అవిశ్వాసి అపనిందల ప్రశ్నలు

అవిశ్వాసి అపనిందల ప్రశ్నలు

July 10, 2019 ప్రశ్నలు ముస్లీంల ప్రశ్నలు 0

అపనిందల ప్రశ్నలు

_____________

“సోదరీ, సోదరులైన ప్రపంచ క్రైస్తవ బోధకులారా!విశ్వాసులారా!!

…నేను బైబిల్ చదవగా (మత్తయి 26:24,28,56 మార్కు9:12,13 లూకా24:25-27,44-48 అ; కార్య3:8,10:43 &1వ కోరింథీ15:3-5) లలో చెప్పిన మారుమనస్సు, పాపక్షమాపన, చనిపోయి లేచుట అను విషయాలు గురించి సమస్త ప్రవక్తలు ముందే రాసారని, చెప్పారని ఉంది. అయితే (ఆది-మలాకి వరకు) యే ఒక్క ప్రవక్త ఒక్క చోటగాని, ఒక్కమాటగాని చెప్పిన దాఖలాలు లేవు. ఎక్కడా ఒక్కలేఖనం లేదు. దేవుని వాక్కు అసలే లేదు.అయితే నాలాంటివాడు మిమ్ములను అడిగినప్పుడు ఆధారాలు చూపాలి…అడిగినవాటికి లేఖనాలు లేనట్లా? ఉన్నట్లా? లేనట్లయితే యేసు మొదలుకుని క్రొత్తనిబంధన బోధకుల బ్రతుకులు ఏంటి?సమాధానం కోరుతున్నాను”

______________
ఇట్లు,
అవిశ్వాసి [అసత్యానికి దాసోహమైన]

విశ్వాసి వివరణ

దైవోక్తులు (లేఖనాలు) అన్నవి కొన్నిసార్లు అస్పస్టంగా మరికొన్నిసార్లు నిగూఢంగా యివ్వబడటము సహజం. ఇక భవిశ్యత్తుకు సంబంధించిన ప్రవచనాలైతే (భవిశ్యవాణి) యింకెంతో మర్మఘర్భితంగా యివ్వబడుతాయి అన్నది లేఖనాలనుగూర్చిన కనీసజ్ఙానమున్న ఎవరికైన యిట్టే అర్థమయ్యే విశయము. ఈ కారణాన్ని బట్టి ధార్మిక గ్రంథాలను పరిశోధించే విజ్ఙులు తమకు అర్థంకాని లేక గ్రహించలేని ప్రవచనాలతో కూడిన ధార్మిక వివరాలను బట్టి ఆ గ్రంథాలను తప్పుబట్టే ప్రయత్నము చేయరు.

అయితే ఇహలోక మతచాందసులు మాత్రం తమ మతం సహితం అధారముగా తీసుకున్న మూలమతాలనుకూడా తప్పుబడుతూ వాటి లేఖనగ్రంథాలను తిరస్కరిస్తూ తమ తర్కరాహిత్య కుసంస్కారాన్ని అందరిముందూ ప్రదర్శిస్తుంటారు. అలాంటివారిది యితరమతాలపై యితర గ్రంథాలపై దుమ్మెత్తిపోస్తేనేగాని తమ మతాన్ని అమాయకులకు నమ్మబలికే విధంగా ప్రచారంచేసుకోలేని దౌర్భాగ్య స్థితి. అది వారి మతం యొక్క దివాళుకోరుతనానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటివారికి దైవసత్యం అవగతం కాదు. వారికివ్వబడిన దైవసత్యమన్నది బూడిదెలో పోసిన పన్నీరులాంటిది. నిజానికి ఈసా అల్-మసీహ్ [యేసు క్రీస్తు] అలాంటివారి నుద్దేశించే ఇంజీల్ గ్రంథములో ఈమాట చెప్పాడు:

పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్ట వద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయొద్దు. అలాచేస్తే పందులు వాటిని కాళ్ళతో తొక్కేస్తాయి. కుక్కలు మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో.” (ఇంజీల్, మత్తయి 7:6)

ఈ సందర్భంగా ప్రశ్న అడిగిన విధానాన్నిబట్టి ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి యొక్క నైజము ఈసా అల్-మసీహ్ [యేసు క్రీస్తు] వారి మాటలలోని ప్రాణుల నైజానికి ధీటుగా వున్నా ఆ ప్రశ్నలో లేవనెత్తబడిన అంశాలకున్న చెల్లుబాటును బట్టి సత్యాన్వేశకులైన విజ్ఙులెవరైనా వుంటే వారికి ఉపయుక్తకరంగా వుండేందుకై అడగబడిన ప్రశ్నకు వివరణతోకూడిన జవాబే క్రింద యివ్వబడిన స్పందన.

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో [తౌరాత్, జబూర్, ఇంజీల్] మానవకోటి మనుగడకు అవసరమైన అత్యంత ప్రధానమైన సత్యాలన్నీ అందించబడ్డాయి. ఇహలోకానికి మరియు పరలోకానికి సంబంధించిన సత్యాలన్నీ క్రోడీకరించబడి అక్షర రూపంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిలుగా భద్రం చేయబడ్డాయి. అందుకే బైబిలును దైవ గ్రంథమని, పరిశుద్ధ గ్రంథమని, లేఖనాలని వివిధ పేర్లతో పేర్కొనడం జరుగుతుంది. ఈ గ్రంథంలోని అతిప్రధానమైన సత్యం మానవ కోటిని పాపము యొక్కయు మరియు సాతానుయొక్క దాసత్వాలనుండి రక్షించి పరలోక ముక్తిని ప్రసాదించే దైవాంశసంభూతుడైన ఈసా అల్-మసీహ్ [యేసు క్రీస్తు] ను గూర్చినది.

బైబిలుకున్న విశిష్టతలలో ఒకటి యదార్థ హృదయంతో దేవుని అన్వేషిస్తున్నవారి గ్రహింపు స్తోమత యేస్థాయిలో వున్నా వారి స్థాయికి తగిన విధంగా విశదమయ్యే వివరణలు కలిగి వుండటమే. పండితులూ, పామరులూ యింకా చెప్పలంటే సాధారణ వ్యక్తులూ అందరూ ఆకళింపు చేసుకోగలిగే విశయాలు ఈ గ్రంథములో వున్నాయి. అయితే, ఈ గ్రంథాన్ని ధ్యానించటానికి సమీపించే వ్యక్తి యదార్థ హృదయంతో సత్యాన్వేశకునిగా గ్రంథాన్ని సమీపించాలి. మూఢత్వం, అహంకారం, స్వనీతి, ముందే నిర్ధారించుకొన్న అభిప్రాయాలు, తప్పులు వెదకాలన్న కుయుక్తి మొదలైనవాటితో బైబిలును సమీపించే వారికి సత్యం అవగతం కాకపోగా వారి స్వభావాన్ని ప్రతిబింబించే అపార్థాలే పుట్టుకొస్తాయి.

బైబిలులోని సత్యాలను కొందరు గ్రహించలేకపోవడానికి బైబిలు తెలియచేస్తున్న ఐదు కారణాలు

1) కొందరు బైబిలును అసలు చదవకుండానే లేక ఆసాంతము చదవకుండానే లేక దాన్ని చదవాల్సినవిధంగా చదవకుండానే యెవరో చెప్పిన మాటలు విని వాటిని నమ్మి బైబిలుగురించి తప్పుడు అవగాహనను యేర్పరచుకొని ఆ అజ్ఙానములో కొనసాగుతుంటారు. ఆ విధానము వారిని నాశనమార్గము వైపుకు నడుపుతుంది. అలాంటివారికి దైవసత్యం యెప్పటికీ అందదు. (మత్తయి 22:29)

2) కొందరు అబద్దికులును మరియు మోసగాడ్రునై యుండి యితరులను దురాత్మల బోధలలోనికి తీసుకొనివెళ్ళే ప్రయత్నంలో భాగంగా బైబిలులో తప్పులు వెదికేందుకే దాన్ని పఠిస్తారు. అలాంటివారికి అందులోని సత్యం ససేమిరా అవగతం కాదు. (1తిమోతి 4:1-2)

3) కొందరు తమ మూర్ఖత్వాన్నిబట్టి మోసపోయిన కారణంగా వారి మనోనేత్రాలకు సాతానుడు అంధకారం కలుగజేశాడు. అలాంటివారికి బైబిలులోని సత్యాన్ని వీక్షిచడము అన్నది అసాధ్యమైన విశయం. (2 కొరింథీ 4:4)

4) కొందరు అహంకారంతో దైవసత్యాన్ని తిరస్కరించి అవిధేయతతో స్వనీతిపై ఆధారపడుతూ తమ స్వంత ప్రయత్నాలతో ముక్తిని సంపాదించుకునే ప్రయత్నాలను చేస్తుంటారు. అలాంటివారి హృదయాలను సృష్టికర్తే కఠిన పరచడం జరుగుతుంది. కనుక అలాంటివారు సత్యాన్ని గ్రహించలేక అసత్యములోనే కొనసాగుతుంటారు (కీర్తనలు 81:11-12; యెషయా 6:9-10; మత్తయి 13:13-15; 2 థెస్సలోనీకయులకు 2:9-12). అలాంటి వారికి కూడా బైబిలులోని దైవసత్యం సుదూరం.

5) చివరగా, కొందరికి వారికున్న అజ్ఙనాన్నిబట్టి అలాగే మందమతినిబట్టి హృదయాలు మూయబడివుంటాయి. ఈ కారణాన్నిబట్టికూడ కొందరు లేఖనసత్యాన్ని గ్రహించలేరు. అయితే అలాంటివారు యదార్థ హృదయముతో దేవున్ని ప్రేమిస్తూ సత్యాన్ని అన్వేశిస్తున్నట్లయితే వారు లేఖనాలలోని దైవసత్యాన్ని గ్రహించేందుకు వీలుగా వారి హృదయాలను ప్రభువే తెరవడం జరుగుతుంది (లూకా 24:25-32, 45).

ప్రశ్నలో పేర్కొనబడిన బైబిలు లేఖనాల వివరణ

(1) “24 మానవపుత్రుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది.” 25 ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసికొని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని మీరు తీసికొని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం…55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీదొంగ మీదకి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, 56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.” (మత్తయి 26:24-28…55-56)

పై లేఖనాల వివరాలను ప్రవచించిన పాత నిబంధన లేఖనాలు…

“12…ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను” (యెషయా 53:12)“

ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.” (జెకర్యా 13:7)

యేసు ప్రభువులవారు సెలవిచ్చిన విధంగా యెషయా 53:12 మరియు జెకర్యా 13:7 లోని ప్రవచనాల సారాంశము లుకా సువార్తలోని 26:55-56 లో నెరవేర్చబడింది.

(2) “12 యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది? 13 నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.” (మార్కు 9:12-13)

పై లేఖనాల వివరాలను ప్రవచించిన పాత నిబంధన లేఖనాలు…

యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. 6 నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.” (మలాకి 4:5-6)

3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు. 4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. 5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. 6 మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. 7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.” (యెషయా 53:3-7)

మార్కు సువార్త 9:12-13 వరకుగల లేఖనాలలో యేసు ప్రభువు వివరిస్తున్న విశయాలు ప్రవక్తలైన యేషయా (53:12) మరియు మలాకి (4:5-6) వ్రాసిన లేఖనాలలోని ప్రవచనాల సమిష్టి నెరవేర్పు అన్నది గుర్తించవచ్చు.

(3) “24 మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు. 25 అందుకాయన “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని చెప్పాడు. 27 ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి తెలిపిన మాటల అర్థాన్ని వారికి తెలియచేశాడు…44 తర్వాత ఆయన “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనలలోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచాడు.46 “క్రీస్తు హింసలు పొంది చనిపోయి మూడోరోజున చనిపోయిన వారిలోనుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకీ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.” (లూకా24:25-27…44-48)

పై లేఖనాల వివరాలను మర్మఘర్భితంగా ప్రవచించిన పాత నిబంధన లేఖనాలలోని మచ్చుకు కొన్ని…

ప్రవక్త అయిన మూసా [మోషే] వ్రాసిన లేఖనాలలోని ప్రవచనాలు:

15 మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.” (ఆదికాండము 3:15)“

16 ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిచొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. 17 మరియు యెహోవా నాతో ఇట్లనెను. –వారు చెప్పిన మాట మంచిది; 18 వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. 19 అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దానిగూర్చి విచారణచేసెదను.” (ద్వి.కాం. 18:16-19)

ప్రవక్త అయిన దావూద్ [దావీదు] వ్రాసిన కీర్తనలలోని ప్రవచనాలు:

6 నేను నరుడను కాను నేను పురుగును. నరులచేత నిందింపబడిన వాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను. 7 నన్ను చూచు వారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. 8 యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా! ఆయన వానిని తప్పించునేమో అందురు. 9 గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా! నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగానీవే గదా! నాకు నమ్మిక పుట్టించితివి. 10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, నా దేవుడవు నీవే. 11 శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు. నాకు దూరముగా నుండకుము. 12 వృషభములు అనేకములు నన్ను చుట్టుకొనియున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి. 13 చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు. 14 నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను. నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది. 15 నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను. నా నాలుక నా దవడను అంటుకొని యున్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు. 16 కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు. నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. 17 నా యెముకలన్నియు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. 18 నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.” (కీర్తనలు 22:6-18)

8 సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకనేను కదల్చబడను. 9 అందువలన నా హృదయము సంతోషించుచున్నదినా ఆత్మ హర్షించుచున్నదినా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది 10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు 11 జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.” (కీర్తనలు 16:8-11)

18 నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసి కొని యున్నావు.” (కీర్తనలు 68:18)

ప్రవక్త అయిన యెషయా వ్రాసిన లేఖనాలలోని ప్రవచనాలు:

1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. 2 అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు 3 నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును. 4 భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును. 5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 6 గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును 7 యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను. 8 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను. 9 మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. 10 సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. 11 అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక. 12 ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయు దురు గాక.” (యెషయా 42:1-12)

6 నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను. 7 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు. 8 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.” (యెషయా 49:6-8)

2 లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. 3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు. 4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. 5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. 6 మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. 7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. 8 అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు? 9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. 10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. 11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. 12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను.” (యెషయా 53:2-12)

(4) “8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయం లోకి వెళ్ళాడు…43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన పేరున పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నార” ని చెప్పాడు.” (అ.కార్య. 3:8…10:43)

పై లేఖనాల వివరాలను మర్మఘర్భితంగా ప్రవచించిన పాత నిబంధనలోని మచ్చుకు కొన్ని లేఖనాలు…

18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెన నెను.” (ఆదికాండము 22:18)

43 జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.” (ద్వి.కాం. 32:43)

1 అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. 2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును. ” (యెషయా 9:1-2)

11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.” (యెషయా 53:11)

14 సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దానియేలు 7:14)

23 నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితోమీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.” (హోషేయ 2:23)

1 ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించు టకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివా సులకొరకును ఊట యొకటి తియ్యబడును.” (జెకర్యా 13:1)

28 తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ ¸°వనులు దర్శనములు చూతురు. 29 ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును. 30 మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను 31 యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. 32 యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేము లోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:28-32)

11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు 12 పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే.” (ఆమోసు 9:11-12)

గమనిక: ప్రవక్తలు దేవుడు తన మసీహ్ ద్వారా [క్రీస్తుద్వారా] జనులందరిని అశీర్వదించబోతున్న విశయాన్ని ప్రవక్తల ద్వారా రకరకాలుగా పైన ఉదహరించిన విధంగా మర్మఘర్భిత వాక్కులద్వారా సూచించాడు. ఆ విశయమే అపోస్తలుల కార్యములు 10:43 లో ప్రవక్తల సమగ్రసారాంశముగా పేర్కొనబడింది.

(5) “1 సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ చెబుతున్నాను. మీరు దానిని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు. 2 మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు. 3 దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, 4 లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయన్ని మూడవ రోజున తిరిగి లేపాడు కూడా.” (1 కొరింథీ.15:1-4)

పై లేఖనాలలో గమనించాల్సిన ముఖ్య అంశాలు:

1. అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించాడు (వ.1)

2. అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్తలోని ముఖ్య భాగాలు:

– క్రీస్తు [మసీహ్] మన పాపాల కోసం చనిపోయాడు (వ.3) 
– క్రీస్తును [మసీహ్] సమాధి చేశారు (వ.3) 
– దేవుడు క్రీస్తును [మసీహ్] మూడవ రోజున తిరిగి లేపాడు (వ.3)

3 అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్తలోని ముఖ్యభాగాలకున్న మూలాధారం:

– దేవుడు అనుగ్రహించిన ఉపదేశం (వ.3) 
– లేఖనాలు (వ.3)

పై ముఖ్య అంశాలపై కొంత వివరణ:

లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు మరిముఖ్యంగా ప్రవచన భాగాలను పరిశోధిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విశయం ఉత్కృష్టమైన సత్యాలు దైవోక్తులలో చాలావరకు మర్మఘర్భితంగా యివ్వబడ్డాయి అన్న సత్యం. ఇందునుబట్టే సత్య పరిశోధకులు లేఖనాలను జాగ్రత్తగా మరియు లోతుగా ధ్యానించాల్సిన ఆవశ్యకత వుంది. అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్తలోని ముఖ్య భాగాలకున్న మూలాధారాలు రెండు.

(1) దేవుడే అనుగ్రహించిన ఉపదేశం. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణలో (inspiration) సువార్తనుగూర్చి పౌలుకు యివ్వబడిన ప్రత్యక్షతను (revelation) సూచిస్తున్నది. గమనించాలి, యిది పౌలు పాత నిబంధన లేఖనాలను చదివి గ్రహించిన సారంశము అని తలంచకూడదు. నిజానికి యిది ఆత్మావేశములో తిన్నగా దేవుని యొద్దనుండే యివ్వబడిన ప్రత్యక్షత.

(2) లేఖనాలు. ఇక్కడ లేఖనాలు (Scriptures) అన్న పదము పాత నిబంధన (Old Testament) మరియు క్రొత్త నిబంధన (New Testament) రెండు గ్రంథాలను సూచిస్తున్నది. ఈ సందర్భంగా గమనించాల్సిన విశయమేమిటంటే అపోస్తలుడు “లేఖనాల ప్రకారం” అన్నాడే కాని ధర్మశాస్తములో వ్రాయబడినట్లుగా అనిగాని లేక ఫలాన ప్రవక్త వ్రాసినట్లుగా అనిగాని చెప్పడం లేదు. ఒకవేల 1కొరింథీ.15: 1-4 వరకుగల వచనాలలో “‘క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు’ అని లేఖనాలలో వ్రాయబడినట్లు” అనిగాని లేక లేఖనాలలో “‘ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయన్ని మూడవ రోజున తిరిగి లేపాడు’ అని వ్రాయబడి వున్నట్లు” అనిగాని వుంటే అప్పుడు లేఖనాలలో సరిగ్గా అదే పదజాలాన్ని వెతికి చూడాల్సివచ్చేది. అంటే, లేఖనాలను యెత్తి వ్రాసినప్పుడు (copy) మాత్రమే వివరణలోని పదజాలము మూలములోని పదజాలముతో సమాంతరంగా వుండాలి (direct speech as opposed to reported speech). కాని వాస్తవమేమిటంటే అపోస్తలుడు అదివరకే యివ్వబడిన ప్రవచన లేఖనాలలోని సందేశాన్ని క్రోడీకరిస్తూ వేరే పదాలతో దాని సారాంశాన్ని వ్యక్తం చేసాడు (i.e.reported speech). అయినా అది ఆయన స్వంత యిచ్ఛను బట్టి కాదుగాని పరిశుద్దత్మ ప్రేరణలోనే (inspiration) అది చేశాడన్నది మరవకూడదు. ఇక్కడ గమనములో వుంచుకోవలసిన మరొక విశయమేమిటంటే “లేఖనాల ప్రకారం” అన్న పదజాలము యొక్క భావం లేఖనాల సారాంశము అని గ్రహించాలి. ఇందుకు సంబంధించిన లేఖనాల ఆధారాలు ఈ క్రింద యివ్వబడ్డాయి…

పాత నిబంధన లేఖనాధారాలు:

– కీర్తనలు 16:8-10 = అపోస్తలుల కార్యములు 2:31 & 13:35-39 
– కీర్తనలు 22:1,6-8,13-18 
– యెషయా 53:4-12 
– దానియేలు 9:24-26
– జెకర్యా 13:7

క్రొత్త నిబంధన లేఖనాధారాలు:

– మత్తయి.16:21
– మత్తయి.17: 22-23 
– మత్తయి.20:18-19, 28. 
– మర్కు.8:31
– మర్కు.9:31
– మర్కు.10:33-34

అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15:1-4 వరకుగల వాక్యాలలో వివరించిన సత్యాలన్నీకూడా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన గ్రంథాలలోనుండి పైన పేర్కొనబడిన లేఖనాల సారాంశమన్నది అత్మలో వెలిగించబడినవారు యిట్టే గ్రహించగలరు.

సత్యాన్ని ప్రేమిస్తూ అన్వేశిస్తున్న వారందరినీ దేవుడు/అల్లాహ్ దీవించి సర్వసత్యములోనికి నడిపించును గాక! ఆమెన్!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *