క్షమాపణ: యేసుకు ముందు & తరువాత?
క్షమాపణ
దేవుడు సార్వభౌముడు మరియు సర్వశక్తిమంతుడు. ఆయన తాను కోరుకుంటే ఏ మానవుని పాపాలనైనా అలవోకగా క్షమించి మోక్షాన్ని ప్రసాధించటానికి ఆయనకు అడ్డేమైన ఉందా…?
ఉంది!
అది దేవుని న్యాయతత్వం. దేవుడు తన స్వభావ లక్షణాలకు వ్యతిరేకంగా ఏమీ చేయడు, చేయజాలడు. న్యాయం మరియు నీతి అన్నవి దేవుని నైతిక స్వభావాలు.
పాపం లేక అన్యాయం చేసిన మానవులను దేవుడు తన న్యాయ తత్వానికి వేరుగా లేక వ్యతిరేకంగా క్షమించడు. దేవుని న్యాయ తత్వాన్ని తృప్తిపరచకుండా పాపులను క్షమించి పాపాన్ని తొలగించటం అసంభవం. అది దైవ విరుద్ధం, తర్క విరుద్ధం!
మానవుల పాపాలకు న్యాయబద్ధంగా తగిన వెల చెల్లించబడితేనేగాని సార్వభౌముడైన దేవుడు వారి పాపాలకు క్షమాపణ అనుగ్రహించడు.
ఏనరుడు తన పాపాలకు తగిన వెలను తానే చెల్లించే స్థితిలో లేడు. అందుచేత దేవుడు తన ప్రేమా తత్వాన్నిబట్టి నరుల పాపాలను క్షమించేందుకు వీలుగా వాటికి న్యాయబద్దమైన వెలను తానే చెల్లించి నరులకు క్షమాపణా మార్గాన్ని సుగమం చేసాడు.
సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్ ప్రకటన ప్రకారం మానవుల పాపక్షమాపణ నిమిత్తమైన ఆ బృహత్కార్యం సృష్టి ప్రారంభము నుండే దేవుని ప్రణాళికలో పొందుపరచబడి ఉంది.
అయితే, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని వాక్కు శరీరధారియై తననుతాను రిక్తునిగా చేసుకొని యేసు క్రీస్తు అనబడిన పరిపూర్ణ మానవునిగా, ఇశ్రాయేలీయులకు వాగ్ధానం చేయబడిన ప్రవక్తగా, మరియు మానవులందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే రక్షకునిగా అవతరించాడు.
యేసు క్రీస్తు నందు దేవుడు మానవులందరి పాపాలకు న్యాయబద్ధమైన వెలను చెల్లించే కార్యాన్ని తానే నిర్వర్తించాడు. అదే యేసు క్రీస్తు యొక్క శ్రమలు మరియు సిలువ మరణం.
మానవులందరి పాపాలకు ప్రాయశ్చిత్తానికి ఏకైక మార్గం సృష్టికర్త తానే విరచించి నిర్వర్థించిన యేసుక్రీస్తు యొక్క సిలువ యాగం. దానికి వేరుగా పాపక్షమాపణకు మార్గం లేదు!
క్షమాపణ-విశ్వాసం
దేవునియందున్న నిజవిశ్వాసమే పాపులైన మానవులు క్షమాపణను పొంది నీతిమంతులయ్యేందుకుండాల్సిన అర్హత. ఇక్కడ విశ్వాసం అంటే దేవుడున్నాడని నమ్మటమో లేక దేవుడు ఒక్కడని నమ్మటమో కాదు. దేవుడున్నాడని ఆయన ఒక్కడేనని సాతానుడు మరియు దయ్యాలుకూడా నమ్ముతాయి. అయినా, ఆ నమ్మకాన్నిబట్టి అవి క్షమాపణనుగాని లేక మోక్షాన్నిగాని పొందలేవు. నిజవిశ్వాసం అన్నది దేవుడున్నాడని ఆయన ఒక్కడే అని నమ్మటమేగాక అద్వితీయుడైన దేవుని మాటలను లేక సందేశాన్ని సంశయించక స్వీకరించటమే నిజవిశ్వాసం.
యేసుకు ముందు మరియు యేసుకు తరువాత, దైవ క్షమాపణా విధానం ఒక్కటే! అది, దేవుని సందేశమందు నిజవిశ్వాసాన్ని ఉంచటం.
దుర్బోధలు
ఈ దైవక్షమాపణా ప్రణాళికకు బద్ధ వ్యతిరేకి సాతానుడు. వాని కుతంత్రాలలో కొన్ని క్రింద యివ్వబడిన మోసపూరితమైన బోధలు:
- “దేవుడు లేడు” అంటూ చేయబడుతున్న దుశ్ ప్రచారం
- “దేవుడు అద్వితీయుడు కాదు” లేక “దేవుళ్ళు అనేకమంది” అనే అసత్య ప్రకటన
- “దైవ గ్రంథాలు/సందేశాలు నాశనం చేయబడ్డాయి లేక కలిపి చెరపబడ్డాయి లేక మార్చబడ్డాయి” అన్న దుర్బోధ
యేసుకు ముందు
యేసు క్రీస్తుకు ముందు జీవించిన భక్తులు నిజవిశ్వాసాన్ని బట్టే క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే వారు దేవుని సందేశాన్ని నమ్మి దానికి దాసోహమన్నారు. అందుకు, విశ్వాసులకు తండ్రియైన అబ్రహామే స్పష్టమైన నిదర్శనం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను (ఆదికాండము 15:1-6).
ఈ సందర్భములో, అబ్రహాము ‘దేవుడున్నాడని నమ్మాడు’ అని కాదు. అలాగే, అబ్రహాము ‘దేవుడు ఒక్కడు’ అంటూ నమ్మాడని కూడా కాదు యిక్కడ దాని భావం. దేవుడున్నాడు, ఆయన అద్వితీయుడు అన్నది మాత్రమేగాక ఆ దేవుడు తెలియచేసిన మాటలను అబ్రహాము విశ్వసించాడు అన్నది ఈ వాక్యము తెలియచేస్తున్న సత్యం.
యేసుకు తరువాత
ఈనాడు అంటే యేసు క్రీస్తు తరువాత దేవుని చేరేవారు తమ స్వంత భక్తినిబట్టి లేక స్వంత నీతినిబట్టి కాదుగాని, దేవుని సందేశాన్ని అచంచల విశ్వాసంతో స్వీకరించటాన్ని బట్టే క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు.
యేసుకు ముందున్న మానవులు వారికాలంలో నిజప్రవక్తలు/అపోస్తలుల ద్వారా యివ్వబడిన లేఖనాలను అంటే పాతనిబంధన సందేశాలను ‘విశ్వసించటం ద్వారా’ క్షమించబడి, నీతిమంతులుగా తీర్చబడి, మోక్షాన్ని పొందగలిగారు. అదేవిధంగా, యేసు తరువాతి మానవులు నిజప్రవక్తలు/అపోస్తలుల ద్వారా యివ్వబడిన లేఖనాలను అంటే క్రొత్తనిబంధన సందేశాలను ‘విశ్వసించటం ద్వారా’ క్షమించబడి, నీతిమంతులుగా తీర్చబడి, మోక్షాన్ని పొందగలుగుతున్నారు.
మానవుల పాపాలకు క్షమాపణను అనుగ్రహించి వారికి నీతిని ఆపాదించేందుకు క్రీస్తు తరువాత ప్రకటించబడిన దైవసందేశ సారాంశం:
“దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.” (1తిమోతి.2:5-6)
గమనిక: మీ పాపాల విశయములో మీకు నిజమైన పశ్చాతాపం మారుమనస్సు కలుగకపోతే దేవుని సందేశమందు నిజవిశ్వాసాన్ని వ్యక్తపరచటం అసాధ్యం!
6 Responses
అవతరించాడు అనే మాటకు విరణ అవసరము వుంది, దేవుడే యేసుగా అవతిరించాడని మీ ఉద్యేశమా?
బ్రదర్ అమ్రోస్ పాల్ గారికి శుభములు!
పై వ్యాసాన్ని ఉద్దేశించి ప్రశ్న అడిగినందుకు మీకు మా ధన్యవాదాలు.
మీ ప్రశ్న: అవతరించాడు అనే మాటకు విరణ అవసరము వుంది, దేవుడే యేసుగా అవతరించాడని మీ ఉద్యేశమా?
మా వివరణ:
‘దేవుని వాక్కు’ శరీరాన్ని ధరించి యేసు క్రీస్తుగా ఈ లోకములో జన్మించాడు. [యోహాను.1:1,14]
‘దేవుని వాక్కు’ శరీరాన్ని ధరించి యేసు క్రీస్తుగా ఈ లోకములో జన్మించక ముందు దేవునితో లేక దేవునిలో ఉన్నాడు. [యోహాను.1:1; 3:13; 8:58; 16:28]
‘దేవుని వాక్కు’ శరీరాన్ని ధరించి యేసు క్రీస్తుగా ఈ లోకములో జన్మించక ముందు పాతనిబంధన కాలములో ప్రవక్తలకు వెళ్ళేవాడు/ప్రత్యక్షమయ్యేవాడు. [ఆది.కాం.15:1; 1రాజులు.6:11; యిర్మీయా 2:1; మీకా.5:2]
‘దేవుని వాక్కు’ శరీరాన్ని ధరించి యేసు క్రీస్తుగా ఈ లోకములో జన్మించక ముందు దేవుని రూపాన్ని [గ్రీకు: మోర్ఫె] కలిగి ఉన్నాడు. [ఫిలిప్పీ.2:6]
‘దేవుని వాక్కు’ శరీరాన్ని ధరించి యేసు క్రీస్తుగా ఈ లోకములో జన్మించక ముందు దేవునితో/లో ఉండి దేవునిగా ఉన్నాడు. [యోహాను.1:1]
‘దేవుని వాక్కు’ దేవుని అస్తిత్వములోని భాగం, దేవునికి వేరై యున్న ఒక సృష్టము కాదు.
పై వివరణ అర్థం కాకున్న లేక మీకు వెరే అభిప్రాయం మున్నా దయచేసి స్పందించగలరు!
ప్రభువు కృప మీకు తోడై ఉండునుగాక!
మీ జవాబు కొరకు ధన్యవాగములు బ్రదర్_ కానీ మీ జవాబు వాక్యానుసారమైనది కాదు మీరు పెట్టిన రెఫరెన్స్లకు అర్ధము యేసు తాను మరి గర్భములో పుట్టకమనుపే దేవునిదగ్గర లేక యేసే దేవునిగా వుండి తరువాత శరీరాన్ని ధరించాడని చెప్పారు మీరు , కానీ బైబిలు అపోస్తలులు అలా చెప్పలేదు, గమనించండి, Hebrews(హెబ్రీయులకు) 9:26
26.అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.
ఇంకా
మీరు చెప్పినది అపోస్తలుల బోధయొక్క మూలసూత్రాలకు విరుధ్ధముగా వున్నది
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:50
50.సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:53
53.క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:54
54.ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
కాబట్టి
బ్రదర్ , యేసు _ తాను మరియ గర్భమందు పుట్టకమునుపే దేవునిదగ్గర లేక తానే దేవుడైవుంటే అప్పుడు ఆయన అక్షయుడు
కాబట్టి అపోస్తలుల బోధ ప్రకారము క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి కానీ మీరు చెప్పిన ప్రకారము అక్షయత క్షయతను ధరించుకున్నది అని అర్ధము వస్తుంది గమనించండి , ఎంత పొరపాటో అది .
బ్రదర్ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శాంతికలుగును గాక!
మీ స్పందనకు మా ధన్యవాదాలు. మీ అభిప్రాయాలకు లేఖనాల వెలుగులో మా వివరణను పరిశీలించి చూడండి…
మీమాట: మీ జవాబు వాక్యానుసారమైనది కాదు మీరు పెట్టిన రెఫరెన్స్లకు అర్ధము యేసు తాను మరి గర్భములో పుట్టకమనుపే దేవునిదగ్గర లేక యేసే దేవునిగా వుండి తరువాత శరీరాన్ని ధరించాడని చెప్పారు మీరు , కానీ బైబిలు అపోస్తలులు అలా చెప్పలేదు.
మాస్పందన: అది మీ అభిప్రాయం. లేఖనాల సాక్ష్యం మీ అభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకమైనది అన్నది క్రింది లేఖనాలను చదవగలిగే ఎవరికైనా యిట్టే అర్థమయ్యే సత్యం.
“ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” (యోహాను.1:2-3)
“నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.” (యోహాను.6:38)
“అలాగైతే మనుష్యుకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు?” (యోహాను.6:62)
“యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.” (యోహాను.8:14)
“మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమి్మతిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:27-28)
“కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)
“యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని [I am, not I was] మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” (యోహాను.8:58)
“బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.” (మీకా.5:2)
మీ అభిప్రాయం: మీరు చెప్పినది అపోస్తలుల బోధయొక్క మూలసూత్రాలకు విరుధ్ధముగా వున్నది.
బ్రదర్ , యేసు _ తాను మరియ గర్భమందు పుట్టకమునుపే దేవునిదగ్గర లేక తానే దేవుడైవుంటే అప్పుడు ఆయన అక్షయుడు కాబట్టి అపోస్తలుల బోధ ప్రకారము క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి కానీ మీరు చెప్పిన ప్రకారము అక్షయత క్షయతను ధరించుకున్నది అని అర్ధము వస్తుంది గమనించండి , ఎంత పొరపాటో అది .
మా వివరణ: యేసు ప్రభువు తాను మరియ గర్భమందు శిశువుగా పుట్టకమునుపే ఉనికిని కలిగి ఉన్నవాడు అన్నది అనేక లేఖనాల సాక్ష్యం. ఆ స్థితిలో ఆయన అక్షయుడే. 1 కొరింథీ.15వ అధ్యాయములోని వివరాలు క్షయత అక్షయతను ధరించు కోవాటాని గురించినది. అలాగని, అక్షయత క్షయతను ధరించుకోవటానికి వీలులేదు అన్న సూత్రమేదీ అక్కడ చెప్పబడలేదు.
పైపెచ్చు, అక్షయత క్షయతను ధరించుకున్న వైనాలు బైబిల్ లోనే అనేకం ఉన్నాయి.
“మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి.” (ఆది.కాం.18:1-2)
“యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను…అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.” (ఆది.కాం.32:24..28)
“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.” (యోహాను.1:1-2,14)
“క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.” (ఫిలిప్పీ.2:5-7)
సైతాను
ఈ సైతాను అనే విషయములో మీతోపాటు చాలామంది సంఘాలు లేక సిద్ధాంతాలు చాలా వున్నాయి కానీ అవి అన్నీ బైబిలు బోధకు తెలియని విషయాలు,
అసలు సైతాను అం టే అర్ధము కేవలము “విరోధి” అని ఈ విరోధి ఎవరికి ఎవరికైనా కావచ్చును, అందులో మానవాతీత , దైవవిరుధ్దమైన , దుష్టశక్తిగల , చావులేని జీవి , అనే అర్ధమేరాదు .
అది కేవలము కల్పితము మాత్రమే.
మనకు చెడుగుగా కనిపించేదంతా సైతాను వలన కలుగుతుందని మంచి విషయాలు లేక సకలమైన మేలంతా దేవునివలన మాత్రమే కలుగుతుందని అనుకోవడము పొరపాటు.
ఉదా :- యోబు
Job(యోబు గ్రంథము) 2:10
10.అందుకతడు మూర్ఖురాలు మాటలాడు నట్లు నీవు మాటలాడు చున్నావు; మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు.
మనము దేవుని వలన కేవలము మేలు మాత్రమే కాదు కీడును కూడా అనుభవిస్తాము సైతాను వలన కాదు.
మూలము విషయానికి వస్తే
అసలు ఈ సైతానును గురించి మోషే ఒక్క మాటకూడా ఎక్కడా చెప్పలేదు తన ఐదు గ్రంధాలలో ఎక్కడా.
మోషే వ్రాసిన బైబిలులోని మొదటి ఐదు గ్రంధాలలో ఎక్కడా “సైతాను” అనే మాట ఉపయోగించలేదు(గమనించండి)
ఈమాట మొదటి సారి బైబిలులో
Numbers(సంఖ్యాకాండము) 22:22
22.అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి.
ఈ పై వచనములో “విరోధి” అని చెప్పబడిన మాట దేవదూతను గురించి (విరోధి — సైతాను హెబ్రీపదమే) ఇక్కడ దేవదూతను సైతాను అన్నారు.
1 Samuel(మొదటి సమూయేలు) 29:4
4.అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి-ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధియవు నేమో, దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును? మనవారి తలలను ఛేదించి తీసికొని పోవుటచేతనే గదా తన యజమానునితో సమాధానపడును.
పై వచనములో దావీదును విరోధి(సైతాను) అన్నారు.
2 Samuel(రెండవ సమూయేలు) 19:22
22.దావీదు-సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలువారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? యిప్పుడు నేను ఇశ్రాయేలువారిమీద రాజు నైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమా ణముచేసి
పై వచనములో సెరూయా కుమారులను దావీదు మీరునాకు విరోధులా(సైతాను) అన్నాడు
2 Samuel(రెండవ సమూయేలు) 24:1
1.ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి-నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
compare
1 Chronicles(మొదటి దినవృత్తాంతములు) 21:1
1.తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా… లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా
పై రెండు వచనాలను సరిపోల్చితే దేవుడినే సాతానని సంబోధించనట్లు తెలుస్తుంది(గమనించండి)
ఇంకా క్రొత్తనిబంధనలో యేసు పేతురును “సైతానా ” అని సంబోధించడము మనకుతెలిసిందే
సైతానంటే పాపముచేసి పడిపోయిన దేవదూత అనేది సాధారణమైన బోధ ప్రచారములోవున్నది కానీ
యేసు బోధప్రకారము చనిపోయి చిరిలేచినవారు దేవదూతలవలె వుంటారు మనకు తెలిసింన విషయమే చనిపోయి తిరిగిలేచినవారు ఇంక మరణించరు వాళ్లు ఇకమీదట పెండ్లికీయబడరు పెండ్లి చేసుకోరు _
అలాంటప్పుడు దేవదూతలు మనుష్యుల కుమార్తెలను ఎలా పెండ్లిచేసుకొంటారు?
ఇంకొక విషయము
యెషయా 14:12
Isaiah(యెషయా గ్రంథము) 14:12
12.తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?
ఈ వచనములో చెప్పబడినది ఒక దేవదూత అని , ఆ దూత తననితాను దేవునితో సమానముగా భావించాడనీ బోధిస్తారు కానీ అలాంటి ఆధారమేది లేదక్కడ, అది కల్పితము మాత్రమే.
ఈ వచనములో కేలము kjv బైబిలులో మాత్రమే “లూసిఫర్” అనే పదము ఉపయోగించారు ఆ మాటను తెలుగులో “తేజోనక్షత్రము” అన్నారు .
ఆ మాటకొస్తే యేసుకూడా తేజోనక్షత్రమే
Revelation(ప్రకటన గ్రంథము) 22:16
16.సంఘములకోసము(మూలభాషలో సంఘములమీద) ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.
కాబట్టి ఇది కేవలము కల్పితమే
ఇక యెషయా 14:12 లో ఎవరిని గురించి ఆ విధముగా చెప్పబడిందిమరి?
Isaiah(యెషయా గ్రంథము) 14:4
4.నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను.
అని బబులోను
రాజునుగురించి పాడే అపహాస్యపుగీతము ఇది అనగా నెబుకద్నేజరును గురించి పాడిన పాట నిజమేనా?
Daniel(దానియేలు) 4:28,31,33
28.పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను.
31.రాజు నోట ఈ మాటయుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.
33.ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభవించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డిమేసెను, ఆకాశపుమంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను.
పై వచనాలు గమనిస్తే ఇది అక్షరాలా బబులోను రాజైన నెబుకన్దేజరునకు సంభవించినదని తేటగా తెలుస్తుంది , కాట్టి మనవాళ్లు బోధించే సైతాను ఎక్కడ?
ఇంక మనుష్యులకు సంభవించే కీడు విషయమైతే దేవుడు తానే ఈ కీడునంతా రప్పించేవాడని బైబిలు చదివితే తెలుస్తుంది ఉదా:-Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 28:15
15.నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. – — – – ఈ అధియాయము చివరిదాకా మొత్తము చదవండి .అప్పుడు దేవుడు ఎలాంటి కీడు కలుగజేస్తాడో తెలుస్తుంది ,
కుంటితనము , గుడ్డితనము , అవయవ లోపము ఇవన్నీ దేవునివలననే జరుగుతావి ఇక మిగలిమది శోధన
దేవుడు ఎవరినీ కీడువిషయమై శోధింపడు , యాకోబు 1:23 మవకు తెలిసినదే , అలాగే ఆతరువాత వచనము
James(యాకోబు) 1:14,15
14.ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.
15.దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
ఎవడుకూడా బయటనుండి శోధింపబడడు కానీ తన “స్వకీయ” దురాశ వలన అంటే ఎవరి పాపము భాధ్యత వారిదే ఎవరినీ నిందించడానికి వీలులేదు ఈ విెషయములో యేసు –
Matthew(మత్తయి సువార్త) 15:18,19,20
18.నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?
19.దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును
20.ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.
ఇవన్నీ మనుష్యునిలోనుండి వస్తాయి అనగా బయటినుండి లోనివెళ్లి మనుష్యుని పాపము చేయడానికి కారణమయ్యేదేదీలేదు కేలము మన స్వకీయమైన దురాష అన్ని పాపములకూ కారణము.
అందు వలన సహోదరులారా సైతాను అనేది కేవలము కల్పితము మాత్రమే బైబిలు బోధ కాదు ,
బ్రదర్, సైతాను అన్న అంశం గురించి ప్రస్తావిస్తూ కూలంకశంగా వ్యాసాలేవీ ఈ వెబ్సైటులో వ్రాయబడలేదు. అయినా దాన్ని ఒక అంశంగా తీసుకొని మీ అభిప్రాయాలను తెలియచేసారు. ఈ విశయములో మీరు తెలియచేసీన కొన్ని విశయాలు లేఖనానుసారంగా ఉన్నా మీ అభిప్రాయాల సమగ్ర సారాంశం మాత్రం బైబిల్ బోధకు వ్యతిరేకంగా ఉంది.
బైబిల్ మూల భాషలో ఉపయోహించబడిన “సాతాను” అన్న పదం “విరోధి” మరియు “అపవాది” అన్న భావార్థాలను కలిగి ఉన్న పదం. ఈ పదం బైబిల్ లో ఆయా సందర్భాలలో వివిధ వ్యక్తులకు ఉపయోగించబడింది. అయితే, ప్రధానంగా విశ్వాసులకు విరోధిగా ఉంటూ వారిని దేవునినుండి దూరంగా తీసుకువెళ్ళే ప్రయత్నములో ఉన్న ఆత్మీయ జీవిని ఉద్దేశించి ఉపయోగించబడింది.
యోబు గ్రంథములో విస్పష్టముగా పేర్కొనబడిన “విరోధి” లేక “అపవాది” [సాతాన్] ఒక ఊహా జనిత పాత్ర కాదు. ఆ ఆత్మీయ జీవికి మరియు ప్రభువైన దేవునికి మధ్య జరిగిన సంభాషణ కూడా ఒక ఊహ కాదు.
మానవులను ముఖ్యంగా విశ్వాసులను పరీక్షించేందుకు ప్రభువైన దేవుడు “అపవాది” [సాతాన్] అయిన ఒక ప్రత్యేక ఆత్మీయ జీవిని ఉపయోగించగలడు అన్నది యోబు గ్రంథములో బయలుపరచబడిన ఒక గొప్ప ఆత్మీయ సత్యం!
విస్వాసులకు విరోధి లేక అపవాది అయిన ఈ ఆత్మీయ జీవి మానవుల పతనానికి దోహదపడిన సర్పాన్ని సూచిస్తూ ప్రకటన గ్రంథములో “ఘటసర్పము” గా చిత్రీకరించబడింది. [ప్రకటన.12:1-17]
మోషే ద్వారా యివ్వబడిన పంచకాండాలలో “సాతాన్” అన్న పదము ఉపయోగించబడలేదు. అంతేకాదు, ఆ పంచకాండాలలో “అపవిత్రాత్మలు” అన్న పదం కూడా ఉపయోగించబడలేదు. కనుక, అపవిత్రాత్మలు అసలు ఉనికిలేని కల్పిత పాత్రలు అనా మీ అభిప్రాయం…?!
మీరు వ్యక్తిగతంగా సాతాన్ అనే ఆత్మీయ జీవి లేదని నమ్మినా లేక ఉంది అని నమ్మినా ఆ నమ్మకం రక్షణను ప్రభావితం చేయదు. కాని, బైబిల్ బోధను తప్పుబట్టడం లేక బైబిల్ లో ఉన్నదాన్ని లేదని లేనిదాన్ని ఉన్నదని వాదించటం రక్షణను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కనుక, బ్రదర్ దయచేసి ఈ అంశము విశయములో బైబిల్ యొక్క సమగ్ర బోధను సరిగ్గా పరిశీలించి సరియైన నిర్ణయానికి రావలసిందిగా మీకు మా ఆహ్వానం! దేవుడు మిమ్ములను సర్వసత్యములోకి నడిపించును గాక!