ఖుర్’ఆన్ చరిత్ర

ఖుర్’ఆన్ చరిత్ర

July 7, 2020 ఇస్లాం ఖుర్'ఆన్ గ్రంథం విశ్వాసాలు 0

ముస్లీముల ధార్మిక గ్రంథం

ఖుర్’ఆన్ ముస్లీంల ధార్మిక గ్రంథం. ముస్లీముల విశ్వాసమైన ఇస్లాము మతానికున్న రెండు మూలస్తంభాలలో మొదటిది ఖురాన్ [القرآن/అల్-ఖుర్’ఆన్]. రెండవ మూలస్తంభం, హదీసులు [أحاديث/అహదిత్ = సాంప్రదాయాలు; ఇతిహాసాలు; నివేదికలు; వ్యాఖ్యానాలు]. 

ఖురాను వాక్యాలు ఏడవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడగా, వాటి సందర్భాలు, చరిత్ర, మరియు వ్యాఖ్యానాలతో కూడిన హదీసులు తొమ్మిదవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడ్డాయి. 

ఈ వ్యాసములో ప్రధానంగా ఖురాను యొక్క చరిత్ర వివరాలు ఇస్లామీయ గ్రంథాల ఆధారంగా మీముందుంచబడుతున్నాయి.

ఖురాన్ గ్రంథాన్ని గురించి ముస్లీములకున్న నమ్మకాలు: 

1. ఖురాను గ్రంథము అల్లాహ్ యొక్క మాటలు/ప్రసంగం. ఈ గ్రంథము సృష్టించబడని గ్రంథం. ఇది అల్లాహ్ సమక్షములోని ఒక పలకపై లిఖించబడి ఉంది.    

2. ఖురాను గ్రంథము జిబ్రాయిల్ అనే దూతద్వారా ప్రవక్త అయిన ముహమ్మదుకు 610 క్రీ.శ. – 632 క్రీ.శ. వరకుగల కాలవ్యవధిలో అందించబడింది.  

3. జిబ్రాయిల్ దూతద్వారా ముహమ్మదు ప్రవక్తకు అందించబడిన అల్లాహ్ మాటలు అన్నీ ఈనాడు ముస్లీములు చదివే ఖురాను గ్రంథముగా భద్రపరచబడి ఉన్నాయి.  

4. ఖురాను గ్రంథములోని మాటలు ముహమ్మదు ప్రవక్త కాలము మొదలుకొని యిప్పటివరకు అంటే దాదాపు 1400 సంవత్సరాల వ్యవధిలో వాక్యాలలోగాని, పదాలలోగాని లేక అక్షరాలలోగాని ఏమార్పూ లేకుండా భద్రపరచబడ్డాయి.  

5. ఖురాను గ్రంథము అల్లాహ్ [దేవుని] యొక్క అద్భుతము. 

ఖురాన్ గ్రంథ పరిచయము

అరబ్బీ భాషలోని ఖురానులో 114 అధ్యాయాలున్నాయి. వీటినే సురాలు అని పేర్కొంటారు. ప్రతి అధ్యాయానికి ఓ పేరు ఉంటుంది. ప్రతి అధ్యాయములో అనేక వాక్యాలుంటాయి. వాక్యాలను ఆయలుగా పేర్కొంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఖురాను గ్రంథం దాదాపుగా 200 భాషలలోకి అనువదించబడింది అన్నది కొందరి అంచనా.

ఖురానులోని మొత్తం వాక్యాల సంఖ్య 6236. అయితే, పదాలు అక్షరాల విశయములో మాత్రం ముస్లీంల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. మొత్తం పదాల సంఖ్య ప్రపంచములోని వివిధ ప్రాంతాలలోని ఖురానులలో వేరువేరుగ ఉన్నట్లు ముస్లీంలు గుర్తించారు. ఉదాహరణకు, వివిధ ప్రాంతాలలోని ఖురానులలోని మొత్తం పదాల సంఖ్యను లెక్కించగా తేలిన వివిధ సంఖ్యలు 77,439; 77,430; 77,797; 1,57,935. తెలుగు ముస్లీం వక్త మరియు దావా ప్రచారకుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్, PMF, గారి లెక్క ప్రకారం 86,430.

అదేవిధంగా, ఖురానులోని అక్షరాల సంఖ్య విశయములోకూడా తేడాలున్నాయి. ఆ సంఖ్య వేరువేరు ప్రాంతాలలోని ఖురానులను లెక్కించగా వాటిలోని అక్షరాల సంఖ్య వేరువేరుగా తేలింది–3,20,015; 3,32,837; 3,30,709; 6,68,684. సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఉపయోగించే ఖురానులో 3,23,760.

