ఖురాన్లో ఖగోళ గందరగోళం!

ఖురాన్లో ఖగోళ గందరగోళం!

May 16, 2020 శాస్త్రం 0

ఖురానులో శాస్త్రజ్ఙానం ‘ఉంది’ అంటూ చెప్పుకుంటూ తిరగటం దావా ప్రచారకుల ప్రత్యేకత.

దావా ప్రచారకులు తమదైన శైలిలో ఖురానులో లేని ఆధునిక శాస్త్ర ఆవిష్కరణలను ఉన్నట్లుగా అదే సమయములో ఖురానులో వున్న ఆధునిక శాస్త్ర ఆవిష్కరణలకు వ్యతిరేకమైన ప్రకటనలను లేనట్లుగా చేసి చూపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. వారి ప్రయత్నాలకు అమాయకులు, అజ్ఙానులు ఇంకా చెప్పాలంటే శాస్త్రవిధ్యలో సరియైన పరిజ్ఙానం మరియు అవగాహన లేనివారు తరచుగా బలి అవటం చూడవచ్చు.  

ఖురానులోని కొన్ని అస్పష్టమైన మాటలను చూపిస్తూ వాటిలో ఖగోళశాస్త్రానికి సంబంధించిన ఆధునిక శాస్త్ర ఆవిష్కరణలున్నాయంటూ దావా ప్రచారకులు నమ్మబలుకుతుంటారు. మరి వారి ప్రకటనలలో ఎంతసత్యముందో అన్నది పరిశీలించే ప్రయత్నాలలో భాగమే ఈ వ్యాస వివరణ.

ఇందుకుగాను, ముందు ఆధునిక శాస్త్ర ఆవిష్కరణలేమిటో, అలాగే ఖురాను చేస్తున్న ప్రకటనలేమిటో, చివరకు ఈ రెండింటిని దావా ప్రచారకులు ఏవిధంగా అనుసంధానం చేస్తున్నారో మీముందు ఉంచుతున్నాము. ఈ పరిశోధనలో మీరే న్యాయనిర్ణేతలు.

దావా ప్రచారకులు చెప్పుకుంటున్నట్లుగా ఖురానులో ఖగోళశాస్త్రానికి చెందిన ఆధునిక శాస్త్రావిష్కరణలంటూ వుంటే ఖురాను మానవాతీత ప్రత్యక్షత అన్నది ఒప్పుకోవచ్చు. అదేవిధంగా, ఒకవేళ అందులో ఆధునిక శాస్త్రావిష్కరణలకు వ్యతిరేకమైన ప్రకటనలుంటే అది కేవలం మానవులు వ్రాసుకున్న గ్రంథం అన్న సత్యం నిర్ధారించబడుతుంది అన్న విశయం కూడా జ్ఙాపకముంచుకోవాలి.     

ఖగోళశాస్త్ర నిర్ధారణలు

ఖగోళశాస్త్రం [Astronomy] నిర్ధారణగా తెలియచేస్తున్న దాని ప్రకారం సౌర వ్యవస్థలో [Solar System]…

– భూమి తనచుట్టూ తాను తాను సెకనుకు 460 మీటర్లు తిరుగుతున్నది

– భూమి శూన్యములో వ్రేలాడబడి ఏ ఆధారము లేకుండా ఉంది

– భూమి సూర్యుని చుట్టూ కూడా ఒక నిర్దిష్టమైన కక్ష్యలో [Orbit] సెకనుకు 30 కి.మీ. వేగముతో పరిభ్రమిస్తున్నది

– చంద్రుడు తనచుట్టూ తాను సెకనుకు 1.023 కి.మీ. వేగముతో తిరుగుతు భూమిచుట్టూ కూడా ఒక నిర్దిష్టమైన కక్ష్యలో సెకనుకు 1.023 కి.మీ. వేగముతోనే పరిభ్రమిస్తున్నాడు. అయితే, నిజానికి చంద్రుడు భూమిచుట్టూ పరిభ్రమిస్తున్న సమయములో చంద్రుని వృత్తాకార కక్ష్య నడుమ భూమి నిశ్చలంగా ఉండక తానుకూడా భూచంద్రుల సమిష్టి పదార్థ కేంద్రమైన బారిసెంటర్ [barycenter] అనబడే అదృశ్య బిందువు చుట్టూ ఒక సంకుచిత కక్ష్యలో పరిభ్రమిస్తున్నది

– చంద్రుడు భూమితో కలిసి ఒక నిర్దిష్టమైన కక్ష్యలో సూర్యునిచుట్టు కూడా సెకనుకు 30 కి.మీ. వేగముతో పరిభ్రమిస్తున్నాడు

– వీటన్నిటిమధ్య సూర్యుడు వాటి కదలికలను నియంత్రించే కేంద్రస్థానంగా ఉన్నాడు. అయితే, సుర్యుడుకూడా సౌరవ్యవస్థలోని గ్రహాలు మరియు ఉపగ్రహాల యొక్క గురుత్వాకర్షణ శక్తిని సమతుల్యం చేసే ప్రయత్నములో తానుకూడా సౌరవ్యవస్థ యొక్క కేంద్ర భాగములో సుడుల ఆకారములోని చిన్నచిన్న కక్ష్యలలో [looping mini-orbits] కదులుతూ బారిసెంటర్ [barycenter] అనబడే సౌరవ్యవస్థ యొక్క అదృశ్య కేంద్రము చుట్టూ పరిభ్రమిస్తున్నాడు అన్నది ఖగోళశాస్త్రం తెలియచేస్తున్న వాస్తవం. అయినా, సౌరవ్యవస్థ యొక్క కేంద్రస్థానములో ఉన్న అనేక అస్థిర కక్ష్యలలోని సూర్యుని కదలికకు మరియు చంద్రుని కదలికకు అలాగే రాత్రింబగళ్ళకు ఏ సంబంధము లేదు

ఖగోళశాస్త్రం [Astronomy] నిర్ధారణగా తెలియచేస్తున్న దాని ప్రకారం మనముంటున్న సౌర వ్యవస్థ [solar system] అంతాకూడా పాలపుంత [Milky Way] అనబడే నక్షత్రమండలములో [Galaxy] ఒక భాగంగా వుంటూ…

– పాలపుంతలోని మిగతా నక్షత్రాల మధ్య ఒక స్థిరమైన కక్ష్యలో సెకనుకు 220 కి.మీ. వేగముతో ప్రయాణం చేస్తున్నది 

– అంటే, సుర్యుడొక్కటేగాక సుర్యునితోపాటు భూమి మరియు మిగతా గ్రహాలు అలాగే వాటన్నిటి ఉపగ్రహాలు అన్నీ కలిసి పాలపుంతలో ఒకే నిర్దిష్టమైన కక్ష్యలో సెకనుకు 220 కి.మీ. వేగముతో ప్రయాణం చేస్తున్నాయి  

– సౌర వ్యవస్థ మరియు మిగతా నక్షత్రాలతోకూడిన పాలపుంత మిగతా నక్షత్ర మండలాలమధ్య అంటే ‘విరాగో నక్షత్ర మండలాల గుత్తిలో’ [Virago Cluster] సెకనుకు 600 కి.మీ. వేగముతో ఒక స్థిరమైన కక్ష్యలో ప్రయాణిస్తున్నది   

– విరాగో నక్షత్రమండలాల గుత్తి సెకనుకు 1,600 కి.మీ. వేగముతో ‘లనియాకియ నక్షత్రమండలాలగుత్తుల సమూహం’ [Laniakea Supercluster] మధ్య ఒక స్థిరమైన కక్ష్యలో ప్రయాణం చేస్తున్నది. 

పై వివరాలన్నింటిని పరిగణాలోకి తీసుకుంటే అర్థమయ్యేది సౌర వ్యవస్థ పరిధిలోపల భూమిపై రాత్రింబగళ్ళను ప్రభావితం చేసే కక్ష్య అంటూ ఏది సూర్యునికి లేదు. కాని, సౌర వ్యవస్థ బయట సూర్యునికి సూర్యకుటుంభములోని గ్రహాలు ఉపగ్రహాలన్నింటితో కలిపి మూడు నిర్దుష్టమైన కక్ష్యలున్నాయి. అవి అన్నీకూడా మూడు వేరువేరు కోణాలతోకూడిన సమతలములలో వేరువేరు దూరాలతో  ఏర్పడి వున్నాయి. ఈ సందర్భంగా గమనములో వుంచుకోవాల్సిన అతిప్రాముఖ్యమైన విశయం, సౌర కుటుంభమంతా పాల్గొంటున్న ఈ మూడు కక్ష్యల కదలికలకు భూమిపై సంభవించే వాతావరణ మార్పులకు మరియు రాత్రింబగళ్ళకు ఎలాంటి సంబంధము లేదు.   

సూర్యునికి మాత్రమే ఒకేఒక ప్రత్యేకమైన కక్ష్య వుంది అనటం అశాస్త్రీయం మరియు అసత్యం. 

ఖగోళశాస్త్రము అభివృద్ది చెందక ముందు ఎవరైనా లేక ఏ గ్రంథమైనా సూర్యుడు మూడు లేక అనేక కక్ష్యలలో ప్రయాణిస్తున్నాడు అని ప్రకటించినా లేక భూమి, చంద్రుడు, సూర్యుడు అన్నీ ఒకే కక్ష్యలో ప్రయాణిస్తున్నాయి అని ప్రకటించినా అలాంటి ప్రకటనలు అద్భుతాలుగా మరియు సృష్టికర్త అందించిన పరిజ్ఙానముతోనే తెలియచేయబడిన వాస్తవాలుగా అంగీకరించే అవకాశముంది. 

అలా కాకుండా సూర్యుడు చంద్రుడు తమతమ కక్ష్యలలో తిరుగుతూ ఒకదానివెంట మరొకటి ప్రయాణం చేస్తున్నాయనిగాని లేక ఒకదానిని మరొకటి అందుకోలేకపోతున్నాయనిగాని ప్రకటించటం పామరుల ప్రజ్ఙేగాని శాస్త్రజ్ఙుల పరిజ్ఙానం ఎంతమాత్రము కాదు.  

ఖురాను ప్రకటనలు

“సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తున్నాడు. ఇది సర్వాధిక్యుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్ నిర్ధారించిన విధానం. మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము. తుదకు అది (వాడిపోయిన ఖర్జూరపు) పాత మండలా తయారవుతుంది. చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరంకాదు. పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ (తమ తమ నిర్ధారిత) కక్ష్యల్లో తేలియాడుతున్నాయి.” (ఖురాన్ – సురాహ్.36:38-40) 

“రేయింబవళ్లనూ, సూర్యచంద్రులనూ సృష్టించినవాడు కూడా ఆయనే. వాటిలో ప్రతిదీ తన తన కక్ష్యలో తేలియాడుతూ ఉంది.” (ఖురాన్ – సురాహ్.21:33) 

“సూర్యుని సాక్షిగా! దాని ఎండ సాక్షిగా! (సూర్యుణ్ణి) వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా!” (ఖురాన్ – సురాహ్.91:1-2)

“ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. ఆయన రాత్రిని పగటిపై, పగటిని రాత్రిపై చుట్టివేస్తున్నాడు. సూర్యచంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు. (వాటిలో) ప్రతిదీ నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంది. ఆయనే అపార శక్తి మంతుడు, పాపాలను క్షమించేవాడు అని తెలుసుకోండి!” (ఖురాన్ – సురాహ్.39:5)

దావా ప్రచారకుల అనుసంధానం 

సాధారణ ఖగోళశాస్త్ర పరిజ్ఙానమున్న మీలో ఎవరైనా పైన యివ్వబడిన ఖురాను మాటలను చదివి వాటిలో పాలపుంత [Milky Way] మధ్యలో, అలాగే విరాగొ నక్షత్రమండలాల గుత్తి [Virago Cluster] మధ్యలో, మరియు లనియాకియ నక్షత్రమండలాలగుత్తుల సమూహం [Laniakea Supercluster] మధ్యలో సూర్యుని కక్ష్యలను పేర్కొనబడ్డట్టు చూడగలిగారా…? లేదా…?      

ఒకవేళ మీ అజ్ఙానాన్నిబట్టో లేక సుజ్ఙానాన్నిబట్టో పైన యివ్వబడిన ఖురాను ప్రకటనలలో సూర్యుని కక్ష్యలను మీరు చూడలేకపోతే మీకు సహాయకరంగా అంతే కాకుండా మీకు కనువిప్పును కలిగించే విధంగా దావా ప్రచారకులు యిస్తున్న క్రింది వివరణను మీరు చదివి సత్యాన్ని గ్రహించాల్సిందిగా మిమ్మలను కోరుతున్నాము! 

“సూర్యుడు సౌర వ్యవస్థలో నిశ్చలంగా వున్నాడు, సూర్యునికి ఏకక్ష్యా లేదు అని ఒక శతాబ్ధము క్రితం వరకు ఖగోళ శాస్త్రవేత్తలు నమ్మారు. కాని, అటుతరువాత ఈమధ్యనే ఆధునిక ఖగోళ ఆవిష్కరణలలో భాగంగా తేలినదాని ప్రకారం సౌరకుటుంభములో సూర్యుడు కేంద్రస్థానములోనే ఉన్నా పాలపుంత [Milky Way] అని పిలువబడుతున్న మన నక్షత్రమండలములో [Galaxy] సూర్యుడు కదులుతూ సెకనుకు 220 కి.మీ. వేగముతో ఒక నిర్ధిష్టమైన కక్ష్యలో ప్రయాణం చేస్తున్నది. ఈ సత్యాని ఖురాను ఏడవ శతాబ్ధములోనే అంటే 1200 సంవత్సరాల క్రితమే సురాహ్ 36:38-40, సురాహ్.21:33, సురాహ్.91:1-2, మరియు సురాహ్.39:5 లలో తెలియచేసింది. ఏడవ శతాబ్ధములో అరేబియా ప్రాంతములో పామరునిగా జీవించిన ముహమ్మదు ప్రవక్తకు ఈ సత్యాన్ని సృష్టికర్త తెలియచేస్తేనే తప్ప తనకు తాను తెలుసుకునే అవకాశమే లేదు. కనుక, ఖురానును ముహమ్మదు ప్రవక్తద్వారా మానవాళికి అందించింది స్వయాన సృష్టికర్తే అన్నది నిరూపించబడుతున్నది.” ఇది ఖురాను ప్రకటనలను ఆధునిక ఖగోళ ఆవిష్కరణలతో అనుసంధానం చేసే దావా ప్రచారకుల ప్రయత్నం!

దావా ప్రచారకుల యొక్క పై విశ్లేషణా మరియు విశ్వాస తీర్మాణాలలో వున్న సమస్య సరియైన పరిశోధనా రాహిత్యమే!

ఖురానులోని పై ఆయతులలో సూర్యుడు ఒక నిర్దుష్టమైన కక్ష్యలో పయనిస్తున్నాడు అన్న విశయం చెప్పబడింది.

అయితే, యిక్కడ అలోచించాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్న: ఖురానులో సూచించబడిన సూర్యుని కక్ష్య అన్నది సౌర వ్యవస్థ లోపల ఉన్నదని ఖురాను సూచిస్తున్నదా లేక సౌర వ్యవస్థకు బయట ఉన్నదని ఖురాను సూచిస్తున్నదా?     

పై ప్రశ్నకు జవాబును సంపాదించేందుకు సత్యపరిశోధన ఆవశ్యకం. అందుకు దావా ప్రచారకుల ఊహాగానాలను ప్రక్కకు పెట్టి ఖురానులోని సందర్భాన్ని పదజాలాన్ని పరిశీలించి చూడాలి. 

ఖురానులోని ఆయతుల పరిశీలన # 1

“సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తున్నాడు…చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరంకాదు. పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ (తమ తమ నిర్ధారిత) కక్ష్యల్లో తేలియాడుతున్నాయి.” (ఖురాన్ – సురాహ్.36:38-40)

పై ఆయతులలో గమనించాల్సిన విశయాలు: 

అ) సూర్యునికి ఒక కక్ష్య నిర్ధారించబడింది

ఆ) చంద్రుణికికూడా ఒక కక్ష్య నిర్ధారించబడింది 

ఇ) చంద్రుడు వేగంగా పయనిస్తున్నాడు; సూర్యుడు నెమ్మదిగా పయనిస్తున్నాడు. కనుక, సూర్యుడు చంద్రుణ్ణి అందుకోలేడు. అంటే, సూర్యుడు చంద్రుడు యిద్దరు ఒకే దిశలో పయనిస్తున్నారు కాని సూర్యుడు అందుకోలేని వేగంతో చంద్రుడు పయనిస్తున్నాడు  

ఈ) సూర్యుని కక్ష్య మరియు చంద్రుని కక్ష్య రెండూ పగలు రాత్రులను ప్రభావితం చేస్తున్నాయి

ఖురాను బోధలోని పై వివరాల వెలుగులో సురాహ్ .36:38-40 సూచిస్తున్న సూర్యుని కక్ష్య అన్నది సౌర వ్యవస్థలోనిదే అన్నది సుస్పష్టము.  

ఖురానులోని ఆయతుల పరిశీలన # 2 

“రేయింబవళ్లనూ, సూర్యచంద్రులనూ సృష్టించినవాడు కూడా ఆయనే. వాటిలో ప్రతిదీ తన తన కక్ష్యలో తేలియాడుతూ ఉంది.” (ఖురాన్ – సురాహ్.21:33)

పై ఖురాను ఆయతులో గమనించాల్సిన కొన్ని ముఖ్య అంశాలు:

అ) సూర్యునికి కక్ష్య ఉంది అలాగే చంద్రునికికూడా కక్ష్య ఉంది 

ఆ) సూర్యచంద్రుల యొక్క కక్ష్యల ప్రస్తావన రాత్రింబవళ్ళ ప్రస్తావనతో ముడిపడి వుంది. 

ఇ) సూర్యుని కక్ష్య మరియు చంద్రుని కక్ష్య రాత్రి మరియు పగలును ప్రభావితం చేస్తున్నాయి.

ఖురాను బోధలోని పై వివరాల వెలుగులో సురాహ్.21:33 సూచిస్తున్న సూర్యుని కక్ష్య అన్నది కూడా సౌర వ్యవస్థలోనిదే అన్నది సుస్పష్టము.  

ఖురానులోని ఆయతుల పరిశీలన # 3

“సూర్యుని సాక్షిగా! దాని ఎండ సాక్షిగా! (సూర్యుణ్ణి) వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా!” (ఖురాన్ – సురాహ్.91:1-2)

పై ఖురాను ఆయతులో గమనించాల్సిన అంశాలు:

అ) సూర్యుడు ప్రయాణం చేస్తున్నాడు. చంద్రుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. 

ఆ) చంద్రుడు సూర్యుని వెనుకే ప్రయాణం చేస్తున్నాడు.

ఇ) సూర్యుడు చంద్రుడు రెండు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణిస్తున్నట్లుగా భూమిపై నున్న వారికి కనిపిస్తుంది. 

ఖురాను బోధలోని పై వివరాల వెలుగులో సురాహ్.91:1-2 లో సూచిస్తున్న సూర్యుని ప్రయాణం అన్నది సౌర వ్యవస్థలోనిదే అన్నది సుస్పష్టము.  

ఖురానులోని ఆయతుల పరిశీలన # 4 

“ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. ఆయన రాత్రిని పగటిపై, పగటిని రాత్రిపై చుట్టివేస్తున్నాడు. సూర్యచంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు. (వాటిలో) ప్రతిదీ నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంది. ఆయనే అపార శక్తి మంతుడు, పాపాలను క్షమించేవాడు అని తెలుసుకోండి!” (ఖురాన్ – సురాహ్.39:5)

పై ఖురాను ఆయతులో గమనించాల్సిన ముఖ్య అంశాలు:

అ) ఇక్కడి సందర్భము రాత్రి పగలుల సంభావన. 

ఆ) సూర్యుడు మరియు చంద్రుడు రెండూ సంచరిస్తున్నాయి.

ఇ) సూర్యుడు మరియు చంద్రుడు రాత్రి పగలుల సంభవములో తమ పాత్రను పోశిస్తున్నాయి

ఖురాను బోధలోని పై వివరాల వెలుగులో సురాహ్.39:5 లో సూచిస్తున్న సూర్యుని సంచారం అన్నది సౌర వ్యవస్థలోనిదే అన్నది సుస్పష్టము. 

ఖురాను గ్రంథ రచయిత సూర్యుని కక్ష్యను గురించిన ప్రస్తావన చేశాడు. అయితే అది రాత్రిపగళ్ళ సంభావనతో ముడిపెట్టడాన్నిబట్టి సూర్య చంద్రుల కక్ష్యలు భూమిపై నున్న వ్యక్తుల దృష్టికోణములోనుంచి ప్రతిదినం కనిపించే సూర్య చంద్రుల కదలికలేనన్నది విస్పష్టం. ఈ కక్ష్యలు సౌర వ్యవస్థకు వెలుపలనున్న కక్ష్యలు కావు.

పై వివరాల వెలుగులో ఖురాను పేర్కొంటున్న సూర్యుని కక్ష్య అన్నది ప్రతి దినం భూమిపై నున్న మనుషులకు సుర్యోదయం  మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆకాశములో సూర్యుడు తూర్పునుండి పడమటకు పయనిస్తున్నట్లుగా కనబడే విధానం. అంతేగాని సౌర వ్యవస్థకు బయట వున్నట్లుగా యిప్పటివరకు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన మూడు విశ్వాంతరాలలోని కక్ష్యలు కావు! 

ఒకవేళ, చింత చచ్చినా పులుపు చావదన్న పంథాలో దావా ప్రచారకులు ఇంకా తమ అజ్ఙానాన్ని వితండవాదాలతో తమబోటి వారిని నమ్మించే ప్రయత్నంగా ఖురానులోని సూర్యుని కక్ష్య సౌర వ్యవస్థకు బయటి కక్ష్య అంటూ వాదిస్తే వారు క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పాలి…

అ) సౌర వ్యవస్థలో మూడు కక్ష్యలుండగా ఖురాను ఒక కక్ష్యనే గుర్తించగలిగింది. మరి, ఖురాను పరిజ్ఙానం మిగతా రెండు కక్ష్యలకు సరిపోలేదని ఒప్పుకుంటారా…?! 

ఆ) ఖురాను రచయిత యొక్క ఖగోళ జ్ఙానం సౌర వ్యవస్థకు బయట సూర్యచంద్రులకున్న మూడు కక్ష్యలలో కేవలం ఒక కక్ష్యను మాత్రమే గుర్తించగలిగింది గాని భూమికున్న నాలుగు కక్ష్యలలో [ఒకటి సౌర వ్యవస్థలో, మూడు సౌర వ్యవస్థ బయట] ఒక్క దానిని కూడా గుర్తించలేక పోయింది ఎందుకని? 

ఇ) ఒకవేళ ఖురాను పేర్కొంటున్న సూర్యుని కక్ష్య సౌర వ్యవస్థకు బయటిదైతే, ఆ కక్ష్య భూమిని, భూవాతావరణాన్ని, లేక రాత్రి పగలులను ఏవిధంగాను ప్రభావితం చేయజాలదు. మరి దాన్ని పేర్కొనటములోని ఉద్దేశమేమిటి…?