దేవుడు అద్వితీయుడు
సమస్తాన్ని సృష్టించి పోషించి పాలిస్తున్న సృష్టికర్త ఒక్కడు లేక అద్వితీయుడు. ‘దేవుడు ఒక్కడు’ అన్న సత్యం సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో పదహారుసార్లు విస్పష్టంగా పేర్కొనబడింది.*
“దేవుడు ఒక్కడు” [God is one] అన్న పదజాలములోని ‘ఒక్కడు/ఒక్కటి ‘ [one] అన్నది గణితశాస్త్రపరమైన గుర్తు లేక అంఖ్య లేక పరిధి కాదు. గణితశాస్త్ర పరిధులు సృష్టికే అన్వయించతగును, సృష్టికర్తకు కాదు.
రాయి ఒక్కటి, చెట్టు ఒక్కటి, చీమ ఒక్కటి, పంది ఒక్కటి, కుక్క ఒక్కటి, మనిషి ఒక్కడు. సృష్టికర్త ఒక్కడు [దేవుడు ఒక్కడు లేక అల్లాహ్ ఒక్కడు]. ఇక్కడ ఒక్కడు/ఒక్కటి అని చెప్పబడిన అందరిని ఒకేగాటికి కట్టకూడదు. ఒక్కడు/ఒక్కటి అన్నది సృష్టికి గణితశాస్త్ర పరిభాషలో అన్వయించబడగా, సృష్టికర్తకు మాత్రం గణితశాస్త్ర పరిభాషలో అన్వయించబడలేదు. కనుక ఈ విశయములో సృష్టి మరియు సృష్టికర్త ఒకే విభాగానికి చేందినవారు కాదు. దేవుడు సృష్టికి అన్వయించే శాస్త్రాలకు ప్రమాణాలకు అతీతుడు!
దేవుని అంతర్గత వాస్తవాలకు అలాగే ఆయన బహిర్గత ప్రత్యక్షతలకు గణితశాస్త్ర గురుతులను మరియు సూత్రాలను అన్వయించకూడదు. ఉదాహరణకు, దేవుడు రెండు వేరువేరు స్థలాలలో ఒకేసారి ఉనికిని కలిగి ఉండగలడు. అయితే, ఆ రెండు స్థలాలలోని దేవుని ఉనికికి 1, 1, అంటూ గణితశాస్త్ర గురుతులను ఆపాదించకూడదు అలాగే 1+1=2 అనే గణితశాస్త్ర సూత్రాన్ని అన్వయించకూడదు.
ఆ కారణాన్నిబట్టి సృష్టికర్త ఒక్కడు లేక అద్వితీయుడు అంటే, ఆయనలాంటివాడు ఆయనను పోలినవాడు ఆయనకు సాటిగా, పోటిగా, ధీటుగా వేరొక దేవుడు లేడు అని భావం! ఈ సందర్భంగా సృష్టికర్త అయిన దేవుడే చేసిన ప్రకటనలు ఎంతో ప్రాముఖ్యమైనవి:
“నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవతయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.” (యెషయా.43:11-12)
“నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.” (యెషయా.45:5)
సృష్టించబడినవి విభజన లేక కూడిక అనే ప్రక్రియలకు లోబడుతాయి. అంతేగాక, సృష్టించబడినవి మానవ మేధస్సుకు అర్థమయ్యే మూసలలో యిమడగలవు. అయితే, సృష్టికర్త వీటికి అతీతుడు. లెక్కలలో, ముక్కలలో, లేక మూసలలో పట్టే దేవుడు నిజమైన దేవుడు కాదు.
సృష్టించబడిన వాటి అస్తిత్వానికి పరిధులున్నాయి. అంటే, సృష్టించబడినదాని ఉనికి ఒక సమయములో ఒకే స్థలానికి పరిమితమై ఉంటుంది. కాని, సృష్టికర్తకు ఈ పరిధి వర్తించదు. ఒకే సమయములో సృష్టికర్త ఒకటికన్నా ఎక్కువ స్థలాలలో ఉనికిని కలిగి ఉండగలడు. అలా ఉండలేనివాడు నిజదేవుడు కాదు.
ఒక మానవునికి ఒకే దేహం, ఒకే ప్రాణం, ఒకే ఆత్మ, ఒకే వ్యక్తి-తత్వం అన్నది సృష్టమైయున్న మానవుని పరిధి. ఆ కారణాన్నిబట్టి ప్రతి నరుడు అంతర్గతంగా ఏకాకి లేక ఒంటరివాడు. అయితే, దేవుడుకూడా అంతర్గతంగా మానవులలా ఒంటరివాడు/ఏకాకి కాడు. ఒంటరితనం లేక ఏకాకితత్వం అన్నది గొప్పతనం కాదు, బలహీనత. దేవుడు బలహీనతలు లేనివాడు. కనుక, సృష్టికర్తకు గణితశాస్త్రపరమైన పరిధి మరియు అస్తిత్వపరమైన బలహీనత అన్నవి లేవు. ఆయన వాటికి అతీతుడు.
“దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపర చెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.” (రోమా.1:19-20)
సృష్టికర్తను గురించిన సంపూర్ణ అవగాహన పరిజ్ఙానం మానవ మేధస్సుకు అతీతమైనది. మానవుల వివేచనజ్ఙానం దేవుని ఉనికిని గుర్తించగలిగినా అది ఆయన అస్తిత్వాన్ని గూర్చిన సరియైన అవగాహనను అందించేందుకు చాలింది కాదు. ఈ విశయములో దేవుడే మానవులకు తన ప్రత్యక్షతద్వారా తననుగుర్చిన సరియైన అవగాననను కలిగించేందుకు సహాయపడాలి.
ఆ కారణాన్నిబట్టి సృష్టికర్త అయిన దేవుడు తాను ఎన్నుకున్న నిజప్రవక్తల పరంపరద్వారా మానవాళికి తననుగుర్చిన ప్రత్యక్షత మానవపరిభాషలో సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలుగా అందించాడు.
అద్వితీయుడైన సృష్టికర్త బైబిలుద్వారా తన యొక్క అంతర్గత వాస్తవాన్ని లేక ఉనికి తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మగా విశదపరచాడు. అయితే, బైబిలులో సృష్టికర్త తానే ప్రకటిస్తున్న తన అంతర్గత వాస్తవానికి సంబంధించిన వివరాలు అందరికి ఇట్టే అవగతం కాకపోవచ్చు. కాబట్టే, ఈ విశయములో సరియైన అవగాహన పొందేందుకు దేవుని ఆత్మ సహాయాన్ని ఆపేక్షించాలి.
“ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” (1కొరింథీ.2:14)
సృష్టముయొక్క [భౌతికమైనవి మరియు అభౌతికమైనవి; మనుషులు లేక దేవదూతలు] దృష్టిసామర్థ్యానికి సృష్టికర్త అతీతుడు గనుక సృష్టికి దేవుడు అగోచరుడు. అందుకే లేఖనము సెలవిస్తున్నది:
“శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. ” (1తిమోతి.6:15-16)
సృష్టముతో సంభాషించుట, సృష్టమునకు కనపడుట, అలాగే సృష్టముతో సహవసించుట అన్నవాటికి దేవుడు అతీతుడు. అయినా, ఆయన సర్వశక్తిమంతుడు గనుక తన సార్వభౌమత్వముచేత తన చిత్తప్రకారము తన అస్తిత్వములో ఏమార్పూచేర్పూ లేకుండానే వాటిని సాధించగలడు, సాధించాడు. అది కేవలం నిజదేవునికి మాత్రమే సాధ్యమయ్యే ప్రక్రియ. ఆ వివరాలు సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో విశదీకరించబడ్డాయి. [ఆది.కాం.18:1-19:29; ని.కాం.3:1-15; జెకర్యా.2:8-13; మలాకి.3:1-3; యోహాను.1:1-18; ఫిలిప్పీ.2:5-11; 1తిమోతి.3:16; హెబ్రీ.1:1-14]
ఆత్మీయ జీవులు/వ్యక్తులు లేక దేవదూతలు మనుషులకు అగోచరులు. అయినా, వారు తమ కివ్వబడిన శక్తిసామర్థ్యాలను బట్టి మానవులు చూడగలిగే ఆకారములో ప్రత్యక్షము కాగలరు. దేవుని సృష్టిలో భాగమైన దేవదూతలకే ఆ సామర్థ్యముంటే వారిని సృష్టించిన దేవునికి ఆ సామర్థ్యము లేదనటము అతర్కము అవిశ్వాసము అజ్ఙానము!
[*ద్వి.కాం.6:4; మలాకి.2:10; మార్కు.12:29; యోహాను.5:44, 17:3; రోమా.3:30, 16:27; 1కొరింథీ.8:4, 6:6; గలతీ.3:20; ఎఫెసి.4:4-6; 1తిమోతి.1:17, 2:5, 6:16; యాకోబు.2:19; యూదా.1:25]