పై తేడాలు సూచిస్తున్న అతిప్రాముఖ్యమైన సత్యమేమిటి…?

ఖురాన్ లోని అధ్యాయాల సంఖ్య [114] విశయములో అలాగే ఖురానులోని వాక్యాల సంఖ్య [6236] విశయములో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఖురాన్ లు ఒకే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. కాని, వాటి పదాల సంఖ్యలో అలాగే అక్షరాల సంఖ్యలో తేడాలున్నాయి. అందుకుగల కారణం ప్రపంచములోని అన్ని ఖురాన్ లు ఒకే విధమైన పదాలను మరియు అక్షరాలను ఉపయోగించలేదు. ముస్లీంలు ముఖ్యంగా దావా ప్రచరకులు ప్రకటిస్తున్న విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఖురాన్ లేదు అన్న సత్యానికి యిది తిరుగులేని సాక్ష్యం! వారు చెప్పేది మతపరమైన డంభమే గాక అది అమాయకులను అజ్ఙానులను మోసపరచే ఒక అసత్య ప్రేలాపణ అన్నది విస్పష్టమవుతున్నది.

గత 1400 సంవత్సరాలలో అనేక రకాల ఖురానులను [ఖీరా’అత్ లను] ముస్లీము విధ్వాంసులు వాడుకలోకి తెచ్చారు. ప్రారంభములో ఏడు, తరువాత పది, ఆ తరువాత ముప్ఫైకి పైగా ఖీరా’ఆత్ లు వాడుకలోకి వచ్చాయి. అవి అనువాదాలు కావు, మూలభాష అయిన అరబ్బీ భాషలో ప్రామాణికంగా లెక్కించబడినవి. ఈ విశయములో ఖురాను చరిత్రను అధ్యయనం చేసి తాము తెలుసుకున్న వివరాలను ఆధారాలతో సవివరంగా అందరిముందు వ్యాసాలుగా మరియు వీడియోలుగా [వీడియో-1, వీడియో-2, వీడియో-3] కూడా ఉంచినవారు అనేకులు. వీటిమధ్య ఉన్న తేడాలు వేలసంఖ్యలో ఉన్నాయి.

తేడాల విశయములో ముస్లీము పండితులుకూడా ఈమధ్యే ఒకవైపు ఈనాడు ప్రపంచములోని వివిధ ప్రాంతాలలో ఉపయోగించబడుతున్న ఖురానులలో భేదాలు ఉన్నాయన్న సత్యాన్ని ఒప్పుకుంటూనే మరోవైపు ఖురాను సందేశములో మాత్రం పెద్ద మార్పులు లేవు అంటూ సమర్ధించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఖురానులు వాడుకలో ఉన్నా వాటిలో ప్రధానమైనవి హఫ్స్ [Hafs] మరియు వార్ష్ [Warsh] ఖురానులు. ఈ రెండు రకాల ఖురానులలో ఉన్న పదాలు మరియు అక్షరాలమధ్య తేడాలు వందలలో ఉన్నాయి. వివిధ ఖురానుల మధ్య భేదాలు మరియు వాటి ఉనికికిగల కారణాలను గురించి కొందరు ముస్లీం పండితులు వివరింగా తెలియచేసారు.

ప్రపంచములోని అధిక శాతం ముస్లీముల యొద్ద హఫ్స్ అనే ఖురానులుండగా ప్రధానంగా ఉత్తర ఆఫ్రికాలోని ముస్లీముల యొద్ద వార్ష్ అనే ఖురానులుంటాయి. ఈ రెండు రకాల ఖురానుల మధ్య ఉన్న కొన్ని పదాల వ్యత్యాసాన్ని వివరాలతో Muslimprophets.com అనే ఒక ముస్లీము వెబ్సైటే ప్రచురించింది. ముస్లీము పండితుడు లైథ్ అల్-షైభాన్ యొక్క లోతైన పరిశోధనలో హఫ్స్ మరియు వార్ష్ ఖురానుల మధ్య తేలిన తేడాల వివరాలు free-minds.org లో సవివరంగా ప్రచురించబడ్డాయి.

ఇస్లాము ప్రవక్త ముహమ్మదుగారి ద్వారా యివ్వబడిన ఖురాను మొత్తం అరబ్బీ భాషలో యివ్వబడింది. ఖురాన్ యొక్క ఇతర భాషానువాదాలను సాధారణంగా ముస్లీములు కేవలము ఖురాను భావామృతము గా మాత్రమే పరిగణిస్తారు.

114 అధ్యాయాలలోని [సురాహ్ లలోని] 83 లేక 85 అధ్యాయాలు మక్కా అనే నగరప్రాంతములో యివ్వబడగా 31 లేక 29 అధ్యాయాలు మదీనా అన్న నగరప్రాంతములో యివ్వబడ్డాయి.

మక్కాలో యివ్వబడిన సురాలకన్నా మదీనాలో యివ్వబడిన సురాల నిడివి ఎక్కువ. ఈనాడు ముస్లీములు ఉపయోగిస్తున్న ఖురానులో మదీనాలో యివ్వబడిన సురాలు ప్రారంభములో కూర్చబడి వుండగా మక్కాలో యివ్వబడిన సురాలు చివరిభాగములో పొందుపర్చబడి వున్నాయి.

ఖురాను గ్రంథములోని వచనాలలో [ఆయతులు] అలాగే అధ్యాయాలలో [సురాహ్ లు] వ్రాయబడిన వివరాలు అవి ముహమ్మదుగారికి తెలియచేయబడిన కాలక్రమానుసారంగా [chronologically] పొందుపరచబడలేదు. 

ఖురానులోని ఆ యా వచనాలు ఇస్లాము ప్రవక్త ముహమ్మదుగారి జీవితములో ఆ యా సందర్భాలలో తెలియపరచబడ్డాయి. అయినా, వచనాల సందర్భాల వివరాలు మాత్రం ఖురానులో లేవు. ఖురాను వాక్యాల సందర్భాల వివరాలు హదీసులలో పేర్కొనబడ్డాయి. అయితే, ఈ వివరాలతో కూడిన హదీసులు ఖురాను యివ్వబడి దాదాపు 200 సంవత్సరాలు గడిచిన తరువాత వ్రాయబడినవి అన్నది గమనార్హం.  

ఖురానులో గ్రంథస్తము చేయబడిన అంశాలమధ్య అర్థవంతమైన పరివర్తన [transition] అంటూ కనిపించదు. అంటే, ఒక అంశములోనుండి మరో అంశములోకి జరిగే ప్రవేశము వెనువెంటనే జరుగుతు అర్ధాంతరంగా వుంటుంది. ఈ సాహిత్య అతిక్రమణాలన్నీ మూల భాషలోకూడా హర్షింపదగనివే.     

పై కారణాలనుబట్టి, ఈ గ్రంథాన్ని ముఖ్యంగా అనువాదాలను చదివే ముస్లీమేతరులకు ఈ గ్రంథము సాహిత్య మేథో సామర్థ్యము లేని వ్యక్తి వ్రాసిన విధంగా అగుపిస్తుంది. అయినా, ఈ గ్రంథము వ్రాయబడిన మూలభాష అయిన అరాబిక్ భాషలో ఖురాను పదాల కూర్పు ప్రావీణ్యతగల కవి యొక్క కలమునుండి జాలువారిన పధ్యప్రవాహములా వుంటుంది అన్నది కేవలం ముస్లీములేగాక అరాబిక్ భాషను మాతృభాషగా కలిగివున్న ముస్లీమేతరులుకూడా గుర్తించిన విషయం. 

ఖురాన్ చరిత్ర

610 క్రీ.శ. – 632 క్రీ.శ. 

ఖురాను వాక్యాలు ముహమ్మదు గారికి 610 క్రీ.శ. నుండి 632 క్రీ.శ. వరకు జిబ్రాయిల్ అనే దూతద్వారా వివిధ సమయాలలో ఆయా సందర్భాలలో అందజేయబడ్డాయి అంటూ ఇస్లామీయ గ్రంథాలు తెలియచేస్తున్నాయి.

ఖురాను వాక్యాలను ముహమ్మదుగారు వల్లె వేసే సమయములో ఆయన అనుచరులు విని వాటిని తమకు లభించిన లేక అందుబాటులో ఉండిన వస్తువులపై అంటే ఖర్జూరపు మట్టలు, ఎముకలు, చెట్టు బెరడులు, తెల్లని రాళ్ళు, జంతు చర్మాలు మొదలైన వాటిపై వ్రాసి భద్రపరుస్తూ వచ్చారు.  అదే సమయములో ముహమ్మదు అనుచరులలోని నలుగురు వ్యక్తులు ఖురాను వాక్య భాగాలలోని అధిక భాగం కంఠస్థం చేసినట్లు కూడ ఇస్లామీయ గ్రంథాలను బట్టి తెలుస్తుంది.

ఈ విధంగా ముహమ్మదు నోటినుండి జాలువారిన ఖురాను వాక్యాలు వ్రాయబడిన వ్రాతప్రతులు ముహమ్మదుగారి వివిధ అనుచరుల నివాసాలలో భద్రం చేయబడ్డాయి. ముహమ్మదు యొక్క సమకాలీనులైన ప్రారంభ ముస్లీముల నివాసాలలో భద్రం చేయబడిన ఆ వ్రాతప్రతులే ప్రప్రథమ ఖురాను గ్రంథముగా పేర్కొనవచ్చు. అదే మూల లేక అసలు [original] ఖురాను గ్రంథము. దీన్నే ముహమ్మదుగారు స్వయంగా చూసి ఆమోదించగలిగిన ఖురాను గ్రంథము. 

అయితే, ఆ ప్రప్రథమ ఖురాను గ్రంథము వ్రాయబడిన ప్రతులు లేక వస్తువులలో ఏవీ ఈనాడు ఉనికిలో లేవు. 

632 క్రీ.శ. – 634 క్రీ.శ.

632 క్రీ.శ.లో ముహమ్మదుగారు మరణించిన వెంటనే ఆయన అనుచరవర్గములో ఆయనకు అత్యంత సమీప స్నేహితుడు మరియు బిడ్డనిచ్చిన మామ అయిన అబు బాకర్ అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉథ్’మాన్ [Abu Bakr abdullah ibn Uthman] ముస్లీము సమాజానికి మొదటి నాయకునిగా అంటే మొదటి ఖలీఫ్ గా ఎన్నుకోబడ్డాడు. 

అబు బాకర్ నాయకత్వము క్రింద జయిద్ ఇబ్న్ తబీథ్ [Zaid ibn Tabith] పర్యవేక్షణలో చెల్లాచెదురుగా ఉండిన ఖురాను వాక్యాలు సమీకరించబడి ఒక గ్రంథ సంపుటిగా ఎత్తి వ్రాయబడ్డాయి. ఇది రెండవ ఖురాను గ్రంథము. దీన్నే అబు బాకర్ ముస్’హాఫ్ [Mus’haf = ప్రాచీన రాతప్రతి] అని పేర్కొంటారు. ఈ ముస్’హాఫ్ అబు బాకర్ 634 క్రీ.శ.లో మరణించేంతవరకు ఆయన వద్దే ఉండింది. 

634 క్రీ.శ. – 644 క్రీ.శ.

అబు బాకర్ మరణానంతరము ఆయన వద్ద ఉండిన అబు బాకర్ ముస్’హాఫ్ [రెండవ ఖురాన్ వ్రాతప్రతి] ముస్లీము సమాజానికి ఖలీఫ్ గా ఎన్నుకోబడిన ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ [Umar/Omar ibn a’-Khattab] సంరక్షణ క్రిందికి వచ్చింది.  ఉమర్ తన మరణానికి ముందే ముహమ్మదుకు భార్యగా ఉండిన తన కుమార్తె హఫ్సా బింత్ ఉమర్ [Hafsa bint Umar] కు అబు బాకర్ ముస్’హాఫ్ ను అందించి ఆమె సంరక్షణలోకి దాన్ని చేర్చాడు.

644 క్రీ.శ. – 656 క్రీ.శ.

644 క్రీ.శ.లో ఖలీఫ్ ఉమర్ మరణించటముతో ఉథ్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ [Uthman ibn Affan] అదే సంవత్సరము ముస్లీము సమాజానికి ముహమ్మదు తదుపరి మూడవ నాయకునిగా బాధ్యతను చేపట్టాడు. ఉథ్మాన్ పాలనలో ఖురానును వల్లెవేస్తున్న వారిమధ్య భేదాలున్నట్లు తెలియవచ్చింది. అదే సమయములో ఖురాన్ యొక్క వాక్యభాగాల వ్రాత ప్రతులు అలాగే పూర్తి గ్రంథాల వ్రాతప్రతులు కూడా ముస్లీము సమాజములోని అనేక వ్యక్తుల ఆదీనములో వారి వ్యక్తిగత గ్రంథాలుగా ఉండటం ఖలీఫ్ దృష్టికి వచ్చింది.     

ఖురాన్ చరిత్ర వెలుగులో ముస్లీముల నమ్మకాల విశ్లేషణ

…to be continued –>

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *