరులలో [אֲחֵיהֶ֖ם/అఖెహెం] నుండి పుట్టించబోతున్నాడు/లేపబోతున్నాడు (18:16)
(4) అతని నోట దేవుడు తన మాటలను వుంచుతాడు (18:18)
(5) దేవుడు ఆయనకు ఆజ్ఙాపించినది యావత్తు అతడు వారికి [ఇశ్రాయేలీయులకు] తెలియజేస్తాడు (18:18) 

దేవుడు ఆయనను ఇశ్రాయేలీయుల మధ్య పుట్టించబోతున్నాడు/లేపబోతున్నాడు: రాబోతున్న ‘మోషేవంటి ప్రవక్త’ను దేవుడు ఎవరిమధ్య పుట్టించబోతున్నాడని లేఖనం స్పష్టంగా తెలియచేస్తున్నది, అరబ్బుల మధ్యా లేక ఇశ్రాయేలీయుల మధ్యా? ఇశ్రాయేలీయుల మధ్య అన్నది లేఖన సత్యం. ఇస్లాము ప్రవక్త ముహమ్మదు ఎవరి మధ్య పుట్టాడు లేక లేచాడు, ఇశ్రాయేలీయుల మధ్యా లేక అరబ్బుల మధ్యా? అరబ్బుల మధ్య. కనుక, దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య పుట్టించబోతున్న లేక లేపబోతున్న ప్రవక్త ముహమ్మదు కాదు 

దేవుడు ఆయనను ఇశ్రాయేలీయుల కొరకు పుట్టించబోతున్నాడు/లేపబోతున్నాడు: ఖురాను ప్రకారం ముహమ్మదు ఎవరి యొద్దకు పంపించబడ్డాడు, ఇశ్రాయేలీయుల యొద్దకా లేక అరబ్బుల యొద్దకా? అరబ్బుల యొద్దకు (సురా.6:92; 42:7; 43:3). ఖురాను బోధ సూచిస్తున్న దాని ప్రకారము కూడా ముహమ్మదు ప్రవక్తగా అరబ్బుల కొరకు పుట్టించబడ్డాడు. అయితే, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు పుట్టించబడ్డాడని ఒక్క సారికూడా ఖురాను పేర్కొనడము లేదు అన్నది ఇస్లాము మతస్తులు గ్రహించాలి. తోరాలోని ప్రవచన ప్రకారం రాబోతున్న ‘మోషేవంటి ప్రవక్త’ ఇశ్రాయేలీయుల కొరకు పుట్టబోతున్నాడు. అరబ్బుల మధ్య అరబ్బుల కొరకు పుట్టిన ముహమ్మదు మాత్రం మోషేవంటి ప్రవక్త కాదు. 

దేవుడు ఆయనను ఇశ్రాయేలీయుల సహోదరులలోనుండి పుట్టించబోతున్నాడు/లేపబోతున్నాడు: ద్వితియోపదేశకాండము 18:16 & 18 వచనాలలోని ఇశ్రాయేలీయుల ‘సహోదరులు ‘ అంటే ఎవరు? సహోదరులు అన్న పదం హీబ్రూ భాషా పదమైన ‘అఖెహెం ‘ [אֲחֵיהֶ֖ם = తోబుట్టువులు; రక్తసంబంధులు; వంశస్థులు] యొక్క అనువాదం. ఈ పదం హీబ్రూ భాషలోని పాతనిబంధన గ్రంథములో వుపయోగించబడిన విధానము క్రింది లేఖనాలలో చూడవచ్చు: 

– “అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు [אֲחֵיהֶ֖ם/అఖెహెం=తోబుట్టువులు] ఆ సంగతి తెలిపెను.” (ఆది.కాం.9:22)
– “కాబట్టి అబ్రాము మనము బంధువులము [אֲחֵיהֶ֖ם/అఖెహెం=రక్తసంబంధులు] గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు.” (ఆది.కాం.13:8) 
-“మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు [אֲחֵיהֶ֖ם/అఖెహెం=రక్తసంబంధులు] గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించుకొనకూడదు.” (లే.కాం.25:46)
– “ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను [אֲחֵיהֶ֖ם/అఖెహెం=వంశస్థులు] తీసికొని యున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీ కప్పగింపబడియున్నారు.” (సం.కాం.18:6)
– “అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల [אֲחֵיהֶ֖ם/అఖెహెం=రక్తసంబంధులు] వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యునికిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.” (ద్వి.కాం.1:16)
– “శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల [אֲחֵיהֶ֖ם/అఖెహెం=రక్తసంబంధులు] పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.” (ద్వి.కాం.2:4)
– “గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును ​కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీ యులకును గాదీయులకును ఇచ్చితిని. ​ఆ కాలమందు నేను మిమ్మును చూచిమీరు స్వాధీన పరచుకొనునట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరు యుద్ధసన్నధ్దులై మీ సహోదరులగు [אֲחֵיהֶ֖ם/అఖెహెం=వంశస్థులు] ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతి నిచ్చినట్లు మీ సహోదరులకును [אֲחֵיהֶ֖ם/అఖెహెం=వంశస్థులు], విశ్రాంతినిచ్చువరకు, అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారి కిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీ కిచ్చిన పురములలో నివసింప వలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును.” (ద్వి.కాం.3:16-20)
– “నీ సహోదరులలోనే [אֲחֵיהֶ֖ם/అఖెహెం=వంశస్థులు] ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడుకాని అన్యుని నీమీద నియమించుకొనకూడదు.” (ద్వి.కాం.17:15)
– “యాజకులైన లేవీయులకు, అనగా లేవీగోత్రీయుల కందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు; అది వారి హక్కు. వారి సహోదరులతో [אֲחֵיהֶ֖ם/అఖెహెం=వంశస్థులు] వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱగాని మేకగాని బలిగా అర్పించువారి వలన యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను.” (ద్వి.కాం.18:1-3) 

మనుషులందరు ఆదాము సంతానము. ఆ కారణాన్ని బట్టి భూలోకములోని వంశాలన్నీ కూడా ఒకరికొకరు సహోదరులే! అయితే, రాబోవు మోషేవంటి ప్రవక్తను గుర్తించటానికి తోరా [తవ్రాత్] లేఖనాలు అందిస్తున్న వివరాలలో ‘వారి సహోదరులలోనుండి’ అన్న పదజాలములోని ‘సహోదరులు’ అన్న పదానికి సందర్భానుచితమైన ప్రత్యేకత వుంది. 

పై లేఖనాల వెలుగులో ‘సహోదరులు’ [אֲחֵיהֶ֖ם/అఖెహెం] అన్న పదం సందర్భానుసారంగా మూడురకాల భావాలతో బైబిలులో వుపయోగించబడింది. వాటిలో ప్రధానమైన భావం, ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాల వంశస్థులు ఒకరికొకరు సహోదరులు [אֲחֵיהֶ֖ם/అఖెహెం].

ఇశ్రాయేలీయుల వంశాల వెలుపలి వంశాలలోని కేవలము ఎదోమీయులను అంటే ఏశావు సంతానాన్ని మాత్రమే ఇశ్రాయేలీయులకు సహోదరులుగా [אֲחֵיהֶ֖ם/అఖెహెం] బైబిలు అభివర్ణిస్తున్నది (ద్వి.కాం.2:4). ఈ సందర్భంగా గమనించాల్సిన విశయము, అమ్మోనీయులను లేక మోయాబీయులను లేక ఇష్మాయేలీయులను ఎవరినికూడా ఇశ్రాయేలీయులకు సహోదరులనుగా బైబిలు పేర్కొనలేదు.

ఒకే తల్లి కడుపున పుట్టిన యాకోబు [ఇశ్రాయేలు] మరియు ఏశావు [ఎదోము] లిరువురు తోబుట్టువులు. వారి సంతానమైన ఇశ్రాయేలీయులు మరియు ఎదోమీయులు ఒకరికొకరు రక్తసంబంధులు. ఆ కారణాన్ని బట్టే ఇశ్రాయేలీయులకు ఎదోమీయులు సహోదరులు [אֲחֵיהֶ֖ם/అఖెహెం=రక్తసంబంధులు] అంటూ తోరా [తవ్రాత్] విస్పష్టముగా సూచిస్తున్నది (ద్వి.కాం.2:4). అయితే, యాకోబు మరియు ఇష్మాయేలు యిరువురు ఒకే తల్లికి పుట్టిన తోబుట్టువులు కాదు. ఆ కారణాన్ని బట్టి వారి సంతానము ఒకరికొకరు సహోదరులు [אֲחֵיהֶ֖ם/అఖెహెం=రక్తసంబంధులు] అంటూ తోరా [తవ్రాత్] ఒక్క సారికూడా సూచించటము లేదు.

తోరాలో ప్రవచించబడిన ‘మోషేవంటి ప్రవక్త’ ఇశ్రాయేలీయుల అఖెహెం[אֲחֵיהֶ֖ם]లోనుండి అంటే ఇశ్రాయేలీయుల వంశములోనుండే రాబోతున్నాడు. కనుక, ఇశ్రాయేలీయులలోనుండి కాక అరబ్బులలోనుండి వచ్చిన ముహమ్మదు ‘మోషేవంటి ప్రవక్త ‘ కాదు.

అతని నోట దేవుడు తన మాటలను వుంచుతాడు: తోరా [తవ్రాత్] ప్రవచనములో ముహమ్మదుగారిని చూడాలన్న తపనతో దావా ప్రచారకులు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను వుద్దేశపూర్వకంగా మరచిపోతుంటారు. ఇస్లాము మత ప్రవక్త ముహమ్మదుకు ఖురానును అందించినది జిబ్రాయేలు దూత అన్నది ఇస్లాము బోధ. కొందరు అభిప్రాయపడుతున్నట్లుగా ఇది అల్లాహ్ తానే ముహమ్మద్ యొక్క నోట తన మాటలను వుంచడము కాదు. ఇస్లాము మత బోధ ప్రకారము ప్రతి వ్యక్తి యొక్క పుట్టుక, జీవితం [మాటలు మరియు చేష్టలు] మరణం, చివరికి మరణము తరువాతి స్థితి అన్నీ కూడా ఆ వ్యక్తి పుట్టుకకు ముందే అల్లాహ్ తన దూతల చేత వ్రాయించి పెడతాడు. అలా దూతల చేత వ్రాయబడిన వాటికి వేరుగా ఏదీ జరుగదు. ఒకవేల ఇదే నిజమైతే యిక ప్రతి వ్యక్తి నోట మాటలను వుంచేది కూడా అల్లానే. ఆ పక్షములో “అతని నోట దేవుడు తన మాటలను వుంచుతాడు” అన్న ప్రవచనానికి విలువేమి వుండదు.

కనుక, ముహమ్మదు నోటికి ఖురానును అందించినది ఇస్లాము బోధ ప్రకారము జిబ్రాయీల్ దూత. ఈ కారణాన్ని బట్టి ఇది తోరా [తవ్రాత్] లోని ప్రవచనము సెలవిస్తున్న విధంగా రాబోవు మోషేవంటి ప్రవక్త నోట దేవుడు తన మాటలను వుంచుతాడు అన్న దానికి సరితూగదు.

దేవుడు ఆయనకు ఆజ్ఙాపించినది యావత్తు అతడు ఇశ్రాయేలీయులకు తెలియజేస్తాడు: తోరా [తవ్రాత్] ప్రవచనములో యివ్వబడిన ఈ గుర్తుకూడా ఇస్లాము ప్రవక్త ముహమ్మదుకు సరిపోదు.

పూర్వ గ్రంథాలలో [తవ్రాత్, జబుర్, ఇంజీల్] దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రవక్తను పంపబోతున్నట్లు వాగ్ధానం చేసాడుగాని ఎక్కడా కూడా అరబ్బులకు ప్రవక్తను పంపబోతున్నట్లు వాగ్ధానం చేయలేదు. మోషే తదుపరి దేవుడు పంపిన నిజ ప్రవక్తలందరు ఇశ్రాయేలీయుల మధ్య ఇశ్రాయేలీయులకు ఇశ్రాయేలీయుల భాషలో దేవుని సందేశాలను అందించారు. ఈ విధానములో కొనసాగిన నిజ ప్రవక్తల పరంపరను తొలగించి అరబ్బులమధ్య అరబ్బులకు అరబ్బుల భాషలో సందేశాలను పంపబోతున్నట్లు దేవుడు పూర్వ గ్రంథాలలో వాగ్ధానమేదీ చేయలేదు. ఇదే సందర్భములో, అల్లాహ్ ఇశ్రాయేలీయుల యొద్దకు ముహమ్మదును ప్రవక్తగా లేక సందేశాహరునిగా పంపిస్తున్నట్లు ప్రకటించిన ఆధారాలు కూడా ఎవీ లేవు అన్నది గమనములో వుంచుకోవాలి.

ఖురానుద్వారా ముహమ్మదు తెలియచేసిన ధార్మిక విశయాలు ప్రధానంగా అరబ్బు ప్రాంతములోని అరబ్బులకు అన్నది ఖురాను యిస్తున్న సాక్ష్యం (సురా.6:92,156; 14:4; 42:7; 62:2; ). ఈ వాస్తవాన్నిబట్టి కూడా ద్వితియోపదేశకాండము 18:18 లోని మోషేవంటి ప్రవక్త ముహమ్మదు కాదు అన్నది సుస్పష్టము.

తోరా [తవ్రాత్] గ్రంథములోని సమగ్ర బోధ మరియు అ బోధను పాటించడములో నిజప్రవక్తలు చూపిన మాదిరి రెండూ కలిపి ద్వితియోపదేశకాండము 18:18 లోని ‘వారి సహోదరులలోనుండి’ అన్న పదజాలము యొక్క స్పష్టమైన భావము ‘ఇశ్రాయేలీయుల వంశములోనుండి’ అని నిరూపితమవుతున్నది.

యెహోషువ

మోషేవంటి ప్రవక్త ముహమ్మద్ కాదు, మరి ఎవరా ప్రవక్త? యూదుమతస్తులు భావిస్తున్నట్లు యెహోషువ మోషేవంటి ప్రవక్తా…?

బైబిలు వెలుగులో యెహోషువ కూడా మోషేవంటి ప్రవక్త కాదు అనడానికి క్రింది ఆధారాలే కారణం:

(1) యెహోషువ ఇశ్రాయేలీయుల వంశమువాడే. కాని ఆయన మోషే తరువాత ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడు మాత్రమే. అతను ప్రవక్త కాదు ప్రధాన యాజకుడు కాదు. తోరా [తవ్రాత్] లోనేగాక తనాక్ గ్రంథమంతటిలో ఎక్కడాకూడా యెహోషువను ప్రవక్తగా లేఖనాలు గుర్తించటము లేదు.

(2) యెహోషువ ఇశ్రాయేలీయులకు నాయకునిగా మోషే చేత అభిషేకించబడిన తరువాత తోరా [తవ్రాత్] ప్రకటించిన విశయం,

“ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని ​​అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయములోను, ఆ బాహుబల మంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు.” (ద్వి.కాం.34:10-12)

యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్]    

క్రీస్తు [మసీహ్] గా అవతరించిన యేసే [ఈసా] తోరా [తవ్రాత్] ప్రకటించిన ‘మోషేవంటి ప్రవక్త’ అని గ్రహించటానికి క్రింది సత్యాలే స్పష్టమైన ఆధారాలు:

 1. మోషే ఇశ్రాయేలీయుల వంశములో జన్మించాడు, ఇశ్రాయేలీయుల మధ్య, ఇశ్రాయేలీయుల కొరకు ప్రవక్తగా పంపించబడ్డాడు. [ని.కాం.2:1-10; 3:1-17]
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] కూడా ఇశ్రాయేలీయుల వంశములో జన్మించాడు, ఇశ్రాయేలీయుల కొరకు, ఇశ్రాయేలీయుల మధ్య ప్రవక్తగా పంపించబడ్డాడు. [మత్తయి.1:1-16; 2:4-5; 15:24].
  గమనిక: ఈసత్యాన్ని ఖురాన్ కూడా ఒప్పుకుంటున్నది, “అతను [మసీహ్] ఇస్రాయీలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు.” (సురా 3:49). కాని, ముహమ్మదు ఇస్రాయీలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు అంటూ ఖురాను ఎక్కడా ప్రకటించడం లేదు!
 2. మోషే దేవుడు ఆజ్ఙాపించిన వాటన్నిటిని ఇశ్రాయేలీయులకు [అరబ్బులకు కాదు లేక ఇష్మాయేలీయులకు కాదు] తెలియచేసాడు. [ని.కాం.4:12,15; ద్వి.కాం.1:3]
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] నోట దేవుడే తన మాటలను వుంచాడు. దేవుడు ఆజ్ఙాపించినవన్నీ ఇశ్రాయేలీయులకు [అరబ్బులకు కాదు లేక ఇష్మాయేలీయులకు కాదు] తెలియచేసాడు [యోహాను.7:16, 8:28; 12:49; 13:49; 15:15; 17:8].
 3. మోషె దేవుని వ్యక్తిగత నామాన్ని ఎరిగినవాడు మరియు ఉచ్చరించిన వాడు [ని.కాం.3:14-15; ద్వి.కాం.1:6].
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్]] కూడా దేవుని వ్యక్తిగత నామాన్ని ఎరిగినవాడు మరియు ఉచ్చరించినవాడు [మత్తయి.4:10; లూకా.4:17-19].
 4. మోషే దేవుని శక్తి చేత దురాత్మల శక్తులను అణగద్రొక్కాడు.[ని.కాం.7:8-12, 8:16-19].
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] దేవుని శక్తి చేత దురాత్మలను అణగద్రొక్కాడు. అంతేగాక, తన అనుచరులకు దురాత్మలపై అధికారాన్ని అనుగ్రహించాడు [లూకా.4:31-37, 7:21; 10:17-20]
 5. మోషే వ్రాయటము చదవటము వచ్చిన విద్యాజ్ఙానము కలవాడు [ని.కాం.24:4; అపో.కా.7:20-23]
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] పామరునిగా పెరిగినా వ్రాయటము మరియు చదవటము దేవుని శక్తిచేత మానవాతీత విధానములో అందుకొని అందరికంటే గొప్ప విద్యాజ్ఙానాన్ని ప్రదర్శించాడు. [యోహాను.7:14-15; లూకా.4:16-22; యోహాను.8:6]
 6. మోషే దేవునిచేత నియమించబడ్డాడు అన్న వాస్తవాన్ని నిర్ధారించే విధంగా దేవుడే తన స్వరాన్ని ప్రజలకు వినిపింప చేసాడు (ని.కాం.20:18-20; ద్వి.కాం.4:33; 18:16).
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] విషయములో కూడా దేవుడే తన స్వరాన్ని ప్రజలకు వినిపింప చేసాడు (మత్తయి.3:17; 17:5).
 7. ఏవిధంగా దేవుడు నియమించిన అహరోను మోషేముందు వెళ్ళాడో (ని.కాం.4:27-31)
  అలాగే దేవుడు నియమించిన బాప్తీస్మమిచ్చు యోహానుకూడా యేసుకు ముందు వెళ్ళాడు (యోహాను.1:19-34).
 8. పండితులు పామరులు అన్న భేదం లేకుండా అందరు చూసి గ్రహించగలిగిన ఎన్నో మహత్కార్యములను మోషే చేయడం జరిగింది (ద్వి.కాం.34:10-12).
  అదేవిధంగా యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] కూడా అందరు చూసి గ్రహించగలిగిన ఎన్నో మహత్కార్యములను చేసాడు (మత్తయి.11:20; మార్కు.6:2; అపో.కా.2:22).
 9. ఇశ్రాయేలీయులు వారి పాపాలనుండి క్షమించబడేందుకు దేవుని యెదుట తన జీవితాన్ని త్యాగం చేసుకోవటానికి మోషే సిద్దపడ్డాడు (ని.కాం.32:30-35).
  ప్రజలందరి పాపాలు క్షమించబడేందుకై యేసు [ఈసా] దేవుని యెదుట తనను తాను త్యాగం చేసుకున్నాడు (యెషయా.53:8-12; మార్కు.10:45; లూకా.24:45-47; 1తిమోతి.2:3-6).
 10. మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రవక్త, నాయకుడు, మరియు యాజకుని పాత్రలను నిర్వర్తించాడు [ద్వి.కాం.33:4, 34:10-12; సం.కాం.33:1; 36:1; కీర్తన.99:6].
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] ఇశ్రాయేలీయుల యొక్క ప్రవక్త, నాయకుడు, మరియు యాజకుడు [ప్రవక్త–మత్తయి.13:57; యోహాను.4:44; యోహాను.6:14; అపో.3:22-26; నాయకుడు–మీకా.5:2; మత్తయి.2:1-5; ప్రకటన.20:1-6; యాజకుడు–జెకర్యా.6:12-13; కీర్తన.110:4=హెబ్రీ.5:5-6, 6:20, 7:15-25].
 11. మోషే దేవుని మహిమను చూశాడు మరియు ఆయన దేవున్ని ముఖాముఖిగా ఎరిగిన గొప్ప ప్రవక్త [ని.కాం.33:120-34:8; సం.కాం.12:6-8; ద్వి.కాం.34:12].
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] తండ్రిని చూసినవాడు మాత్రమేగాక ఆయన తండ్రితో అత్యంత సామీప్యత మరియు అన్యోన్యతను కలిగిన వాడు. అంతమాత్రమే కాక యేసు దేవుని మహిమ, రూపము, మరియు స్వరూపముకూడా తానే అయి వున్నాడు [యోహాను.1:1,18, 6:46; 2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15; ఫిలిప్పీ.2:6; హెబ్రీ.1:3].
 12. మోషే తన మరణాన్ని మరియు మరణవిధానాన్ని ముందే ఎరిగాడు అంతేగాక మరణము తరువాత వ్యక్తులకు ప్రత్యక్షమయ్యాడు (ద్వి.కాం.32:48-52; మత్తయి.17:3).
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] కూడా తన మరణాన్ని మరియు మరణవిధాన్నాన్ని ముందే ఎరగడమేగాక మరణము తరువాత అనేకులకు అనేక దినాలు ప్రత్యక్షమవుతూ వచ్చాడు (మార్కు.9:31, 10:32-34; లూకా.24:36-49).
 13. ఎంతో గొప్పవాడైన మోషే తనను తాను తగ్గించుకొని సాత్వికునిగా ప్రవర్తించాడు (సం.కాం.12:3; 16:1-4).
  అందరిలో గొప్పవాడైన యేసుకూడా తనను తాను తగ్గించుకొని సాత్వికునిగా జీవించాడు (మత్తయి.11:29; యోహాను.13:1-11).
 14. మోషే దేవునికి మరియు ఇశ్రాయేలు ప్రజలకు నడుమ మధ్యవర్తిగా వుండి పాతనిబంధన యేర్పాటులో ప్రముఖ పాత్రను వహించాడు (ని.కాం.24:1-8).
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] కూడా దేవునికి మరియు లోక ప్రజలకు నడుమ మధ్యవర్తిగా వుండి క్రొత్తనిబంధన యేర్పాటులో ప్రముఖ పాత్రను వహించాడు (లూకా.22:14-22; 1తిమోతి.2:3-6; హెబ్రీ.8:6-7, 9:15).
 15. మోషే అత్యంత సాత్వికము గలవాడు. [సం.కాం.12:3]
  యేసు క్రీస్తు [ఈసా అల్-మసీహ్] సాత్వికములో మాదిరిగా ఉన్నవాడు. [మత్తయి.11:29; 2.కొరింథీ.10:1]
 16. సృష్టికర్త అయిన దేవుడు “తండ్రి” అని మోషే బోధించాడు. [ద్వి.కాం.32:6]
  యేసు [ఈసా] కూడా దేవుడు “పరలోకమందున్న తండ్రి” అని బోధించాడు. [మత్తయి.6:9]

యేసు [ఈసా] మాత్రమే తోరా [తవ్రాత్] ప్రవచించిన రాబోవు ‘మోషేవంటి ప్రవక్త’ అని ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా విశ్వసించేందుకు పై పదహారు విశిష్టమైన లేఖనాధారాలు మన ముందు ఉన్నాయి.

వీటికి తోడు యేసే [ఈసాయే] మోషేవంటి ప్రవక్త అన్న సత్యాన్ని క్రొత్తనిబంధనా లేఖనాలు తోరా [తవ్రాత్] లేఖనాలను ఉటంకిస్తూ రూఢీపరుస్తున్నాయి (అపో.కా.3:22-26; 7:37,52). హాస్యాస్పదమైన విశయమేమిటంటే, ముహమ్మద్ మోషేవంటి ప్రవక్త అంటూ తవ్రాతులోని లేఖనాలను ఉటంకిస్తూ ఒక్కసారి అయినా ఖురాన్ పేర్కొనడంలేదు. అయినా, ఈనాటి దావా ప్రచారకులు తమ ప్రవక్తకు తెలియని వాటిని ఖురాన్ ఎరుగనివాటిని ముహమ్మదుకు అంటగట్టే తపనతో వ్యర్థప్రయత్నాలలో తాము కొనసాగుతూ యితరులనుకూడా తప్పుత్రోవ పట్టిస్తున్నారు.

 

One Response

 1. Pastor Ashok Kumar says:

  Very useful information from Bible to all Christian congregation for oppose or fight against satan and his tricks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *